గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 07, 2014

అంతం కాదిది...ఆరంభమే!

- వర్సిటీ పేరు మార్చితే ఎందుకంత కుళ్లు?
- ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి ..
- మా బతుకు మాది.. మీ బతుకు మీది
- ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్
- ప్రొఫెసర్ విగ్రహం, పైలాన్ ఆవిష్కరణ
ఆంధ్ర నేతలూ.. పిచ్చిపనులు ఆపండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి లక్ష కోట్లతో రాజధాని కట్టుకునేవారు.. పిల్లల ఫీజులు కట్టుకోలేరా?మా పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం.

తెలంగాణలో పేర్లు మార్చాల్సిన సంస్థలు ఇంకా చాలా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పేరును ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీగా మార్చడంపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఎందుకు కుళ్లుకుంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చిపనులు మానుకొని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని ఆంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతిని పురస్కరించుకుని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 
kcrhandrasవర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటుచేసిన జయశంకర్ విగ్రహాన్ని, వర్సిటీ పేరును జయశంకర్‌సార్ పేరిట మార్పుచేస్తూ నెలకొల్పిన పైలాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో రూ.10 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహిళా వసతిగృహం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల విక్రయ కేంద్ర ప్రదర్శనను పరిశీలించారు. మన ఊరు.. మన కూరగాయలు పథకాన్ని ప్రారంభించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు.

తెలంగాణ కోసం జయశంకర్ చేసిన కృషిని వివరించిన కేసీఆర్.. తెలంగాణలో సార్‌కంటే గొప్పోడు ఎవరున్నారు? మా రాష్ట్రంలో మా సంస్థలకు మాకు నచ్చిన ప్రముఖు ల పేర్లు పెట్టుకుంటాం. మా తెలంగాణ యోధుల విగ్రహాలే పెట్టుకుంటాం. మీకెందుకు అభ్యంతరం? అందుకే వ్యవసాయ వర్సిటీకి జయశంకర్‌సార్ పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంస్థలకు పేర్లు మార్చుకోవ డం చూసి మింగుడు పడడం లేదు. అయినా ఊరుకునేది లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చేసిందే. దీనికి ఆంధ్ర నాయకులు కుళ్లుకుంటున్నారు. తెలంగాణలో పేర్లు మార్చాల్సిన సంస్థలు, విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ మార్చాల్సిందే.

kcrhandras1ఇప్పుడున్న విగ్రహాలెవరివో మనకే తెలియదు. మన పిల్లలకు ఏం చెబుతం? మార్పులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. మందిది మాకొద్దు..మాది మాకే కావాలి. జయశంకర్‌సార్ కూడా ఇదే విషయం పదేపదే చెప్పేవారు. ఆంధ్ర ప్రాంత నేతలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. చింత సచ్చినా పులుపు సావలేదన్నట్లు పిచ్చిపనులు మానుకోండి. మీ మానాన మీరు ఉండండి. మా మానాన మేం ఉంటాం. ఎవరి పని వారు చేసుకుందాం. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. మా రాష్ట్రంలోని పిల్లల ఫీజులు మేం చెల్లించుకుంటాం. మీ పిల్లల ఫీజులు మీరే చెల్లించుకోవాలి.చెల్లించేందుకు చేతకాకపోతే మా ఆచార్య జయశంకర్‌సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయితీ కల్పిస్తాం. చదివించుకోండి. లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టుకునే వారు మీ పిల్లల ఫీజులు కట్టుకోలేరా? సింగపూర్ తరహాలో రాజధానిని తీర్చిదిద్దుకుంటామని ప్రగల్భాలు పలుకొచ్చుగానీ పిల్లల ఫీజులు చెల్లించుకునేందుకు చేతగాదా? అని కేసీఆర్ అన్నారు.

పోరాట యోధుడు జయశంకర్

విద్యార్థి దశనుంచి ఉద్యమంలోకి అడుగుపెట్టిన జయశంకర్‌సార్ 75ఏళ్ల పాటు తెలంగాణ కోసం పరితపించిపోయారు. తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసేటప్పుడే వ్యతిరేకించిన మహా గొప్ప తెలంగాణ వాది జయశంకర్‌సార్. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి నీరుగారినా అధైర్యపడకుండా పోరాట పటిమ ప్రదర్శించారు. తెలంగాణ ప్రజల బాధలు, వెతలు తలుచుకొని నన్ను కౌగిలించుకొని ఏడిస్తే ఆయన కన్నీళ్లతో నా భుజం తడిసింది. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో జయశంకర్‌సార్‌ను మించిన వారెవ్వరూ లేరు. అందుకే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. రైతుల కష్టాలు చూసి కన్నీరు పెట్టుకున్న జయశంకర్ పేరు పెట్టడమే సమంజసం అని కేసీఆర్ చెప్పారు.

పొన్నాలకు సిగ్గుండాలి

విద్యుత్ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలపై ఆయన ధ్వజమెత్తారు. పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుండాలి. సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. 10ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది మీరే గదా. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసింది మీరు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అన్యాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులైనా ఏం జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నడు. 60 రోజులే కాదు గదా ఇంకా 30 రోజులు కూడా ఏం జరగదు.

చేసేదేదో పక్కా ప్రణాళిక ద్వారా చేసుకుంటూ పోతాం. అంతేకానీ గందరగోళంచేస్తే ఆందోళనకు గురికాబోం అని కేసీఆర్ చెప్పారు. ఐఏఎస్ అధికారుల కేటాయింపులు జరుగక అనేక ఇబ్బందులు పడుతున్నం. దమ్ముంటే పధానమంత్రి వద్దకు పోయి పని చేయించుకురా! ఫైళ్ల మీద సంతకాలు చేయించుకురా. ఇప్పటికే 20 లేఖలు రాశాం. పట్టించుకున్న పాపాన పోలేదు అని అన్నారు.

వర్సిటీకి గత వైభవం తేవాలి

భవిష్యత్తులో సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. త్వరలో యూనివర్సిటీకి వీసీని కూడా నియమిస్తాం. కావాల్సినన్ని నిధులు సమకూరుస్తాం. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇకనుంచి అనేక పరిశోధనలు జరగాలి. యాంత్రీకరణ పెంచాలి. సిబ్బందిని భర్తీ చేసుకోవాలి. ఈ విశ్వవిద్యాలయానికి గతవైభవం తీసుకురావాలి. దేశవ్యాప్తంగా విత్తనాలు సరఫరా చేసే విత్తనోత్పత్తి వనరులు తెలంగాణ ప్రాంతానికి ఉన్నాయి. మన రాష్ర్టానికి సరిపడే తిండి గింజలు, పండ్లు, కూరగాయలు మాత్రమే పండించాలి. ఎక్కువ శాతం ఉత్పత్తి విత్తనోత్పత్తిపైనే దృష్టి సారించాలి.

అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తాం. తెలంగాణలో ఎర్రజెక్క, నల్లరేగడి, చౌడు నేలలు, ఇసుక నేలలున్నాయి. ఏ నేల ఏ పంటలకు అనువుగా ఉంటుందనే విషయం నిర్ధారించి పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపడతాం. విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. అంకాపూర్, మల్కనూర్ సొసైటీలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. అన్ని జిల్లా రైతులను టీంల వారిగా విభజించి ఈ సొసైటీలను సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రిని ఆదేశించాం. ప్రస్తుతం ఉన్న విత్తన కంపెనీలు బై బ్యాక్ సిస్టమ్‌లోకి రావాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

మూడేళ్లలో విద్యుత్ కొరత అధిగమిస్తాం

ఎన్నికలకు ముందు 84 నియోజకవర్గాల్లో విద్యుత్ గురించి మాట్లాడాను. మొదటి సంవత్సరం విద్యుత్ కొరత అధికంగా ఉంటుంది. రెండో సంవత్సరం కొరత కొంత మేరకు తీరుతుంది. మూడో ఏడు నుంచి విద్యుత్ సమస్యను అధిగమిస్తాం. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదు. భవిష్యత్తులో వ్యవసాయరంగానికి 24గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుంది అని చెప్పారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం అంటేనే దండగ అన్న నేతలు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని, వ్యవసాయం అంటేనే పండగ అనే పరిస్థితికి తీసుకొస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బీ జనార్ధన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్సిటీ అధికారులు, సిబ్బంది సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

గ్రీన్‌హౌస్‌లతో విప్లవం తెస్తాం

kcrhandras2తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం చెప్పారు. రైతు బాధలు తెలిసిన వాడిని. నేనూ రైతునే. 40 నుంచి 50ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జిబిషన్‌లో కనిపించిన వాస్తవంగా బయట లేదు. ఆ విధంగా తీసుకురావాల్సి ఉంది. అందుకే పైలట్ ప్రాజెక్టులుగా వెయ్యి గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటుచేస్తాం. తెలంగాణలోనే గ్రీన్‌హౌస్‌లకు అవకాశం ఎక్కువ.

ఆంధ్ర ప్రాంతంలో తక్కువ. బీసీలు, దళితులు, గిరిజనులకే గ్రీన్‌హౌస్‌లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ల మేరకు గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసి, వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న తరహాలోనే సరఫరా చేస్తాం. అధిక చార్జీలు వసూలు చేయబోం. హర్యానా, బీహార్ రాష్ర్టాల తరహాలో గ్రీన్‌హౌస్‌లు తీర్చిదిద్దుతాం. గ్రీన్‌హౌస్ రైతులకు రుణ మాఫీ వర్తిస్తుంది. రైతులకు ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందించాల్సి ఉందన్నారు. మన రాష్ట్రంలో రోజుకు 110లక్షల టన్నుల కూరగాయల వినియోగం ఉంటుంది.

అయితే బోయిన్‌పల్లి మార్కెట్‌కు 50నుంచి 60లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నాయి. అందులో తెలంగాణ జిల్లాల నుంచి 3నుంచి 4లక్షల టన్నులు మాత్రమే వస్తున్నాయి. ఉత్పత్తి పెంచాల్సిన అవసరముంది. రైతులు అశాస్త్రీయంగా పండిస్తున్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పుడే వ్యవసాయం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది అని సీఎం పిలుపునిచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి