-తెలంగాణ ఎండీని కాదని సొంత నిర్ణయాలు
-ఫైళ్లన్నీ ఆమెకే చేరుస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థలో సీమాంధ్రులు కర్రపెత్తనం చెలాయిస్తున్నారు. సంస్థకు తెలంగాణ వ్యక్తి ఎండీగా ఉండడం సహించలేక ఆంధ్ర సర్కారు జాయింట్ ఎండీగా ఐఏఎస్ అధికారిణి శాలినీమిశ్రాను నియమించింది. జాయింట్ ఎండీ ఆంధ్ర వ్యవహారాలు చూడడం మానేసి తెలంగాణ అంశాలు, ఉద్యోగుల విషయాల్లో వేలు పెడుతున్నారు. ఎండీ తీసుకున్న నిర్ణయాలు కూడా తిరస్కరిస్తూ కర్రపెత్తనం చెలాయిస్తున్నారు.-ఫైళ్లన్నీ ఆమెకే చేరుస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు
సంస్థలో పెద్దసంఖ్యలో కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్రులు శాలినీమిశ్రాయే ఎండీ అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఎండీ నిర్ణయాలు తీసుకున్న ఫైళ్లు శాలినీమిశ్రాకు ఆగమేఘాల మీద చేరుస్తున్నారు. ఇంతటితో ఆగక తెలంగాణ ఉద్యోగుల జీతాలు నిలిపివేశారు.
ఇదేమంటే మీ ప్రభుత్వాన్ని అడుక్కోండి అని ముఖం మీదే చెబుతున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అన్ని శాఖల్లో గత నెల 28న వేతనాలు అందాయి. ఈ సంస్థలో మాత్రం శనివారం నాటికి కూడా తెలంగాణ ఉద్యోగుల జీతాలు అందలేదు. విభజన నాటికి సంస్థకు తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి టీఆర్‌కే రావు ఎండీగా ఉన్నారు. విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జాయింట్ ఎండీగా శాలినీ మిశ్రాను నియమించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఉమ్మడిగా కొనసాగించేటప్పుడు ఏ రాష్ట్ర ఉద్యోగులకు ఆ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టం చేస్తోంది. కానీ ఆమె రెండు రాష్ర్టాలకు తానే అధికారిణిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూలై నెలకు సంబంధించిన వేతనాల ఫైలును టీఆర్‌కే రావు ఆర్థిక విభాగానికి పంపిస్తే అక్కడున్న సీమాంధ్ర అధికారులు జాయింట్ ఎండీ శాలినీ మిశ్రాకు పంపినట్లు సమాచారం. అయితే తెలంగాణ ఉద్యోగులకు తామెందుకు వేతనాలిస్తామంటూ పెండింగ్‌లో పెట్టినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
డీమెర్జర్ ప్లాన్ ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను రెండుగా విభజించేందుకు రూపొందించిన డీమెర్జర్ ప్లాన్ ప్రకారం తెలంగాణకు 42 శాతం వాటా కింద మార్చి 2014 వరకైతే రూ.340 కోట్లు రావాలి. జూలై వరకు లెక్క కడితే మరో రూ.60 కోట్లు రాష్ర్టానికి చెందుతుంది. తెలంగాణ కి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచినప్పటికీ వాటాను మాత్రం నేటికీ పంపిణీ చేయలేదు.
ఏపీఐఐసీ-టీఎస్‌ఐఐసీ వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలు పంచుకున్నారు. ఈ మేరకు వచ్చిన నిధులతో ఆయా రాష్ర్టాలు కార్యకలాపాలను ప్రత్యేకంగానే నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలో మాత్రం ఆదాయమంతా సీమాంధ్ర నుంచి వచ్చిందని, తెలంగాణకు వాటా ఇచ్చేది లేదని సీమాంధ్ర అధికారులు పేచీ పెడుతున్నారు. అదే ఫార్ములా పాటించాలనుకుంటే మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ ప్రాంతంలో వచ్చిన ఆదాయం ఆ ప్రాంతానికే చెందేటట్లుగా మార్గదర్శకాలు రూపొందించాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విభజన జరిగే వరకు కొంత సొమ్మయినా తెలంగాణకు ఇవ్వాలని ఎండీ టీఆర్‌కే రావు ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా నిపుణుల కమిటీ చైర్మన్ షీలాబిడేకు కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటోందని తెలిసింది.
విభజన తర్వాత వివక్ష తీరు ఇది..
కార్పొరేషన్‌లో తెలంగాణకు చెందినవారు ఎండీ అయితే ఆంధ్రాకు చెందినవారు జాయింట్ ఎండీ మాత్రమే. ఇరువురు వారి రాష్ట్ర ఉద్యోగులతో పని చేయించుకోవాలి. కానీ శాలినీమిశ్రాకు ఎవరూ బాధ్యతలు ఇవ్వకపోయినా లేని అధికారాలు చెలాయిస్తూ తెలంగాణకు చెందిన కొందరు ఉద్యోగుల డిప్యూటేషన్లను రద్దు చేశారు. తెలంగాణ ఎండీ పేషీలో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తోన్న రిటైర్డ్ ఉద్యోగులను ఆంధ్రా జాయింట్ ఎండీ తొలగించారు. అదే ఆంధ్రా విభాగంలో పని చేస్తోన్న రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారు.
అబ్బే అలాంటిదేమీ లేదు..
వేతనాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆపలేదు.. జారీ చేశామని ఏపీఎండీసీ అదనపు మేనేజర్(ఫైనాన్స్ వింగ్) బీ శ్రీనివాసమూర్తి వివరణ ఇచ్చారు. తెలంగాణ ఎండీ ఆమోదించిన ఫైలును జాయింట్ ఎండీకి ఎందుకు పంపారని ప్రశ్నిస్తే అది అంతర్గతమన్నారు. డీమెర్జర్ ప్లాన్ ప్రకారం తెలంగాణకు వాటా పంచి ఇవ్వడంలో జాప్యమెందుకని ప్రశ్నిస్తే విభజనను కేంద్రం ఆమోదించలేదని, అప్పటి వరకు తామంతా ఉమ్మడిగా ఉన్నట్లేనన్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి