నాల్గు రాష్ట్రాలందు కాంగ్రెసు
శృంగ భంగమ్మాయె నిప్పుడు!
కారణమ్మెదియౌనొ తెలియగ
బూనుకొనుడయ్యా!
ఎన్నియో అభివృద్ధి కరమగు
సేవలను అందించినామని
జబ్బచరువకు! పేదప్రజకవి
అందలేదయ్యా!
అట్లె ఇప్పుడు తెలంగాణలొ
బడుగు ప్రజలిపుడడుగుతున్నది
ఆంక్షలేనిది అచ్చమైనది
తెలంగాణమ్మే!
హైదరాబాద్ పైని ఆంక్షలు
పెట్టకుండా, శాంతిభద్రత
తెలంగాణకు అప్పగించుట
సముచితమ్మయ్యా!
అప్పులను పంపకము ప్రాజె
క్టులకు చేసిన ఖర్చు ఆధా
రముగ జేయుడు! లేనిచో అది
దోషమే సుమ్మీ!
ఆస్తులవి నైజాము ప్రభువుల
కాలపువి మరి తెలంగాణవె!
ఢిల్లి ఏ.పీ. భవనమే మా
తెలంగాణదయా!
గతములో ఇట అక్రమముగా
కొలువులంది, రిటైరులందిన
ఆంధ్ర వారికి పెన్షనిచ్చుట
ఆంధ్రరాష్ట్రముదే!
నేడు కూడా అక్రమముగా
కొలువులందిన ఆంధ్రవారల
నాంధ్రకే బదిలీలు చేయగ
వలయునోయయ్యా!
ఇచటి ఉన్నత విద్యలందున
రిజర్వేషను పాతపద్ధతి
జరుపబూనుట అక్రమమ్మే!
మార్పుచేయుడయా!
ఆరు నూరైన నిక ఆంధ్రకు
తెలంగాణకు పొత్తు పెట్టుట
ఓర్చుకొనము, సహింపబోము!
పొత్తు వలదయ్యా!
ఎవరి హైకోర్ట్ వారికే యుం
డంగ వలెనయ! పొత్తులున్నచొ
తెలంగాణకు నష్టమగునయ!
వేరు చేయుడయా!
ఇర్వదెనిమిది రాష్ట్రములలో
కేంద్ర రాష్ట్రము బంధమెట్టుల
నుండెనో, తెలగాణకట్టుల
ఉండవలెనయ్యా!
అరువదేడుల నుండి ప్రజలిట
కోరుచుండిన తెలంగాణము
ఆంక్షలును లేకుండ నిత్తుర,
లేక ఓడుదురా?
తెలంగాణా ప్రజల కోరిక
తీర్చకుండిన ఓడిపోదురు!
న్యాయమీయుడు! గెలుపు పొందుడు!
వెలిగిపోవుడయా!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి