గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 15, 2014

67 ఏండ్ల పాపాలను 67 రోజుల్లో కడుగలేం!

-విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి
-కేసీఆర్‌పై పొన్నాల, జానా విమర్శలు పీసీసీ కుర్చీకోసమే
-అధ్యక్షుడిని ఎన్నుకోలేని నిస్సహాయస్థితిలో టీటీడీపీ
-విపక్షాలపై విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు
ఈ అరవయ్యేడు ఏండ్లు అధికారంలో ఉన్నది మీరే. ఇన్నేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని 67 రోజుల్లో చేయాలని పసిగుడ్డులాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తెలంగాణకు మీరు చేసిన అన్యాయాలు, ఇంతకాలం చేసిన పొరపాట్లు సవరించడం అంత సులువైన పనేనా? ఇంతకాలం మీరు చేసిన పాపాలను కడగడం 67 రోజుల్లో సాధ్యమవుతుందా? అని రాష్ట్ర నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు కాంగ్రెస్, టీడీపీ నేతలపై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం కొద్దిసమయంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మంత్రిమండలిలో ఏకంగా 40కి పైగా అంశాలు ఆమోదిస్తే.. వాటిల్లో పది అంశాల అమలు మొదలైందని తెలిపారు. అసలు ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతికత లేదని స్పష్టం చేశారు. విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
harish
తెలంగాణలో నాలుగేండ్లుగా రైతులు నష్టపోతే వాళ్లకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పించడం చేతకాలేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అనంతపురంలో కరువు వస్తే రైతులకు పరిహారం ఇచ్చారు. కానీ తెలంగాణకు నయాపైసా ఇవ్వకుంటే మేమే వాళ్ల చాంబర్ల ఎదుట ధర్నా చేశాం. కానీ అధికారంలో ఉన్న జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కనీసం నోరు తెరచి అడిగారా? ఆ రోజు మీకు చేతగాక ఇప్పించకపోతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హామీ ఇవ్వకున్నా రూ.405 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఇది కేసీఆర్ చేసిన తప్పా? పీసీసీ కుర్చీని కాపాడుకునేందుకు పొన్నాల, దానిని దక్కించుకోవాలని జానారెడ్డి పోటీపడి మరీ ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

అసలు మీరు గత ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అతి తక్కువగా నల్లగొండ జిల్లాలో కేవలం 3,791 ఎకరాల భూమిని మాత్రమే దళితులకు పంపిణీ చేశారు. ఇన్నేళ్లు ఆ జిల్లాను ఏలిన జానారెడ్డి, మోత్కుపల్లి దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి...అని మంత్రి హెచ్చరించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి దళితులకు భూ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారని, ఇది కేవలం అంకురార్పణ మాత్రమేనని చెప్పారు. ఈ పథకాన్ని రానున్న ఐదేండ్లూ కొనసాగిస్తామన్నారు. ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేస్తే లేని తప్పు.. కేసీఆర్ గోల్కొండ కోటపై ఎగరవేస్తే ఎలా అవుతుందని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అసలు ఈ విమర్శ చేసే వారిది అజ్ఞానమా? మూర్ఖత్వమా? అని వ్యాఖ్యానించారు. దాశరథి, పీవీ నర్సింహారావు, జయశంకర్, అలీ నవాబ్‌జంగ్ వంటి తెలంగాణ బిడ్డల పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.

చంద్రబాబు బొమ్మను ఎందుకు తగులబెట్టరు?

తెలంగాణ సీఎం దిష్టిబొమ్మను టీఎన్‌ఎస్‌ఎఫ్ దహనం చేయడం, దానికి టీ టీడీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించడంపై హరీశ్ నిప్పులు చెరిగారు. ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటించని ఏపీ సీఎం చంద్రబాబు బొమ్మలను ఎందుకు తగలబెట్టడంలేదు? ఇది రాజకీయం కాదా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఏపీ సీఎం ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడి కుర్చీ కోసం మీలో మీరు కొట్లాడుకుంటుండ్రు. మీకో నాయకుడు లేడు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. మీరు తెలంగాణపై కుట్ర చేస్తున్న సీమాంధ్రుల పక్షమా? తెలంగాణ ప్రజల పక్షమా? తేల్చుకోండి అన్నారు.

చవకబారు విమర్శలు మానుకోండి

ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు ఇప్పటికైనా చవకబారు విమర్శలు మానుకోవాని ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి అన్నారు. ఈ సర్వే ద్వారా బీసీ గణన కూడా జరి గి, వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీలకు ఏదో చేస్తానని గొప్పలు చెప్పే చంద్రబాబు.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి, శాసనసభ, శాసనమండలిలో బీసీలను ఎందుకు నాయకుడిగా చేయలేదని ప్రశ్నించారు. సమావేశం లో మరో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ కూడా ఉన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి