గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 17, 2014

అక్రమార్కులకు గుండెదడ...!

- బినామీ పేర్లతో రెండో ఇల్లు..ప్రభుత్వ ఉద్యోగులకూ ఇండ్లు
- ఇందిరమ్మ ఇండ్ల విచారణలో బయటపడుతున్న నకిలీలు
cid
ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో నకిలీల భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన సీఐడీ విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణలో రోజుకో చోట కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన మహాముత్తారం మండలం పెగడపల్లిలో శనివారం సీఐడీ డీఎస్పీ ఎం మహేందర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. పెగడపల్లి పంచాయతీ పరిధిలోని పెగడపల్లి, ప్రేంనగర్, ఆంజనేయపల్లి, మామిడిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో మొదటి విడతగా 400 ఇండ్లు మంజూరయ్యాయి. 
55 ఇండ్లు అనర్హులకు కేటాయించినట్లు థర్డ్‌పార్టీ విచారణలో తేలింది. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమఇండ్లపై గ్రామంలో ఇంటింటా తిరుగుతూ విచారణ చేపట్టారు. చాలామంది గ్రామంలో నివసించడం లేదని ఉద్యోగరీత్యా కొందరు, మరికొందరు బినామీ పేర్లు సృష్టించి గృహాలు మంజూరు చేసుకున్నట్లు గుర్తించారు. 30 మంది వరకు ఉద్యోగులు, మిగతావాళ్లు బినామీలు ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ మహేందర్ హెచ్చరించారు. మంథని, హుజురాబాద్ నియోజకవర్గాల్లో అత్యధిక అక్రమాలు జరిగాయని తేలడంతో అక్కడే ముందుగా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

హౌసింగ్ అధికారులపై సీఐడీ ఆగ్రహం
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో హౌసింగ్ అధికారులను విచారించారు. ఇండ్ల మంజూరు ఎలా చేశారని డీఈ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులపై ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని డీఎస్పీ బాలూజాదవ్, లిఖితపూర్వక ఆధారాలు, రికార్డులు ఇవ్వాలని సూచించారు. గడువుకోరటంతో డీఈపై మండిపడ్డారు. 2007-08లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఏర్పాటైన ఎంహెచ్‌వో కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్లతో పాటు సర్పంచ్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లో పనిచేసిన అధికారులందరినీ విచారిస్తామని, పేర్లు, సెల్ నెంబర్ల జాబితా ఇవ్వాలనిఆదేశించారు. అక్రమాల్లో బాధ్యులైన అధికారులు,ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు, మధ్యవర్తులు, బినామీ కాంట్రాక్టర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని సీఐడీ డీఎస్పీ బాలూజాదవ్ స్పష్టంచేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి