గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 21, 2014

పోలవరం ఫైళ్లు కనబడకపోవడంలో ఎవరిమాయ ఉంది...?

-పోలవరం వివరాలు కోరిన స.హ. దరఖాస్తుదారునికి కేంద్ర పర్యావరణశాఖ సమాధానం
-కనుమరుగైన కీలక సమావేశాల తీర్మానాలు
-అటవీ భూముల మళ్లింపుపై అనుమానాలు
-నిధులు కేటాయింపులోనూ స్పష్టత లేదు




పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు ఎప్పుడు వచ్చింది? ఏ సమావేశంలో ఈ భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఎకరాల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించారు? అటవీ తొలగింపు అనుమతులు ఎప్పుడిచ్చారు? ఇవేకాదు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ విషయమూ ఎవరికీ తెలియదు.
ఆఖరుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులకు కూడా! నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల సరిహద్దుల్లో నిర్మాణమవుతున్న వివాదాస్పద ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఒక్క ఫైలు కనిపించడం లేదట. సమాచార హక్కు చట్టం కింద ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కోరిన ఓ దరఖాస్తుదారుడికి సాక్షాత్తూ కేంద్ర పర్యావరణ, అటవీమంత్రిత్వ శాఖ అధికారులు ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానమిది. జాతీయహోదా పొందిన ఓ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు కనిపించడం లేదంటే నమ్మశక్యమేనా? అసలు అవి ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆది నుంచి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో వివాదాలు.. మరెన్నో అనుమానాలు.. వివిధ ప్రాంతాల మధ్య ఆందోళనలు. 73 ఏండ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చినప్పటి నుంచీ అంతే. పోలవరం డిజైన్‌పై తెలంగాణ, ఒడిశా మొదటినుంచీ ఎన్నో అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఆంధ్ర పాలకులు వాటిని కొట్టిపారేస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగే సమయంలో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జాతీయహోదా కూడా కట్టబెట్టేసింది. ఈ వివాదస్పద ప్రాజెక్టు గురించి ఇప్పుడో ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్ర పాలకులు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సవ్యంగా ఉన్నాయంటూ దబాయిస్తూ వస్తున్నారు. అసలు ఆ అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎప్పుడొచ్చాయి? అన్న విషయాలు తెలుసుకునేందుకు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అధికారులు ఫైళ్లు కనిపించడంలే దంటూ విస్తుగొలిపే సమాధానం పంపారు.

పోలవరం వివరాలు చెప్పండి..

సికింద్రాబాద్ న్యూమెట్టుగూడవాసి డీ సురేష్‌కుమార్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వివరాలు కావాలంటూ గత జూన్ 12న సమాచార హక్కు చట్టం కింద కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను కోరారు.

అవి:
1.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు కేటాయించాలంటూ వచ్చిన దరఖాస్తు (ఫారమ్ ఏ),
2. దానితోపాటు వచ్చిన అనుబంధ వివరాల కాపీ,
3. ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులకు సంబంధించిన అన్ని ఫైల్ నోటింగ్స్,
4. ప్రాజెక్టుపై చర్చించిన అన్ని ఎఫ్‌ఏసీ సమావేశాల మినిట్స్,
5. అజెండా వివరాలు,
6. ప్రాజెక్టుకు స్టేజ్-1, స్టేజ్-2 ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతుల మంజూరుకు సంబంధించిన వివరాలు,
7. భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఎఫ్‌వో(లు) ఇచ్చిన నివేదిక కాపీ, 8. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు

ఇవ్వాలని సురేశ్‌కుమార్ దరఖాస్తు చేశారు.

వివరాలు లేవట...

పోలవరం ప్రాజెక్టు వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద సురేశ్‌కుమార్ పెట్టిన దరఖాస్తుకు జూలై 25న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు సమాధానం పంపారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేవీ తమ మంత్రిత్వ శాఖ వద్ద లేవని, ఆ సమాచారం కోసం అన్వేషిస్తున్నామని, దొరకగానే వివరాలు పంపుతామని పేర్కొంటూ న్యూఢిల్లీలోని ఇందిర పర్యావరణ్ భవన్ నుంచి ఓ లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూములు లేదా మళ్లించిన అటవీ భూముల విషయంలో ఏదో గోల్‌మాల్ జరిగిం  దనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

-కేంద్ర మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన ఈ కీలకఫైళ్లు ఏమయ్యాయి?
-అధికారులు ఇంత నిర్లక్ష్యపూర్తింగా కోరిన సమాచారం లభ్యం కావడం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు?
అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.

-లేకపోతే.. పోలవరం ప్రాజెక్టుకు భూముల కేటాయింపులో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న ఉద్ధేశంతోనే వివరాలు వెల్లడించడం లేదా?
అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి