గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఆగస్టు 06, 2014

గోల్కొండపై స్వాభిమాన ప్రకటన!


గోల్కొండ ప్రాకారంలోకి అడుగు పెడితే తెలంగాణ బిడ్డలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఆ రాతి గోడలను చూసినప్పుడు చరిత్ర పొరలలో నిక్షిప్తమైన అనేక తరాల రాతలు మస్తిష్కంలో మెదలాడుతుంటాయి. రాజులు, రాణుల రసరమ్య గాథలు, కరవాలాల ఖణఖణలు, కులీనుల విలాసాలు, కవితా గోష్టులు, నర్తకీమణుల అందెల గలగలలు... అన్నింటికీ మౌనసాక్షి మన గోల్కొండ దుర్గం.

దేశ స్వాతంత్య్ర వేడుకలను ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగుర వేసి జరుపుకుంటున్నట్టే, మన తెలంగాణలో గోల్కొండ కోటను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. గోల్కొండ కోటపై పతాకం ఎగుర వేయడమంటే అదొక - తెలంగాణ సమాజ స్వాభిమాన ప్రకటన. పరాయి పెత్తనంపై తెలంగాణ సమాజం సాధించిన విజయానికి సూచిక. గోల్కొండ కోటపై రెపరేపలాడే ఆ స్వాంతంత్య్ర పతాక కొత్త శకారంభాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వారసత్వం, నృత్యాలు, జానపద కళారూపాలు, కవుల చిత్రపటాలు మొదలైనవి ప్రదర్శించడం మన చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుకోవడమే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత జరుపుకుంటున్న తొలి స్వాతంత్య్ర వేడుకలోనే తెలంగాణతనం, స్వాభిమానం ప్రతిబింబించడమంటే- తెలంగాణ ఉద్యమ సందేశానికి కార్యరూపం ఇవ్వడమే. 
తెలంగాణ పురావైభవానికి ప్రతీక అయిన గోల్కొండ కోట వెయ్యేళ్ల చరిత్ర గలది! కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు కేంద్రంగా ఉన్నప్పుడు, దక్షిణ భాగానికి రక్షణగా దీనిని నిర్మించినా ఆ తరువాత కాలంలో పదహారవ శతాబ్దం నాటికి రాజ్యాధికార పీఠంగా విరాజిల్లడం మొదలైంది. అప్పుడప్పుడూ పరాధీనమైనా, స్వతంత్ర రాజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వ స్వాభిమాన చిహ్నంగా మారిపోయింది. హైదరాబాద్ నగరాన్ని నాలుగు వందల ఏండ్ల కిందట నిర్మించినప్పటికీ, నిజానికి అది గోల్కొండ కోట నగర కొనసాగింపే. ఆధునిక అవసరాల రీత్యా కొత్త హంగులు దిద్దుకున్నది. వందల ఏండ్ల తెలంగాణ జన జీవనానికి, ఇక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పోకడలకు సజీవ సాక్ష్యం గోల్కొండ దుర్గం. గోల్కొండ ప్రాకారంలోకి అడుగు పెడితే తెలంగాణ బిడ్డలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఆ రాతి గోడలను చూసినప్పుడు చరిత్ర పొరలలో నిక్షిప్తమైన అనేక తరాల రాతలు మస్తిష్కంలో మెదలాడుతుంటాయి. రాజులు, రాణుల రసరమ్య గాథలు, కరవాలాల ఖణఖణలు, కులీనుల విలాసాలు, కవితా గోష్టులు, నర్తకీమణుల అందెల గలగలలు... అన్నింటికీ మౌనసాక్షి మన గోల్కొండ దుర్గం. తెలంగాణ సమాజం మాదిరే గోల్కొండ దుర్గం కూడా ఇన్నాళ్ళు వివక్షను ఓరిమితో భరించింది. చారిత్రకంగా సంపద్వంతమైన ఈ అపురూప దుర్గాన్ని, ఈ కళారూపాన్ని పరిరక్షించుకోవాలె. చుట్టూరా ఉన్న కబ్జాలను తొలగించి ఆ ప్రాంతమంతా పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలె. ఆనాటి సామాజిక పరిస్థితులపై అనేక నవలలు వచ్చాయి. రాత ప్రతులూ ఉన్నాయి. వాటిని జన సామాన్యానికి అందుబాటులోకి తెస్తేనే తెలంగా ణ సమాజం తన గురించి తాను తెలుసుకోగలుగుతుంది. ఒక్క గోల్కొండనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోటలు మొదలుకొని బురుజుల వరకు అన్నింటినీ పరిరక్షించుకోవడం మన బాధ్యత. రాచకొండ కోట పరిరక్షణ కోసం ప్రజలు ఉద్యమించవలసి వచ్చింది. ఎక్కడో బియాస్ నది దగ్గరకు వెళ్ళడం కాదు, మన తెలంగాణలోని కట్టడాలను, నీటి పారుదల వ్యవస్థలను మన విద్యార్థులకు మొదట చూపించాలె.

గోల్కొండ కోటపై పతావిష్కరణను ప్రతీకాత్మక చర్యగానే భావించకూడదు. తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడంగా గుర్తించాలె. సీమాంధ్ర పాలకులు తమ వలస పెత్తనాన్ని స్థిరపరచుకోవడంలో భాగంగా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, భాషను అణగదొక్కారు లేదా కించపరిచారు. తెలంగాణ ప్రజలలో ఆత్మన్యూనత కలిగించే విధానాలను అమలు పరిచారు. ట్యాంక్ బండ్‌పై విగ్రహాలు పెట్టడమైనా, మీడియా ద్వారా అవమానించడమైనా, విశ్వవిద్యాలయాలకు, ఇతర సంస్థలకు తమ ప్రాంతీయుల పేర్లు పెట్టుకోవడమైనా ఈ అణచివేతలో భాగమే. తెలంగాణ స్వాభిమాన ఉద్యమంలో భాగంగా ఈ ప్రతీకలను తొలగించక తప్పదు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్.జి. రంగా పేరు తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెట్టడం కూడా ఇందులో భాగమే.

హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ గ్రంథాలయోద్యమకారుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి గ్రంథాలు అనేకం ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆనాటి సూచీ గ్రంథాలయానివి. ఈ గ్రంథాలయానికి వట్టికోట పేరు పెట్టాలని తెలంగాణవాదులు ఎంత కోరినా అంగీకరించని ఆనాటి పరాయి ప్రభుత్వం, పనిగట్టుకుని అందులో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం పెట్టింది. ఇప్పుడు తెలంగాణ వారు తమ సంస్థలకు తమ వైతాళికుల పేర్లను పెట్టుకుంటున్నారు.

సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు సాధనంగా చేసుకున్న ఆదికవి పాల్కురికి సోమనాథుడు, రాజుల చెంత చేరకుండా ఆత్మాభిమానం కాపాడుకున్న పోతన, తెలంగాణలో రచయితలే లేరని అహంకారంతో సీమాంధ్ర పెద్దలు అవహేళన చేసినప్పుడు- దానికి జవాబుగా గోలకొండ కవుల సంచికను ప్రచురించిన పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత సురవరం ప్రతాప రెడ్డి, దేశమే గర్వించదగిన దళిత ఉద్యమకారుడు భాగ్యరెడ్డి వర్మ- ఇట్లా అనేక మంది మహానుభావుల పేర్లు వివిధ సంస్థలకు పెట్టడంలో తప్పేమి లేదు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక వికాసానికి పథకాలు రూపొందించడానికే పరిమితం కాకుండా, చరిత్ర, సాంస్కృతిక, సాహిత్యాది రంగాలలో వలస అవశేషాలను కూల్చివేసి నవ సౌధాన్ని నిర్మించపూనుకోవడం అభినందనీయం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి