గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 13, 2014

వాపును చూసి...బలుపనుకోవద్దు!


తెలంగాణ ఇచ్చామని,
మా వల్లే వచ్చినదని,
మా మద్దతు నిచ్చితిమని,
గొప్పలు చెప్పిన నమ్మకు!

తెలంగాణ ఏర్పాటొక
చిన్న విజయమేనయ్యా!
సంపూర్ణపు తెలంగాణ
సాధింపగ పూనుడయ్య!!

ఆంక్షలతో కూడినట్టి
తెలగాణొక రాష్ట్రమ్మా?
పదేండ్లకై సీమాంధ్రులు
ఇచటె యుంట కాంక్షితమా?

ఉమ్మడిగా గవర్నరును
భరియించుట మన ఖర్మమ?
ఉమ్మడి హైకోర్ట్ ఇంకా
కొనసాగుట మన విజయమ?

ఉన్నత విద్యల లోపల
కామను ఎంట్రన్సు ఆంధ్ర
వారలకే సీట్లనిడగ,
తెలగాణులు ఏడ్చుటయా?

తొంబది శాతము ఆంధ్రులు
మన కొలువుల నాక్రమింప,
పదిశాతము తెలగాణులు
ఊడిగమును చేయాలా?

రిటైరైన అక్రమార్క
ఉద్యోగులు తెలంగాణ
డబ్బును పెన్షను సొమ్ముగ
ఇంకా కాజెయ్యవలెనె?

దుమ్ముకొట్టినట్టి గదులు
గల భవనాల్ తెలగాణకు,
తళతళలాడెడి భవనాల్
సీమాంధ్రకు ఈయవలెనె?

ప్రత్యేకపు ప్రతిపత్తిని
సీమాంధ్రకు కలిగించియు,
తెలగాణకు మొండిచేయి
చూపింపగ నోర్చవలెనె?

పోలవరం ఏడు ముంపు
మండలాల్ని సీమాంధ్రకు
ధారాదత్తము చేయగ
చూచుచు ఊర్కుండవలెనె?

హైద్రబాదు భూములన్ని
ఆక్రమించినట్టి ఆంధ్ర
పెత్తందారుల చేతలు
ఇంకా సహియింపవలెనె?

అక్రమ ప్రాజెక్టులెన్నొ
కేటాయింపులు లేకయె,
మన జలముల దొంగిలింప
నోరుమూసియుండగలమె?

టాంకుబండుపైన ఉన్న
విగ్రహాల ప్రక్కన మన
తెలంగాణ సంస్కృతికిని,
చరితకు విగ్రహములేవి?

మనకు తెలంగాణ వచ్చె
నంచును జబ్బలను చరువ,
గొప్ప ఏమి జరుగలేదు,
ఇంకా నువు బానిసవే!

శిథిలమైన తెలంగాణ
నిపుడు పునర్నిర్మాణము
చేయగ సమకట్టినట్టి
నాయకులనె గెలిపింపుడు!

ప్రజలకు పట్టమును కట్టి
ధనిక బీద భేదమ్మును
రూపుమాప సమకట్టిన
నాయకులనె గెలిపింపుడు!

తెలంగాణ సాధనమున
ప్రజా పక్షమున నిలచియు,
కష్టనష్టములకోర్చిన
నాయకులనె గెలిపింపుడు!

బంగారపు తెలంగాణ
కలను నిజము చేయునట్టి
ప్రణాళికే కలిగినట్టి
నాయకులనె గెలిపింపుడు!

తెలంగాణ కాక యిపుడు
సంపూర్ణపు తెలంగాణ
సాధనముకు నడుము కట్టు
నాయకులనె గెలిపింపుడు!

తెలంగాణ రాష్ట్రమిచ్చి,
విడిచిన సౌకర్యములను
సాధింపగ బూనినట్టి
నాయకులనె గెలిపింపుడు!

తెలంగాణ రాష్ట్రమిడుచు,
పెట్టిన ఆంక్షలను త్రుంచి,
తెలగాణను పెంపుచేయు
నాయకులనె గెలిపింపుడు!

తెలంగాణ ప్రాంతీయత
వికసింపగ జేయునట్టి
ప్రణాళికలు గలుగు పార్టి
నాయకులనె గెలిపింపుడు!

ఓటరుగా బాధ్యతతో
మన బతుకుల బాగుపరచు
ప్రణాళికలు గలుగు పార్టి
నాయకులనె గెలిపింపుడు!

అప్పుడె మన తెలంగాణ
మితర రాష్ట్రముల లోపల
మేటిగాను వెలుగొందును!
మన బతుకుల వెలిగించును!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి