-సర్కార్ ఆశయానికి నిలువునా తూట్లు
-సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్న అధికారులు
-కరీంనగర్ జిల్లా డీఎస్పీ, ఎస్సైపై ఫిర్యాదు.. విచారణకు ఐజీ ఆదేశం
-అవినీతి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న డీజీపీ అనురాగ్ శర్మ
-సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్న అధికారులు
-కరీంనగర్ జిల్లా డీఎస్పీ, ఎస్సైపై ఫిర్యాదు.. విచారణకు ఐజీ ఆదేశం
-అవినీతి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న డీజీపీ అనురాగ్ శర్మ
స్వరాష్ట్రంలో అవినీతికి చెక్ పెట్టి మంచి పాలన అందించాలని ప్రభుత్వం ఒకవైపు తీవ్రంగా కృషి చేస్తుంటే పోలీస్ శాఖ మాత్రం అవినీతిలో కూరుకుపోతున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని భావిస్తుంటే.. సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో చేసినట్లుగా సెటిల్‌మెంట్ దందా సాగిస్తూ వివాదాస్పదంగా మారుతున్నారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నట్లు తెలిసింది. తాజాగా కరీంనగర్ జిల్లా డీఎస్పీ, ఎస్సైపై ఇలాంటి ఆరోపణలే రావడంతో తక్షణ చర్యలకు వరంగల్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు.
ఐపీఎస్‌ల నుంచి ఎస్సై వరకు..
సెటిల్‌మెంట్ల వ్యవహారం పోలీస్‌శాఖలో ఎస్సైల స్థాయినుంచి ఐపీఎస్‌ల వరకూ వేళ్లూనుకుంది. కొందరు ఐపీఎస్ అధికారులు శృతిమించి వ్యవహరిస్తున్న తీరు పోలీస్ శాఖకు తలవంపులుగా మారింది. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీసీపీలు సెటిల్‌మెంట్ల దందాలో ఆరితేరారని డీజీపీ కార్యాలయం గుసగుసలాడుకుంటున్నది. కీలక ప్రాంతానికి డీసీపీగా ఉన్న అధికారి ఇటీవలే విదేశీటూరుకు వెళ్లిరావడం.. సివిల్ పంచాయితీకి తాజా ఉదాహరణ అని తెలిసింది. ఓ రెండున్నరెకరాల భూమి సెటిల్‌మెంట్ చేసినందుకు నజరాగానే ఈ డీసీపీ విదేశాలకు వెళ్లివచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఇదే కమిషనరేట్‌లో పనిచేస్తున్న మరో డీసీపీ ఏకంగా ఎర్రచందనం మాఫియాతో సంబంధాలు పెట్టుకొని ఉన్నతాధికారులకే చుక్కలు చూపించారు. ఏసీపీలతో కలిసి తన కార్యాలయంలోనే దందాలు చేసిన మరో డీసీపీ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లింది.
క్యాడర్ అలాట్‌మెంట్‌లో ఏ అధికారి ఎటు వెళ్తారో తెలియక ఉన్నతాధికారులు ఎవరిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. వరంగల్ రేంజ్‌లో పనిచేస్తున్న ఓ డీఐజీ అవినీతి లీలలు పెచ్చుమీరడంతో ఇటీవలే డీజీపీ పిలిచి తీవ్రంగా చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అయినా, సదరు అధికారి తీరులో మార్పులేదు. ఇటీవలే తన ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు ఒక్కో ఇన్‌స్పెక్టర్ అరతులం బంగారం సమర్పించుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సివిల్ వివాదాలు, అక్రమ కేసులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ అనురాగ్ శర్మ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులోభాగంగా అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా ఎస్పీకార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి టీ మీడియాకు తెలిపారు.
పెద్దపల్లి డీఎస్పీ, గంగాధర ఎస్సైపై ఫిర్యాదు
సివిల్ వివాదంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డీఎస్పీతోపాటు గంగాధర మండలం ఎస్సై రాజేంద్రప్రసాద్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు శనివారం నార్త్‌జోన్ ఐజీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదాల్లో డీఎస్పీతోపాటు ఎస్సై జోక్యం చేసుకొని ఇబ్బందులుకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని చంపుతానంటూ ఎస్సై బెదిరిస్తున్నాడని ఫోన్‌కాల్ రికార్డులు సైతం వినిపించారు. ఫిర్యాదుపై స్పందించిన ఐజీ రవిగుప్తా.. తక్షణమే విచారణ జరుపాలని కరీంనగర్ జిల్లా ఎస్పీ శివకుమార్‌కు ఆదేశించారు. సోమవారంలోగా రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి