గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 06, 2014

నైతికతలేని నాయకత్వాన్ని ప్రజలొప్పరు!


తెలంగాణ రాష్ట్రమందు
మొట్టమొదటి ఎన్నికలివె!
తెలంగాణ భవిష్యత్తు
నిర్ణయించు ఎన్నికలివె!!

తెలంగాణ రాష్ట్రముకై
పాటుపడితిమని అనుచును
ప్రతిపార్టీ తొడగొట్టుచు
సవాళులను విసరుచుండె!

తెలగాణకు వెన్నుపోటు
పొడిచినట్టి పార్టీలును
తెలంగాణ అభివృద్ధికి
పాటుపడెద మనుచునుండె!

తెలంగాణ పునర్నిర్మి
తిని తమ బాధ్యతగా వచి
యించుచున్న పార్టీలే,
గతమునందు అడ్డినవయ!

తెలగాణకు ఏ పార్టీ
ఉద్యమమ్ము నడిపినదో,
ఆ పార్టిని అన్ని కలసి
ఓడింపగ బూనినవయ!

ప్రజలలోన పార్టీలకు
ఆదరమ్ము లభియింపక,
నామినేషనును వేయగ
వెదకులాట మొదలాయెను!

నామినేషనుల ఘట్టపు
ప్రారంభపు ఈ క్షణమున,
పార్టీ నాయకులలోన
కప్పదాట్లు మొదలాయెను!

నేడొక పార్టీన నున్న
రేపింకొక పార్టినుండు!
ఎవరేపార్టీ నుందురొ,
అంతుచిక్కకున్నదయ్య!!

ఏ పార్టీవారినిపుడు
ప్రజ నమ్మునొ తెలియకుండె!
అభ్యర్థుల కిపుడు ప్రజల
తో సంబంధమ్ము తెగియె!!

ప్రపంచీకరణము వలన
ప్రతిపల్లెకు వసతులుండె!
అయినను సరె నాయకులకు
ప్రజలకు సంబంధము తెగె!!

ప్రజలందరు ఊళ్ళలోన
కాయకష్టమును సేయగ,
నాయకులును నగరమ్ముల
విహరణమ్ము సేయుచుండ్రి!

అన్ని నియోజకవర్గము
లందు నాయకులను తీర్చి
దిద్దుకొనగ ప్రతిపార్టీ
తలచుటలేదీవేళన!

సమాజమ్ములోని అన్ని
వర్గమ్ముల ప్రాతినిధ్య
మును జూపెడు నాయకులను
పార్టీలే విస్మరించె!

టిక్కెట్టును ఎట్టకేల
కును పొందియు, పార్టి బలము
చేత ఓట్లుపొంది, పాల
నము సేయగ జూచుచుండ్రి!

అవినీతికి తావులేని
ప్రజా ప్రాతినిధ్యమున్న
వ్యవస్థనే ఏర్పరచెడి
పార్టీయే మనగలుగును!

మాఫియాకు తావులేని
రాజకీయములు కావలె!
ప్రజలనుంచి ఎదిగినట్టి
మంచి నాయకులు కావలె!!

ప్రజలతోడ నిత్యమ్మును
సంబంధము కలిగియుండి,
ధనలోభము లేనియట్టి
మంచి నాయకులు కావలె!

నిరాడంబరతతోడను
ప్రజల కన్నబిడ్డలవలె
నిత్యమ్మును కాపాడెడి
మంచి నాయకులు కావలె!

ఆస్తిపాస్తులను పెంచెడి
ఆశలేక, చట్టసభల
లోన ప్రజావాణి దెలుపు
మంచి నాయకులు కావలె!

ఎన్నికలలొ నిలువగోరు
పెద్దమనుషులొక్క ఐదు
వత్సరములు ప్రజలమధ్య
తిరిగిన కష్టాల్ తెలియును!

ప్రజలలోన దిరుగకుండ
నగరమ్ముల నున్నవారు
ప్రజల కష్టసుఖములన్ని
ఎట్లు తెలుసుకొనగలరయ?

ఈ విధముగ ఐదేండ్లుగ
ప్రజల కష్టసుఖములెఱిగి,
ప్రజలతోడ మమేకమౌ
మంచి నాయకులు కావలె!

తెలంగాణ రాష్ట్రమ్మే
ఉద్యమమ్ము ప్రాతిపదిక
మీద ఏర్పడినది కాన,
మంచి నాయకులు కావలె!

ప్రజలవలన, ప్రజలచేత,
ప్రజలకొఱకె ఉన్నయట్టి,
బంగరు తెలగాణనిచ్చు,
మంచి నాయకులు కావలె!

***     ***     ***     ***

మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి