గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 17, 2014

అక్రమ కాలేజీలపై కొరడా...!


- సగం ఇంజినీరింగ్ కళాశాలలకు మంగళం
- అక్రమాలను బయటపెట్టిన టాస్క్‌ఫోర్స్ నివేదికలు
- ప్రమాణాలకే పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- నిబంధనలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు లేనట్లే
- తెలంగాణలో అందుబాటులో 141 ఇంజినీరింగ్, 61 ఫార్మసీ కాలేజీలు
- రెండు రాష్ర్టాలలో కలిపి 460 ఇంజినీరింగ్, 172 ఫార్మసీ కాలేజీలు 
- నేటి నుంచే వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం


రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తెలంగాణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న రాష్ట్రసర్కారు సాంకేతిక విద్యలో ప్రమాణాలకే పెద్దపీట వేయాలని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నది. అందుకే కోళ్లఫారాలలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలకు నడుం బిగించింది. ఇక ఆ కళాశాలలు మూతపడే అవకాశాలున్నాయి.
ఇటీవల జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీల తనిఖీలలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అసలు రంగు బయటపడింది. కళాశాలలు ఏఐసీటీఈ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనిఖీలు పూర్తి చేశాయి. కమిటీల నివేదిక ప్రకారం.. ప్రస్తుతం జేఎన్టీయూ, హైదరాబాద్ పరిధిలో తెలంగాణలో కొనసాగుతున్న 315 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కేవలం 141 కాలేజీలకు మాత్రమే యూనివర్సిటీ గుర్తింపు ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వర్సిటీ అనుమతి ఉన్న కాలేజీలను మాత్రమే ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చుతామని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు తెలంగాణ, సీమాంధ్ర అధికారులు డాక్టర్ రఘునాథ్, శ్రీనివాస్ పేర్కొన్నారు.


మిగిలిన 174 కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనుమతులు పొందని 174 కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏర్పాటైనవేనని, వాటిలో పిల్లలకు నాణ్యమైన విద్య అందక వారు ఇంజినీర్లుగా పనికిరాకుండా పోతారని కమిటీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరో 61 ఫార్మసీ కాలేజీలకు అనుమతులున్నాయి. జేఎన్‌టీయూ అధికారుల వ్యాఖ్యలను బట్టి త్వరలో జరుగనున్న రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో కూడా ఈ 174 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది.

ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్...ఆదివారం ఉదయం దాదాపు 9 గంటల నుంచి ప్రారంభం కానున్న తొలివిడత వెబ్‌కౌన్సెలింగ్‌లో



తెలంగాణ, సీమాంధ్రకు కలిపి 460 ఇంజినీరింగ్ కాలేజీలు, 172 ఫార్మసీ కాలేజీలు అందుబాటులో ఉంటాయి. రెండు రాష్ర్టాల్లో కలిపి మొత్తం 2,53,964 సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మాత్రం 1,84,575 సీట్లకు బదులుగా కేవలం 85,455 సీట్లను మాత్రమే చేర్చుతామని కౌన్సెలింగ్ క్యాంపు అధికారులు తెలిపారు.

18,564 ఫార్మసీ సీట్లలో కేవలం 10,910 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో సీమాంధ్రకు చెందిన ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇవికాక ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలలో కలిపి ఇంజినీరింగ్‌లో 7,184, ఫార్మసీలో 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి