గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 25, 2014

స్థానికత పేరిట నిధులకు గండి...!

-ఆంధ్రాకు రూ.234 కోట్లు.. తెలంగాణకు రూ.29 లక్షలు
-ఖనిజాభివృద్ధి శాఖలో ఆంధ్రాయిజం
-డీమెర్జర్‍లోనూ అంతులేని వివక్ష

ఉద్యోగుల పంపిణీలో స్థానికత వద్దే వద్దు.. ఆప్షన్లు ఇచ్చి ఇష్టమైన స్థానాల్లో కూర్చోబెట్టాలని ఆందోళనలు చేసిన ఆంధ్రా అధికారులు.. నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం స్థానికత ఆధారంగానే చేపట్టాలంటూ వింత వాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీ మెర్జర్ ప్లాన్‌లో స్థానికత అంటూ నిధులకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 


తెలంగాణ రెవెన్యూ అత్యధికంగా ఉన్న ఏపీఐఐసీలో రెండు రాష్ర్టాలకు జనాభా ప్రాతిపదికన నిధులను పంచారు. ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ 70 శాతం పైమాటే. దానిని కూడా జనాభా ప్రాతిపదికన పంచేశారు. ఈ సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు మాత్రం వర్తించదంటూ కొర్రీలు వేస్తున్నారు. తెలంగాణ నిధులతో ఆంధ్రాలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులపై తెలంగాణకు హక్కులు కోల్పేయేలా కుట్రలు చేస్తున్నారు.

తెలంగాణకు చేసిందేమిటి..?
తెలంగాణలో సహజ వనరులు, ఖనిజాలు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నా సమైక్య రాష్ట్రంలో ఖనిజాభివృద్ధి శాఖ తెలంగాణలో నెలకొల్పిన ప్రాజెక్టులు అతి తక్కువ. 1961 ఫిబ్రవరి 24న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమైక్య రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టులెన్ని? ఇందులో తెలంగాణకు ఇచ్చినవెన్ని..? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే.. వివక్ష, నిర్లక్ష్యమే సమాధానాలుగా వస్తాయి. 13 జిల్లాల్లో ఏడు మెగా ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని పది జిల్లాలకు ఏర్పాటు చేసింది.. ఒక్కటంటే ఒక్కటే. 


అంటే తెలంగాణలో ఖనిజ నిల్వలు లేవా..? ఇక్కడ ప్రాజెక్టు నెలకొల్పడానికి సరైన వసతులు లేవా..? అన్న అన్న సందేహం కలుగవచ్చు. కానీ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు మాత్రం తెలంగాణ నిండా వివిధ ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నాయి. మరి తెలంగాణ ప్రాజెక్టులు ఏర్పాటుచేయకపోవడానికి అసలు కారణం ప్రాంతీయ వివక్షే. ఖనిజాలు ఇక్కడ ఉన్నా దుర్భుద్ధితో ప్రాజెక్టులను అక్రమంగా సీమాంధ్రకు తరలించారు. ఖనిజాలు పుష్కలంగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం జరిగింది.

తెలంగాణకు రూ.29 లక్షలు.. ఆంధ్రకు రూ.234 కోట్లు
ప్రాజెక్టులు, ఇతర అంశాలను స్థానికత ఆధారంగా పంపిణీ చేయడం సబబే. కానీ, టెక్నాలజి అప్‌గ్రేడేషన్ ఫండ్‌ను కూడా దాని ఆధారంగానే పంపిణీ చేయడం పూర్తిగా అన్యాయం. తెలంగాణలోనూ ఈ నిధిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన జరిగి ఉండేది. స్థానికత ఆధారంగా అంటూ ఎంతటి వివక్ష చూపించారో.. తెలంగాణకు కేటాయించిన నిధిని చూస్తే స్పష్టమవుతోంది. తెలంగాణకు కేవలం 29 లక్షలు కేటాయిస్తే.. ఆంధ్రకు ఏకంగా 234 కోట్లు కేటాయించేశారు. కార్పొరేషన్‌లో ఆంధ్రా పెత్తనం కొనసాగుతుండటంతో తెలంగాణకు చెందిన జనరల్ మేనేజర్లు సైతం అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం చేయడం లేదు. తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని.. గతంలో కొందరు అధికారులపై వివక్ష ప్రదర్శించిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. 

నియామకం మీద నియామకం
2013, జూన్ 30న జీఓ నెం.2893 ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న టీఆర్‌కే రావును ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు అధికారంలో వచ్చాక దానిని రద్దు చేయకుండానే 2014, జూన్ 6వతేదీన జీఓ నెం.2366 జారీ చేస్తూ.. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శాలినీ మిశ్రాకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వ రంగ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కేవలం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గానే వ్యవహరించాలి. కానీ ఇక్కడ జేఏండీకి బదులుగా ఎండీగా ఉత్తర్వులు చేయడంతో బాధ్యతలు స్వీకరించిన శాలినీమిశ్రా తాను సీనియర్ ఐఏఎస్‌నంటూ కన్ఫర్డ్ ఐఏఎస్ అయిన టీఆర్‌కే రావుపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విభజన ప్రక్రియను సక్రమంగా పూర్తికాకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. డీ మెర్జర్ ప్లాన్ సీమాంధ్ర పక్షపాతంగా కొనసాగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే టీఎండీసీ మనుగడ సాధించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి