-ఎస్ఐబీ లూటీపై ఇరు రాష్ట్రాల డీజీపీలతో ఉమ్మడి గవర్నర్ భేటీ
సీమాంధ్ర పోలీసు అధికారుల కిష్కింధకాండ రాష్ట్ర ప్రథమపౌరుడి వద్దకు చేరింది. పాత ఎస్ఐబీ భవనంలో ఫర్నీచర్ సహా మొత్తం ఎత్తుకెళ్లిన వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ర్టాల డీజీపీలతో శుక్రవారం భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ గ్రీవెన్స్ కార్యాలయంగా కేటాయించిన పాత ఎస్ఐబీ భవనంలో సామాగ్రి తీసుకెళ్లడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని, ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి వ్యవహారాలవల్ల సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం ఉందని హెచ్చరించినట్టు సమాచారం.పాత ఎస్ఐబీ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు సాగించని గ్రేహౌండ్స్ విభాగం పేరుతో సామాన్లు లూటీ చేయడంపై నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీ రాముడిని గవర్నర్ ఆదేశించినట్టు తెలిసింది. సామాగ్రి తీసుకెళ్లి ఎక్కడ పెట్టారని ప్రశ్నిస్తే తమకు కేటాయించిన పాత కార్యాలయంలోనే పెట్టామని ఆంధ్ర పోలీస్ ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. అసలు గ్రేహౌండ్స్ ఫ్రంట్ ఆఫీస్‌కు భవనమే కేటాయించనప్పుడు సామాగ్రి ఎందుకు తీసుకెళ్లారని గవర్నర్ ఎదురు ప్రశ్నించడంతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు బిత్తరపోయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతటితో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. అతిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్‌పై కూడా నరసింహన్ ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. ఇలాంటి అధికారులపై కఠినంగా ఉండాలని డీజీపీ రాముడికి గవర్నర్ సూచించినట్టు తెలిసింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి