గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 12, 2014

కుట్రలబాబూ, ఈ ప్రశ్నలకు జవాబివ్వు...!

- ముంపు ప్రాంతాల విషయం పునర్విభజన చట్టంలో ఉందా?
- పీపీఏలను రద్దు చేసి మా రైతుల ఉసురుపోసుకోలేదా?
- ఎంసెట్ కౌన్సెలింగ్‌పై మీవి ఒంటెత్తు పోకడలు కావా?
- విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన పన్నాగమెవరిది?
- హైదరాబాద్‌ను పాలించేందుకు కుట్ర చేయడంలేదా?
- పదిప్రశ్నలతో ఏపీ ముఖ్యమంత్రికి రాష్ట్రమంత్రి హరీశ్‌రావు బహిరంగలేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.రాష్ట్రంతో కయ్యంపెట్టుకుంటూ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు వైఖరి దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉందని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసానికి పర్యాపదం బాబు అని, ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే చెప్పారని గుర్తుచేశారు. 
harishkutbabuతెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లను భారత్-పాకిస్థాన్‌తో పోలుస్తూ విద్వేషాలు రేపుతున్నది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు తీసుకున్న తరువాత ఏపీ అభివృద్ధి కోసం కాకుండా, ప్రతిరోజు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రశ్నిస్తూ రాసిన బహిరంగలేఖను సిద్దిపేటలోని తన నివాసంలో ఆదివారం మీడియాకు విడుదలచేశారు.

ఆ ప్రశ్నలివి..

1. తెలంగాణ అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడానికి కేంద్రంపై ఒత్తిడితెచ్చారు. మీరు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణకు చేసిన మొదటిద్రోహం ఇది. మరి పోలవరం ముంపు ప్రాంతాల విషయం పునర్విభజనచట్టంలో ఉందా? పోలవరం బిల్లు కుట్ర నీది కాదా? 

2. తెలంగాణలో కరెంట్ కష్టాలున్నాయని తెలుసు. రెండురాష్ర్టాల్లో కలిసి ఉత్పత్తి అయిన కరెంట్‌లో 54 శాతం తెలంగాణకు ఇవ్వాలని ఉంది. మరి మీరు అధికారంలోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తయిన కరెంట్‌ను తెలంగాణకు పంపొద్దని ఎందుకు నిర్ణయించుకున్నారు. ఇది బిల్లులో చెప్పినదానికి విరుద్ధం కాదా? తెలంగాణను చీకట్లో ఉంచాలని చేసిన కుట్ర కాదా ఇది ? మా రైతులు ఊసురుపోసుకున్నది మీరు కాదా?

3. తెలంగాణలో కరెంట్‌కోత బాగా ఉన్న సమయంలోనే కడప ఆర్టీపీపీ, విజయవాడ వీటీపీఎస్‌లలో విద్యుత్ ఉత్పత్తి బంద్ నిలిపివేయించారు. దీనివల్ల తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. తెలంగాణలో మరింత ఇబ్బంది ఏర్పడింది. ఇది మీ విద్వేషపు పన్నాగం కాదా..?

4. పదవుల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేం మొదటినుంచి చెప్తూనే ఉన్నాం. మీరు ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తెలంగాణకు అన్యాయం చేయలేదా? తెలంగాణకు కేంద్రమంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? వెంకయ్యనాయుడు ఆంధ్రాకున్నట్లు, మా హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ తెలంగాణ తరపున మంత్రిగా ఉంటే, మాకు కొద్దోగొప్పో మేలు జరగకపోవునా? తెలంగాణకు మంత్రిపదవి రాకుండాఅడ్డుకున్నది మీరు.. మీ ఏజెంట్లు అయిన తెలంగాణ బీజేపీ నాయకులు కాదా? ఇది తెలంగాణ రాజకీయ నాయకులపై చేసిన కుట్ర కాదా? సీమాంధ్రకు రెండు పదవులు తీసుకొని తెలంగాణకు ఒకటి కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. 

5. ఎంసెట్ ఉమ్మడి అడ్మిషన్లకు మేం కూడా ఒప్పుకున్నాం. అయినా మమ్మల్ని సంప్రదించకుండా మీరు మీ ఉన్నత విద్యమండలి ద్వారా నోటిఫికేషన్ ఎలా ఇప్పిస్తారు? ఉమ్మడి అంటే అందులో తెలంగాణ ఉండదా? అసలు మాకో రాష్ట్రం ఉంది.. మాకో ప్రభుత్వం ఉంది.. అనే విషయాన్ని కూడా గుర్తించడానికి మీకు మనసొప్పడం లేదా? ఇంకా తెలంగాణలో మీ పాలనే నడవాలని కోరుకుంటున్నారా? ఇది తెలంగాణపై చూపిన చిన్న చూపు కాదా? మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? చట్టం, న్యాయం, బిల్లు అని బాగా మాట్లాడుతారు మరీ బిల్లులో రెండు రాష్ర్టాలు కలిసి అడ్మిషన్లు చేయాలని లేదా? ఎందుకు ధిక్కరించినవు? ఇది తప్పు కాదా? కేసు కోర్టులో నడుస్తుండగానే నోటిఫికేషన్ ఇవ్వడం న్యాయవ్యవస్థను కించపర్చడం కాదా?

6. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని పదిజిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తున్నామని బిల్లులో పేర్కొన్నారు. కానీ మీరు ముఖ్యమంత్రి అయినా నాటినుంచి హైదరాబాద్‌పై పెత్తనం కోసం కుట్ర చేయడంలేదా? శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించాలని ఎందుకు లేఖ రాసినావు? తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం లేదా..? తెలంగాణ ప్రజలపై నమ్మకం లేదా..? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి మరో రాష్ట్ర అధికారాలు కేంద్రానికి దక్కాలని కోరడం మీ ద్వంద్వ ప్రమాణాలకు, అవకాశవాదానికి నిదర్శనం కాదా ? తిరుపతి, శ్రీశైలం, అన్నవరం గుడులకు వేరే రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు వస్తారు. విశాఖపట్టణం పరిశ్రమల్లో, కాకినాడ ఓడరేవుల్లో, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూడా వేరే రాష్ర్టాలు, వేరే దేశాల పౌరులుంటారు. విశాఖపట్టణం నుంచి నెల్లూరు దాకా సముద్రతీరంలో దేశ సరిహద్దు ఉంది. అందుకని ఈ ప్రాంతాల్లో కూడా గవర్నర్‌పాలన పెట్టాలని కోరుకుంటారా? మరీ మీకు లేని చట్టం, రూల్స్ మాకెందుకు ? మా నెత్తిన కేంద్రం పెత్తనం ఎందుకు? కేంద్రం పేరుతో మీరే హైదరాబాద్‌ను పాలించాలనే కుట్ర చేయడం లేదా..? అసలు మా హైదరాబాద్‌ను మీరు కోరుకోవడం ఏమిటి..? పాకిస్థాన్ సైనికులు కార్గిల్‌లో చొరబడినట్టే లేదా మీ ప్రవర్తనా..? ఇది తప్పుకాదా..? చట్ట విరుద్ధం కాదా..?

7. తెలంగాణలోని వాతావరణం పరిశ్రమల స్థాపనకు అనుకూలం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నూతన విధానం తెస్తున్నది. దీనివల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి టాటా, బిర్లా, మహేంద్ర, విప్రోలాంటి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వారిని భయపెట్టడానికి మీరు ప్రయత్నం చేయడం లేదా..? హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరుగుతాయని, బాంబు పేలుళ్లు జరుగుతాయని వారిని బెదిరించలేదా? పారిశ్రామికవేత్తలకు దిల్‌సుఖ్‌నగర్, గోకుల్‌చాట్, లుంబినిపార్క్ బాంబుపేలుళ్ల విజువల్స్ చూపలేదా? తెలంగాణలో నక్సల్స్ సమస్య ఉందని వారికి నివేదికలు ఇవ్వలేదా? తెలంగాణలో కరెంట్ లేదని పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వలేదా? పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదో వివరించడానికి మీరు ఏకంగా ఓ కన్సల్టెన్సీని నియమించారు. ఇది మీరు చేసిన కుట్ర కాదా? తెలంగాణ అంటే టెర్రరిస్టులు, నక్సలైట్ల అడ్డ అని విష ప్రచారంచేయడం కుతంత్రం కాదా..?

8. రాష్ర్టాలు విడిపోయినా తెలుగు ప్రజలు కలిసుండాలని నీతి మాటలు చెప్తున్నావు. మరీ చేతల్లో ఏమైంది నీ చిత్తశుద్ధి. తెలంగాణలోకరెంట్ కష్టాలున్నాయి. మాకు అదనపు విద్యుత్ కావాలని, సహకరించాలని ప్రధానికి లేఖలు రాశాం. కానీ నీవు ఢిల్లీ వెళ్లి తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుకోలేదా? కేంద్ర విద్యుత్ పాలసీలో మూడు రాష్ర్టాలకు 24 గంటల విద్యుత్‌పథకం పెడితే అది తెలంగాణకు దక్కకుండా అడ్డుకున్నది మీరు కాదా? ఇప్పటికే సమృద్ధిగా కరెంట్ ఉన్నా.. ఆ పథకాన్ని ఏపీకి తరలించుకపోయింది మీరు కాదా? ఇది తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన కుట్ర కాదా? ఆకలి ఉన్న వాడి గిన్నెలో అన్నం లాక్కొని, అజీర్తి చేస్తున్న వారికి సద్ది కట్టడం భావ్యమేనా?

9. తెలంగాణకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ -నాక్) అనే సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ జనరల్‌ను ఎలా నియమిస్తుంది? మా సంస్థకు మీరు అధికారులను నియమించి గిచ్చి కయ్యం పెట్టుకోవడం కుట్ర కాదా? కావాలని వివాదాలు రాజేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి చివరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగాలేవని చెప్పడం మీరు చేస్తున్న కుట్ర కాదా..? తెలంగాణ పోలీసు అధికారులపై మీరు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదా? సివిల్ సర్వీసు అధికారులను మీరు ఇప్పటికీ బెదిరించడం లేదా ?

10. తెలంగాణలో అక్రమార్కులకు చెక్ పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణ విషయంలో కఠినంగా ఉండాలనుకున్నాం. దీనిని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. ఏకంగా మీ ఎమ్మెల్యేనే పంపి అక్రమార్కుల పక్షాన ధర్నా చేయించడమేమిటి? తెలంగాణలో యథేచ్ఛగా అక్రమాలు జరగాలని కోరుకోవడం ఎందుకు..? ఇది మా తెలంగాణ పై చేస్తున్న కుట్ర కాదా? 

తెలంగాణపై కసి పెంచుకుని, మొసలికన్నీరు ఎందుకు కారుస్తున్నారని చంద్రబాబును హరీశ్‌రావు ప్రశ్నించారు. తానడిగిన పదిప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలన్నారు. బాబు చేసిన కుట్రల విషయాల్లో స్వయంగా కేంద్రానికి లేఖలు రాశారని, కుతంత్రాలు చేసినట్లు ఆధారాలున్నాయని, విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో స్పష్టమవుతుందన్నారు. తాము విద్వేషాలు రగిల్చితే బాబు ప్రశాంతంగా హైదరాబాద్‌లో ఉండగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి