తెలంగాణ రాష్ట్రమేర్ప
డగనున్నది "జూను రెండు"!
ఆలోపున ఎన్నికలలొ
ముప్పుపొంచి ఉండె, లెండు!!
తెలంగాణమందు నేడు
ఒకరు పునర్నిర్మాణము,
ఒకరును నవ నిర్మాణము
అని చెప్పుచునుండిరయ్య!
సామాజిక తెలంగాణ
అని కొందరు తెలగాణుల
బురిడీ కొట్టించగాను
వేషాలే వేయుచుండ్రి!
అరువదేండ్ల ఆంధ్రవలస
పాలనలో తెలంగాణ
సమాజమ్మె ధ్వంసమాయె
నని తెలియుడు మీరందరు!
తెలంగాణపై నెక్కడ
లేని ప్రేమలొలుకబోసి,
ప్రమాదమ్ము తలపెట్టగ
కొందరు చూస్తున్నారయ!
తెలంగాణ మేర్పడునని
సంబరాలలో తేలుచు,
రానుండెడి ప్రమాదాన్ని
గ్రహియించగ లేకుంటిరి!
ఎన్నికలును సమీపింప
జిమ్మిక్కులు చేయువారు,
శత్రులు మిత్రులుగ మరియు
మిత్రులు శత్రులుగనైరి!
సీమాంధ్రులు తెలగాణుల
మధ్య విభజనమ్ము జరిగె,
పార్టిలందు పొత్తులలో
విభజనమ్ము రాకపోయె!
పొత్తులతో ఎత్తువేసి,
జిత్తులతో చిత్తుచేసి,
తెలగాణుల ముప్పులోన
ముంచు తప్పు జరుగనుండె!
ఈ ముప్పును తెచ్చు శత్రు
వాంధ్ర వలస వాదమ్మే!
ప్రథమమ్మున తిప్పికొట్ట
కున్న, కలుగు ప్రమాదమే!!
తెలంగాణలోన ఆంధ్ర
పార్టీలను ఆదరించు
తెలగాణులె మన శత్రులు
అని తెలియుడు మీరిప్పుడు!
ఆంధ్ర పార్టి ముఖ్యనేత
లందరు రావణులుగాను
మారి తెలంగాణమ్మును
నాడు అడ్డినారు కాదె!
నేడు తెలంగాణ రాగ,
రామరాజ్యమును జేయగ
పుట్టిన రాముళ్ళమనుచు
చెవిని పువ్వు పెట్టుచుండ్రి!
వారు రాములే కారయ,
వారు రావణులే సుమ్ము!
నమ్మి ఓట్లు వేసితిమా,
చిప్ప చేతికిడును, లెమ్ము!!
ఇట్టి ఆంధ్రపార్టిలందు
కొనసాగెడి తెలగాణులు,
మేకవన్నె పులులయ్యా,
కబళింపగ బూనిరయ్య!
పొరపాటున ఆంధ్రపార్టి
లను గెలిపించిన నిప్పుడు
మరల ఆంధ్ర వలస లిచట
పెంచి, మనను దోచుకొండ్రు!
సీమాంధ్రుల పాలనలో
తెలంగాణ నీళ్ళు, నిధులు,
ఉద్యోగాల్, వనరులెన్నొ
కోల్పోయినది మఱచితిరె?
ఇపుడు గెలిచి, కబ్జ భూమి
దాచి మరియు పక్కాగా
పట్టాలను పొందు పనిని
చేయింతురు నిజము, నిజము!
దొంగ ముల్కి ధ్రువీకరణ
పత్రాలతొ పొందినట్టి
ఉద్యోగాల్ ఆప్షనీయ
కుండ ఇచటె ఉంట నిజము!
కృష్ణా గోదారి నదుల
లేని నీటి వాటాలను
పక్కాగా మార్చుకొనియు
మన రైతుల కొంపముంత్రు!
ఆంధ్రవలసవాదులిపుడు
"జన" సంబంధమ్ము లేని
"సేన"లెన్నొ సృష్టించుచు
మాయలెన్నొ పన్నుచుండ్రి!
అభిమానులు దరిజేర్చుచొ,
మన నెత్తిన చేయిపెట్టి,
మనను బుగ్గిచేసి వారు
అధికారము చెలాయింత్రు!
బీసి ముఖ్యమంత్రి అనుచు,
దళిత ముఖ్యమంత్రి అనుచు,
ఓట్లు పొంది, మన వ్రేలితొ
మన కంటినె పొడిపింతురు!
బొల్లిబాబు, బుల్లిబాబు
మాయమాటలను నమ్మిన
తెలగాణకు మరల బాని
సత్వ మబ్బుటయె నిక్కము!
ఆంధ్ర మీడియా, పత్రిక
లన్ని చెప్పు మాటలన్ని
మోసములని గ్రహియించియు,
ఆదరింపకుంట మేలు!
తెలగాణను దెబ్బతీయు
ఆంధ్రపార్టిలకు మనమే
పెద్ద దెబ్బ రుచి చూపియు,
తరిమికొట్టగా వలయును!
ఆంధ్రపార్టిలే కాదయ,
వాటితోడ పొత్తుగూడు
పార్టీలను తరిమికొట్టి,
తెలగాణను కాపాడుడు!
తెలంగాణ బిల్లు పాసు
చేయు నాడు ఏ పార్టీల్
తెలగాణకు ద్రోహమ్మును
చేసినవో గుర్తింపుడు!
మనస్ఫూర్తిగా తెలగా
ణమ్ము రాష్ట్రముగ నేర్పడు
కాంక్షతోడ పోరిరెవరొ
జ్ఞాపకమ్ము చేసికొనుడు!
తెలంగాణ కోసమ్మై
ప్రాణములర్పింపబూని
ఉద్యమించి, నెగ్గినట్టి
నాయకులనె గెలిపింపుడు!
మరల బానిసత్వమిచ్చు
పార్టీలను తరిమికొట్టి,
మనకు స్వేచ్ఛనిచ్చు పార్టి
గురుతు సేసి, గెలిపింపుడు!
తెలంగాణ అస్తిత్వము
కాపాడెడునట్టి పార్టి
నొక్కదానినే మీరలు
గురుతుసేసి గెలిపింపుడు!
రాష్ట్ర పునర్నిర్మాణము,
స్వర్ణ త్రిలింగాణ్ధ్ర సృష్టి
ఏర్పరచెడి పార్టీనే
గురుతుసేసి గెలిపింపుడు!
*** *** *** ***
మరిన్ని వివరాలకై
దీనిపై క్లిక్ చేయండి
(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో...)
*** *** *** ***
మరిన్ని వివరాలకై
దీనిపై క్లిక్ చేయండి
(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి