గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 29, 2014

మేం తెలబానులమైతే...మీరు తెలబాన్ధ్రులు కారా?


గతంలో తెలంగాణులను సీమాంధ్రులు అనేక రకాలుగా అవమానించారు...ఈసడించారు...హేళనచేశారు...వెక్కిరించారు...తిట్టారు...శాపనార్థాలుపెట్టారు! ఐనా మేం/మనం మౌనం వహించి, మా తెలంగాణ రాష్ట్రసాధనకై అహింసాయుతంగా పోరాటం చేశాం...సమ్మెలూ, ధర్నాలూ, రాస్తారోకోలూ చేశాం...చివరికి యువకులైన వీరులు వేయికి పైగా ఆత్మబలిదానాలు చేశారు...మా/మన నాయకుడు కేసీఆర్ తెలంగాణ సాధనకై నిరాహారదీక్షచేశారు...ఫలితంగా మేం మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాం! కానీ...ఈ ఆంధ్రవాళ్ళు మమ్మల్ని/మనల్ని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటే మనస్సు అదోలా అవుతుంది! 

గతంలో (బుధ/గురు వారములు: 06-11-2013/07-11-2013) నేను సీమాంధ్రుల వెటకారాలకు సమాధానంగా రెండు టపాలు "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లో ప్రకటించాను...ఈ సమయంలో మళ్ళీ ఆ టపాలను ఒక్కటిగా ఇచ్చట ప్రచురిస్తున్నాను...పఠించండి!


మొదటి భాగము:
మా తెలంగాణ రాష్ట్రమ్ము మాకు నిడఁగఁ
గోరు వారలన్ వేర్పాటుఁ గోరు వార
లంచుఁ, దీవ్రవాదు లటంచు ననఁగ నేల?

మొదటి వేర్పాటు వాదులు గదయ మీరు!
నాఁడు మద్రాసు సఖ్యమ్ము నూడఁ బెఱికి,
వేఱు రాష్ట్రమ్ము నిడఁగానుఁ గోరి రెవరు?
తీవ్రముగ నుద్యమించిన దెవ రదెవరు?

మమ్ము తెలబాను లనఁగ మే మగుదు మెట్లు?
మొదటి తెలబాన్ధ్రులే మీరు! మురువకుఁ డయ!

ఒక్క ప్యూను జాబునకయి నిక్కి నీల్గి,
యాగి చేసితి రయ్య మీ యాంధ్రు లపుడు!
సభలు చేసియు, నిందించి, జాలి లేక,
యాంధ్ర రాష్ట్ర మేర్పాటె ధ్యేయ మ్మటంచు,
నుద్యమమ్ము నడిపినది యోర్వలేని
యాంధ్రులరు కాదె? మదరాసు నాంధ్ర దనుచుఁ
గోరి యుద్యమించిన యట్టి వార లెవరు?

మమ్ముఁ దెలబాను లందురే? మమ్ము దోచి,
యెఱుఁగ నట్టున్న తెలబాన్ధ్రు లీరు కారె?

దొంగయే "దొంగ..దొంగరో..దొంగ" యనుచుఁ
బరుగుఁ దీయంగ...దొంగయే దొరగ నగునె?
యిచటి వెన్నియో దోచియు, నెఱుఁగ నట్లు,
మమ్ముఁ దెలబాను లనఁగానె మాయునె యవి?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!!


రెండవ భాగము:
మేము విజయమ్మ నడ్డిన మెచ్చుకొనక,
“తీవ్రవాదు లీ తెలబాన్లు! ద్వేషమునను
నడ్డుచుండిరి! రాజ్యాంగ హక్కు నిటులఁ
ద్రోచి రయ వీరు! నేత నాక్రోశమునను
రా వలదటంచుఁ బల్కంగఁ, బ్రజల నెట్లు
తిప్పలను బెట్టెదరొ”యంచుఁ దెలివి తప్పి,
మాటలాడంగ సరియౌనె? మాకు నామె
యిచ్చిన వరాల మాటల వెక్క డయ్య?

“ఓ తెలంగాణ ప్రజలార! నీతి తప్పి
నేను నడువను! తెలగాణ నిచ్చునట్టి
దాన నేఁ గాను! కేంద్రమ్మె దాని నిచ్చు!
మీ తెలంగాణ సెంటిమెంట్ మేము గౌర
వింతు మయ్య! నా భర్త యా వేళ మీకు
నిడఁ దెలంగాణమును బాగనెంచి, ఢిల్లి
హై కమాండుకుఁ దెలిపెను! మాకు మీర
లోటు వేయఁ గృతజ్ఞతఁ జాటుకొందు!”
మనుచు మాట్లాడి, నేఁ డిట్లు మాట తప్పి,
“జై సమైక్యాంధ్ర!” యనుచును సాఁగి వచ్చి,
మా తెలంగాణలో “సానుభూతి యాత్ర”
పేరఁ “దెలగాణ వ్యతిరేకి”, తీరు మార్చి,
యడుగు పెట్టంగ నడ్డరే యామె నపుడు?

మా మనోభావమ్ముల మాత్ర మామె
గాయ పఱుపంగ వచ్చునే? కనుక మేము
నడ్డుకొంటిమి నిరసన నందఁ జేయ!

మాట తప్పిన వారికి మంగళార
తుల నొసంగియు స్వాగతింతురె జనులిట?

“మా స్థలమ్ముకు రావద్దు, మాను”మనుచు
నిరసనముఁ దెల్ప; వచ్చిన నేమి కతము?
మమ్ము పరిహసించుటె కాదె మఱల మఱల?
“నిరసనముఁ దెల్పరా” దన, నేమి యిదియె
బ్రిటిషు పాలనమే? లేక, వేఱె యౌనె?

మా మనోభావముల గాయ మందఁజేయ,
మా నిరసనఁ దెల్పెడి హక్కు మాకు లేదె?

నాఁడు “సైమను గో బ్యా” కనంచు నాంధ్రు
లందఱును నడ్డరే తీవ్రమైన కృతుల!
నేల నడ్డిరి సైమను నిట్టి జనులు?

అట “సమైక్యాంధ్ర” పేర మీ రడ్డగించి
యున్న సీమాంధ్ర నేతల కెన్ని యడ్లు
పెట్టితిరొ మీరు మఱచిరే విలువ తప్పి?

బొత్స బంధువర్గము పైన బూటకంపు
దాడి చేసి, లూటి యొనర్ప ధర్మమౌనె?

హర్ష కుమారుఁ డేమియు ననియె నయ్య?
యతని పైదాడి సేయంగ నగునె నీతి?
మీది తీవ్రవాదము కాక, మాది యౌనె?

సరియె పోనిండు! మొన్న శ్రీశైల భక్తు
లనఁగ, మా హనుమంత రావును ననంగ,
నట వసించునట్టి తెలగాణ జను లనఁగ
నెందు కడ్డితిరో చెప్పు! నీతి మాలి,
నిండు చూలును వైద్యమ్ము నీఁకఁ దఱిమి
కొట్టినట్టి మిమ్మేమందు రట్టి తఱిని?

మా తెలంగాణకును జెందు మహిళ పైన
పేడఁ గొట్టుట నేమండ్రు వెఱ్ఱి యనక?
యిట్లు దాడి చేసిన కత మేమొ చెపుడు!

నిరసనము కాదె? మేమును నిరసనమును
దెల్పినారము! మమ్మేలఁ దిట్టుదు రయ?

మే మిట వసించు సీమాంధ్రు నేమి యైన
నంటిమే? మేమె బాధల నంది, వేయి
యాత్మ బలిదానముల నిడి యడలితి మయ!

మేము తీవ్రవాదులమైన, మీర లెవరు?
మమ్ము తెలబాను లందురే? మమ్మనంగ,
మీరు తెలబాన్ధ్రులరు కారె? మిత హితులరె?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!

***     ***     ***     ***     ***

(మొదటి భాగం...లింకు చూడదలచినవారు...దీనిపై క్లిక్ చేయండి)

(రెండవ భాగము చూడదలచినవారు...దీనిపై క్లిక్ చేయండి)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీది తెలుగు పద్యకవితారచనలో అందెవేసిన చెయ్యిలా ఉన్నది. ఈ నైపుణ్యాన్ని పోనివ్వకండి. నాకు వ్యక్తిగతంగా తెలంగాణవాదం పట్టకపోయినా మృదుమధురమైన మీ శైలి మళ్లీ మళ్ళీ మీ బ్లాగుకు నన్ను తీసుకొస్తోంది. మీరు రాజకీయేతర అంశాల మీద కూడా కవిత్వం వ్రాయగా చదవాలని ఉంది.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అయ్యా, నమస్కారములు!

తమరికి నా పద్య శైలి నచ్చినందుకు ధన్యుడను. నేను రాజకీయేతరాంశాలపై
కవిత్వం రాసే బ్లాగు మరొకటి ఉన్నది. అది "మధుర కవనం". దాని లింకును ఈ
దిగువ నిచ్చుచున్నాను. దయతో వీక్షించి, అభిప్రాయం తెలుపగలరు.

మధుర కవనం...www.madhurakavanam.blogspot.in
(లేదా...ఈ బ్లాగులోనే...నా మరోబ్లాగు శీర్షికన "మధుర కవనం" అని వ్రాసి ఉన్నదానిపై క్లిక్ చేయగలరు.

ధన్యవాదములతో,
భవదీయుడు,
గుండు మధుసూదన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి