గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 30, 2014

నవ తెలంగాణలో ఉపాధి...

స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో గత అర్ధశతాబ్ద వలస పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి కేసీఆర్ నూతన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఇది చెప్పినంత సులువైనదేమీ కాదు. కానీ పాలకుల చిత్తశుద్దీ, ప్రజల సహకారం తోడైతే అసాధ్యం కూడా కాదు. తెలంగాణ వేరుపడిందన్న అక్కసుతో ఉన్న సీమాంధ్ర పాలకవర్గాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులు, చేనేత కార్మికులు, అసంఘటిత రంగాల్లోని వారు, ఆటోడ్రైవర్లు, గిరిజనులు, దళితులు మొదలైన వారి సమస్యలను చర్చించి పరిష్కారాలను త్వరితగతిన అమలు చేస్తున్నది. అలాగే రాజధానిలో, తెలంగాణ తొమ్మిది జిల్లాల్లో జరిగిన భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే తరహా పనివిధానంతో ముందుకు పోతే అక్రమార్కుల కోరలు విరిచివేయవచ్చు.

ఇప్పుడు మేధావులు,విద్యావంతులు ఆలోచించవలసిన అంశాలు ఉపాధి, విద్యా రంగాలు. ఉపాధి రంగంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉన్నది. తక్షణ కార్యక్రమంగా తీసుకుని వీరందరికీ ఉద్యోగాలు కల్పించాలి.అలాగే ప్రస్తుతం పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. విద్యావిధానంలోనూ సమూల మార్పులు చేయాలి. ఇప్పుడు అనుసరిస్తున్న విద్యావిధానం ఏమాత్రం ఉపాధి కల్పనకు అక్కరకు రాని చదువును అందిస్తున్నది. విదేశాల్లోని విద్యావిధానం చూస్తే..ఆయా దేశాల్లో మాండలికాలు, స్థానిక భాషలు ఎన్ని ఉన్నా ఆదేశంలో ప్రధానంగా 80 శాతం మంది ఒకే భాషను మాట్లాడుతారు. అందుకే ఆ ప్రధాన భాషలో విద్యా బోధన చేస్తారు. వారి బోధన శాస్త్రీయంగా నిత్యజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ విషయంలో మన దేశం చాలా భిన్నంగా ఉన్నది.

ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒకభాష మాట్లాడుతారు. అందులో కూడా ప్రాంతీయ మాండలికాలున్నాయి. ఈ పరిస్థితిలో ప్రాథమిక స్థాయిలో ఒకే మాధ్యమంలో విద్యాబోధన ఉండాలని కోరుకోవడం అసమంజసంగా ఉంటున్నది. ఇది కాదని ప్రపంచ భాష ఇంగ్లిష్ అని కోరుకుంటే మాతృభాష రాని దౌర్భాగ్య స్థితి ఉంటున్నది. ప్రఖ్యాత విద్యా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమంటే విద్యార్థులకు చెబుతున్న, చదువుతున్న చదువుతో జ్ఞానం పెరగాలంటే మాతృభాషలో పట్టు ఉండాలి. అలాగే భాషలు నేర్చుకోవడంలో చిన్నప్పుడు ఉన్న నైపుణ్యం పదకొండేళ్ల తర్వాత తగ్గుతూ వస్తుంది. అందుకే మన విద్యార్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివినా ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం రావడం లేదు.

నిజానికి ఇతర యూరోపియన్, ఇండియన్ భాషల కన్నా ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకోవచ్చు. ఇంగ్లిష్ రాదని బాధపడే విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంటున్నదని చెప్పి ఇంగ్లిష్ మీడియంలోనే చదవడం పరిష్కారం కాదు. నేడున్న విద్యావిధానంతో విద్యార్థికి ఏ భాషా సరిగారాని పరిస్థితి ఉన్నది. ఇలాంటి అసంబద్ధ విద్యావిధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తిపలకాలి. కాలానుగుణంగా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి.

దీనిలో భాగంగా మన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్థాయిలో మరో పరాయి భాష బోధించాల్సిన అవసరం లేదు. అలాగే సామాన్య,సాంఘిక శాస్త్రాలు, నీతిశాస్త్రాలు బోధించాల్సిన పనిలేదు. ఐదవ తరగతి దాకా ఏదో ఒక మాధ్యమం అనిగాక మూడు ప్రధాన భాషలు నేర్పాలి. 5వ తరగతి తర్వాత విద్యార్థి భాషా ప్రావీణ్యాన్ని బట్టి మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. పదేళ్లలోపు పిల్లలు ఎన్ని భాషలైనా సులభంగా నేర్చుకో గలుగుతారని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భాష అనేది వినడం, గమనించడం, అనుకరించడం, మననం చేయడం, స్థిరీకరించుకోవడం అనే ఐదు సహజమైన క్రియల ద్వారా నేర్చుకుంటారు. భాషను నేర్పే ఉపాధ్యాయులు భాషా ప్రవీణులై శాస్త్రీయ పద్ధతిలో బోధిస్తే పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. బోధనలో నైపుణ్యాలు లేకనే పిల్లలకు భాషపై పట్టురాదు. ఆ తరువాత 6వ తరగతి నుంచి 10 వ తరగతి దాకా ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాల పునాదిపై మిగతా శాస్త్రాలను, గణితాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. జ్ఞానాన్ని పొందుతారు.

కానీ సీబీఎస్సీ విధానంలో 4వ తరగతి దాకా రెండు భాషలు, 5నుంచి 8 దాకా మూడు భాషలు, 9, 10 తరగతుల్లో రెండు భాషలు చదవాలి. ఈ పుస్తకాలలోని భాష,విజ్ఞాన శాస్త్రాలలోని భాష వ్యక్తీకరణ కఠినంగా, హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. 6 నుంచి సీబీఎస్సీ విధానం అమలు చేయాలన్నా విద్యార్థులకు ఈ మూడు భాషల్లో ముఖ్యంగా ఇంగ్లిష్‌లో మంచి భాషా పరిజ్ఞానం ఉండాలి. దీనితో పాటు అన్ని స్థాయిల్లో, అన్ని పాఠశాలల్లో విద్యతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విధిగా ఉండాలి.

వ్యాసరచన, ఉపన్యాస పోటీల వంటి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి. నృత్యం, చిత్రలేఖనం, సంగీతంతో పాటు లలితకళలన్నింటినీ విద్యార్థులకు నేర్పించాలి. ఇవన్నీ ఆశించిన స్థాయిలో అమలు కావాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా మొదట ఉపాధ్యాయులు మంచి ప్రవీణులై ఉండాలి. చిత్తశుద్ధితో పనిచేసే, నిబద్ధత కలిగిన వారై ఉండాలి.

డిగ్రీ స్థాయి వచ్చేసరికి ఇంగ్లిష్ భాషా నైపుణ్యం బాగా ఉంటే ఇతర దేశాల్లోలాగా డిగ్రీ రెండేళ్లు ఇంగ్లిష్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ (ఇఎస్‌పీ) కోర్సులు ప్రవేశపెట్టి బోధించవచ్చు.అంటే ఏ ఫీల్డు వారికి ఆయా సబ్జెక్టులు ఉంటాయి. దీంతో విద్యార్థులు ఒక స్పష్టమైన ఆలోచనా దృక్పథంతో పాటు తాము చేయదల్చుకున్న పని, ఉద్యోగం, లేదా తాము ఎంచుకున్న రంగం పట్ల అవసరమైన నైపుణ్యాలతో బయటకు వస్తారు. అలాంటి వారికి ఉపాధి దొరకక పోవడం అనే సమస్యే ఉండదు. ఇక చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువత కోసం హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల్లో స్కిల్ ట్రేనింగ్ సెంటర్లు స్థాపించాలి.

వీటిలో గ్లోబల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలి. ఈ మధ్య చేసిన ఒక అధ్యయనంలో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థుల్లో 83 శాతం మందికి, జనరల్ డిగ్రీ చేసిన వారిలో 93 శాతం మందికి కనీస నైపుణ్యాలు లేవని తేలింది. అంటే విద్యార్థులు చదువుతున్న చదువులతో వారి జీవనానికి, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితిలోనే విద్యార్థులు ఉద్యోగాలు దొరకక సతమతమవుతూ ఉంటే.. అటు పలు సంస్థలు సరియైన నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అసంబద్ధ విధానం పోవాలంటే.. విద్యార్థులకు సకల నైపుణ్యాలు అందించే విద్యావిధానం అందుబాటులో ఉండాలి. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ప్రయత్నిస్తే.. బంగారు తెలంగాణ దిశగా నడక ప్రారంభమైనట్లే. 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి