గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 15, 2014

కేసీఆర్ చేసిందీ...చేస్తున్నదీ...చేయబోయేదీ...?

kcr-campగోల్కొండ కోటలో ప్రభుత్వం 68వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది. నవతెలంగాణలో తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... భారత జాతీయ ఉద్యమ చరిత్రను స్మరించుకోవాల్సిన సమయమిదన్నారు. 

తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానం:తెలంగాణ చరిత్రకు రాజధాని హైదరాబాద్ మకుటాయమానమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నవ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. బ్రిటన్ పార్లమెంటులో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బ్రిటీష్ పాలనలో గాంధీజీని గౌరవిస్తూ విగ్రహం ప్రతిష్ఠించడం గర్వకారణం. శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి ప్రతీక గోల్కొండ కోట. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్ర, వైడూర్యాల వ్యాపార కేంద్రం ఈ గోల్కొండ కోట అని కొనియాడారు.

ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన అన్ని హామీలను పటిష్టంగా అమలు పరిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గోల్కొండ కోట నుంచే దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎర్రజొన్న రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు 18 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.

ఆటోల, ట్రాక్టర్ల పన్ను రద్దు చేశాం:ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆటో పన్నును రద్దు చేశాం. అదేవిధంగా వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీల పన్ను బకాయిలను కూడా రద్దు చేశాం.

క్రీడాకారులకు తగురీతిలో ప్రోత్సాహం:రాష్ట్రంలో క్రీడాకారులను తగు రీతిలో ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒలంపిక్స్, ఆసియన్, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు రూ. 3 లక్షలు. పోటీల్లో స్వర్ణం గెలిస్తే 50 లక్షలు, రజతానికి 25 లక్షలు, కాంస్యానికి 15 లక్షల ప్రోత్సాహం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

12శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి:గిరిజనులకు, ముస్లీంలకు ఇచ్చిన మాటకోసం 12 శాతం రిజర్వేషన్ల కోసం కమిటీ ఏర్పాటు. ఐదు వందల జనాభా ఉన్న గిరిజనతండాలు, ఆదివాసీ గూడాలను పంచాయతీలుగా మారుస్తాం. అలాగే మైనార్టీల అభివృద్ధికి వెయి కోట్లు. వక్ఫ్ బోర్డుకు జూడిషియల్ అధికారులను కల్పిస్తాం. దళిత క్రైస్తవుల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. చర్చిల నిర్మాణానికి కలెక్టర్ నిబంధన తొలగిస్తాం.

దసరా నుంచి పింఛను పెంచి ఇస్తాం:దసరా, దీపావళి మధ్యకాలంలో వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి పింఛను అందించనున్నాం. అదేవిధంగా వికలాంగులకు రూ. 1500 పింఛను ఇస్తాం. గీతకార్మికులకు లబ్ది చేకురే విధంగా దసరా నుంచి నగరంలో కళ్లు దుకాణాలను తెరిపిస్తాం. రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీకి ఆర్‌బీఐ సహా ఇతర బ్యాంకులతో చర్చలు. స్థానిక సంస్థలకు అధికారాలు అప్పగించి జవాబుదారీతనం పెంచుతాం.

త్వరలోనే ఉద్యోగాల భర్తీ:పోలీస్ శాఖలో అతితర్వరలోనే 3,600 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పాం. అందుకు అనుగుణంగానే స్పెషల్ ఇంక్రిమెంట్ ను మంజూరుచేశాం. అదేవిధంగా నిరుద్యోగుల కోసం టీఎస్ పీఎస్ ద్వారా అతిత్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

క్రీడాకారులను సన్మానించిన సీఎం కేసీఆర్హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా కామన్వెల్త్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను సీఎం కేసీఆర్ సన్మానించారు. సైనా నెహ్వాల్, జ్వాత గుత్తా, పుల్లెల గోపిచంద్, జరీన్, మమతా పూజారి, గురుసాయి దత్, కశ్వప్, పీవీ సింధును శాలువాలతో కేసీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా వారికి నగదు ప్రోత్సహకాలను సీఎం అందించారు.

పూర్ణ, ఆనంద్‌లను సన్మానించిన కేసీఆర్హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్‌తో పాటు కోచ్ శేఖర్‌బాబును సీఎం కేసీఆర్ సన్మానించారు. శాలువాలతో సత్కరించి రూ. 25 లక్షల నగదు ప్రోత్సహకాన్ని అందజేశారు. పూర్ణ, ఆనంద్‌ను సీఎం సన్మానించిన వేళ అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఒక్కసారిగా అందరిలో ఉత్సహం పెల్లుబికింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి