గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 29, 2014

కమలనాథన్ కమిటీ క్యాట్‌వాక్!

-బిల్డప్‌లే తప్ప ఒరిగిందేమీ లేదు
-56 వేల ఉద్యోగుల విభజనకు ఆరుమాసాలు
-అయినా జాడలేని మార్గదర్శకాలు
-ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులపై కూడా రాని స్పష్టత
-సాగదీసేయత్నమని టీ సంఘాల మండిపాటు
ఉద్యోగుల విభజన ఫైనల్ మార్గదర్శకాలను రూపొందించడంలో జరుగుతున్న ఆలస్యం మీద పలువురు మండిపడుతున్నాయి. కమలనాథన్ కమిటీ ఉద్ధేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నదని తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 56వేల మంది ఉద్యోగులను విభజించడానికి ఆరుమాసాల వ్యవధి చాలకపోతే, పూర్తి 5 లక్షల మంది ఉద్యోగులను విభజించడానికి ఇంకెంత కాలం పడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
kamalఫైనల్ మార్గదర్శకాలు ఇదిగో అదిగో అంటూ ఆగస్టు13 నుండి ఊరించడమే తప్ప అడుగు ముందుకు పడలేదని వారు విమర్శిస్తున్నారు. ఏదో రకంగా విభజనను మార్చివరకు సాగదీయాలనే ఉద్దేశం కనిపిస్తున్నదని వారంటున్నారు. టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యోగుల వేదిక, టీ.నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం, టీఎన్జీవో సెక్రటేరియట్ విభాగం తదితర సంఘాల నాయకులు విభజనలో జరుగుతున్న అనవసరజాప్యంపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మార్చినుంచి ఇదే తంతు.. కమల్‌నాథన్ కమిటీ మార్చిలో విభజన ప్రక్రియ ప్రారంభించింది. ఆగస్టు నెల చివరివరకు వచ్చినా ఇంతవరకూ చేసిందేమీ లేదు. చివరికి నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణ వారికి తెలంగాణకు, సీమాంధ్ర వారికి సీమాంధ్రకు బట్వాడా చేస్తామని ప్రకటించి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశంపైన స్పష్టతను ఇవ్వలేదని ఉద్యోగసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

ఉద్యోగుల విభజనకు ఏడు దశలు ఉంటాయని కమలనాథన్ కమిటీ చేసిన ప్రకటననను దృష్టిలో పెట్టుకొని నాలుగోతరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగుల బట్వాడాకు కూడా సప్తసముద్రాలు దాటాల్సిన అవసరం ఉన్నదా? అంటూ తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జానేశ్వర్ మండిపడ్డారు. నాలుగోతరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగుల పదవీవిరమణ 60 సంవత్సరాల వరకు ఉంటుందని, వీరిని ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికి బట్వాడా చేయడం వల్ల విధాన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఉద్యోగసంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఇంత సులభమైన ప్రక్రియను కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

క్యాడర్‌స్ట్రెంత్ ఓ తలనొప్పి..

కమలనాథన్ కమిటీ ప్రకటించిన క్యాడర్‌స్ట్రెంత్‌పై చాలా దుమారమే రేగింది. జిల్లా స్థాయి పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా, రాష్ట్రస్థాయి పోస్టులు జిల్లా పోస్టులుగా తారుమారు చేశారని టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టులలో 40వేల స్థానాలలో సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారని టీజీవో అధ్యక్షులు,శాసనసభ్యులు వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ గ్రీవెన్సెస్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కమలనాథన్ కమిటీకి అందచేసినా కమిటీ ఎటూ తేల్చలేదని వ్యాఖ్యానించారు.

సీమాంధ్రప్రాంతంలో ఇమడలేక స్వచ్ఛందంగా తెలంగాణకు వస్తామని తెలంగాణ ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నా వాటిపైన ఎందుకు మాట్లాడటం లేదని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్‌గౌడ్ ప్రశ్నించారు. అక్టోబర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల విభజనను పూర్తిచేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాలు మొత్తుకుంటున్నా కమిటీ మాత్రం కుంటినడకలు నడుస్తున్నదని వారంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి