గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 15, 2014

వాళ్ళు మేకవన్నెపులులు...ఊసరవెల్లులు...భస్మాసురులు!


తెలంగాణవాదులార!
మన ముందర ఉన్నయట్టి
పెద్ద బాధ్యతొకటిప్పుడు
తెలిసికొనియు మెలగుడయ్య!

ప్రతిపార్టీ తెలంగాణ
పేరునెత్తకుండ నేడు
ఎన్నికలకు ప్రచారమ్ము
చేయలేకయున్నదయ్య!

ప్రతి ఒక్కరు తెలంగాణ
తెచ్చితిమని చెప్పుకొనుటె
గాని, ఎట్లు వచ్చినదో
మనకందరికిని తెలియదె?

కాంగ్రెస్సే ఏమిచేసె?
తెలంగాణ ఈయగాను
అవకాశము ఉన్నప్పుడు
నోరెత్తగ లేదెందుకు?

టీఆరెస్ పుట్టి, ఉద్య
మించి, ప్రజల ప్రభావితుల
చేసిన తరి, పొత్తు కోరి,
సీట్లు గొనియు, నోరు మూసె!

రెండువేల నాలుగులో
తెలంగాణ నీయ దేల?
ఇప్పుడు తెలగాణలోన
ఓట్లకొరకు ఇచ్చినదయ!

ఎట్టి తెలంగాణ మిచ్చె?
ఆంక్షలతో కూడినట్టి
తెలంగాణ! సంపూర్ణపు
తెలంగాణ నీయ లేదు!

బీజేపీ మద్దతుతో
తెలంగాణ మేర్పడెనని
వారు అనుచు నుండిరయ్య!
తరచి చూడ ఏది నిజము?

మద్దతిత్తుమనిపలికియు
ఎన్నో ఆంక్షలు పెట్టిరి!
రాజ్యసభన వెంకయ్యయె
ఏమి చేసెనో ఎరుగమె?

పోనీయుడు, మరి ఇప్పుడు
తెలంగాణ ద్రోహి చంద్ర
బాబుతోడ పొత్తుపెట్టు
కొనగ నేమి యనగ వలెను?

టీడీపీ చంద్రబాబు
సీట్లకొరకు టీఆరెస్
పొత్తుగూడి తెలంగాణ
కనుకూలమ్మని పలికెను!

ఉద్యమమ్మ్జు విస్తృతముగ
జరిగిన తరి, కేసీఆర్
నిరాహారదీక్షనుండ,
"బిల్లు పెట్టు" మని పోరెను!

ఇట్లు పలికినట్టి చంద్ర
బాబు, కేంద్ర ప్రకటనముకు
వ్యతిరేకముగా ఆంధ్రలొ
ఉద్యమమ్ము సృష్టించెను!

తెలంగాణ ప్రతిబంధక
ముగ మారియు, అడ్డగించె!
ఇట్టి చంద్రబాబు తెలం
గాణ నెట్లు తెచ్చెనయ్య?

పూటకొక్క మాటమార్చి,
గడియకొక్క తీరు మార్చి,
తెలగాణను రాకుండా
చేసినదీ చంద్రబాబె!

తెలంగాణ వ్యతిరేకికి
ఇచ్చట పార్టీ యుండుట
తెలగాణుల మంచితనమె!
అంతె గాని, మరొకటేమి?

వైసీపీ జగనుబాబు
మూడు ఆర్టికలును జూపి,
తెచ్చు శక్తి, ఇచ్చు శక్తి
తనకు నిజముగా లేదనె!

తెలంగాణమిచ్చినచో
ఆపువాడకాను అనియు,
ఇచ్చిన తరి, "సమైక్యాంధ్ర"
అని పలుకుచు, ఆప జూచె!!

 కేంద్రమ్ముకు జడియునొకటి!
మతతత్త్వమ్మనునొక్కటి!
ఊసరవెల్లయెనొక్కటి!
భస్మాసుర హస్తమొకటి!

ఇట్టి మేకవన్నెపులుల
తెలంగాణ నామ స్మరణ
వినియు మోసపోకుండా
యథార్థమును కనుడయ్యా!

అరువదేండ్లనుండి జరుగు
తెలంగాణ ఉద్యమమును
ఈ నేతలు తోడు పడియు
సాయమిడిరె యెప్పుడైన?

కేసీఆర్ ఉద్యమించి
టీఆరెస్ పెట్టకున్న,
ప్రజలలోన తెలంగాణ
నినదము వ్యాపించెడిదే?

కేసీఆర్ చచ్చువాడొ,
తెలగాణను తెచ్చువాడొ
మీరే కనుడని ఆతడు
నిరాహారదీక్షచేసె!

కేసీఆర్ నాడు ఉద్య
మించకున్న, నిరాహార
దీక్ష చేయకున్న నేడు
తెలంగాణ వచ్చెడిదే?

జేఏసీతోడ నిత్య
సంబంధము పెట్టుకొనియు,
నిరంతరము ప్రణాళికల
చేపట్టియు ముందు నడిచె!

సకలజనులసమ్మె యనియు,
సాగరహారమ్మనియును,
ధూం ధాం లని, బందులనియు
రకరకముల ఉద్యమించె!

ఉద్యోగులు, కార్మికులును,
టీచర్లును, విద్యార్థులు,
డాక్టర్లును, లాయర్లును
ఇంజనీర్లు గుమిగూడిరి!

ప్రజాసంఘ, కులసంఘాల్,
కూలీలును, కర్షకులును
తెలంగాణ నినదంతో
నింగిని వణికించిరయ్య!

రాజకీయ నేతలంత
ఊసరవెల్లులు కాగా,
వేలమంది అమాయకులు
బలిదానమ్ములు చేసిరి!

ఇంత జరుగుచున్నగాని
కేంద్రము నిమ్మకు నీరె
త్తినరీతిని ఉండి, ఎన్ని
కలకొరకయి దిగివచ్చెను!

కేసీఆర్ పూనుకొనక
ఉండినచో, తెలంగాణ
వచ్చెడిదే? ఎవ్వరైన
తెచ్చి ఇచ్చువారుండిరె?

బంగారపు తెలంగాణ
కావలెనని యనుకొన్నచొ,
దీని పునర్నిర్మాణము
జరుగ గోరుచో, రండిటు!

తెలంగాణపైన ఈగ
వాలకుండ జూచునట్టి
కేసీఆర్ నాయకత్వ
మిచ్చట వర్ధిల్లవలెను!

టీఆరెస్ ఎన్నికలలొ
తప్పక నెగ్గగ వలయును!
అందుకు తెలగాణ ప్రజలు
నడుము బిగించగవలయును!

జాతీయపు పార్టి వద్దు,
సీమాంధ్రా పార్టి వద్దు!
తెలంగాణ ప్రాంత పార్టి
టీఆరెస్ గెలువవలెను!

టీఆరెస్ కాక వేరె
పార్టీ గెలిచినచో మన
తలపై బానిస తనమే
ఎక్కి నాట్యమాడు సుమ్ము!

కావున ప్రతి ఒక్కరిపుడు
ప్రతినచేయవలయునయ్య!
"టీఆరెస్ కాకుండా 
వేరె గెలువరాదు" అనుచు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి