గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 14, 2013

ఇక దుష్టుల ఆటలు సాగవు!


(1) జలదము:
మా తెలగాణ రాష్ట్రమిట మానవతా
చేతముతోడ వెల్గఁగను; జిత్తులతో
భూతము వోలె మ్రింగఁగను బూనికతో
గోతులు త్రవ్వుచుండిరిటఁ గ్రూరతతోన్!

(2) తోవకము:
విసమును జిమ్మెడి వెఱ్ఱులతో, సం
తసముగ నుందురె నా తెలగాణుల్?
వెసఁ జెడుమాటల బీరము లేలా
గు సహన మూర్తుల కూర్మిని బెంచున్?

(3) స్రగ్విణి:
న్యాయ మార్గమ్ములో నవ్య రాష్ట్రమ్ము వేం
చేయ నుండంగ దుశ్శీల దుర్నీతి న
న్యాయ వృత్తుండ్రునై యాపఁగాఁ బూనుచో,
మాయ ఛేదించి, సన్మాన్యగాఁ జేయరా?

(4) వంశస్థము:
పరాకుతోఁ బల్కెడు పాడుమాటలే
స్వరాష్ట్ర కాంక్షోద్భవ సహ్యమయ్యె! స
త్పరీక్షలో నెగ్గును తత్సభన్ వెసన్!
విరాజిలున్ రాష్ట్రము వేగిరమ్ముగా!!

(5) తోటకము:
తెలగాణము వచ్చును తృప్తినిడున్!
బులకించెద రిచ్చటి పోరుజనుల్!
తులకించును రాష్ట్రము! దూరమగున్
పలుగాకుల దౌష్ట్య కుపాలనమే!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

గుండువారూ,

తులకించును అన్న పదప్రయోగం చాలా బాగుంది.

మీరు అన్యధా భావించకపోతే ఒక చిన్న సలహా. పాదోల్లంఘనం అన్నది చిన్న ఛందస్సుల్లో అంత కళగా ఉండదు. ముఖ్యంగా మాత్రాఛందస్సులలో వ్రాసేటప్పుదు పాదాంతవిరామం పాటిస్తే పద్యాలు మరింత పసందుగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు మాత్రాఛందాల్లో యతిస్థానం దగ్గర విరుపు వస్తే మరింత బాగుంటుంది. నాకు తోచిన మాట నేను చెప్పాను. మీకు నచ్చకపోతే వదిలెయ్యండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తాడిగడపవారూ!
మీ సలహాకు ధన్యవాదాలు. అయితే నేను రాసింది విశేషవృత్తాలు, మాత్రాఛందస్సులు కావు! తాము గమనించలేదనుకుంటాను! పాదోల్లంఘనం అవసరమనుకుంటేనేతప్ప చేయను. నేను దాదాపుగా యతిస్థానం దగ్గర విరుపు వచ్చేట్లుగానే రాశాను. మరొక్కమారు పరిశీలించండి! తెలుగులో ఇలా యతిస్థానంలో విరుపు ఉండాలనే నియమంలేదు. సంస్కృతంలో ఉంది. ఈ విషయం మీకు తెలియంది కాదు. ఐనా మీ సలహాను మాత్రా ఛందస్సుల్లో పాటించడానికి ప్రయత్నిస్తాను. మీ వ్యాఖ్యకు ఆలస్యంగా నా స్పందన తెలిపినందుకు మన్నించగలరు. మీ సద్విమర్శకు కృతజ్ఞుడను.

శ్యామలీయం చెప్పారు...

గుండువారూ, మీరు వ్రాసినవి విశేషవృత్తాలన్నది నేను గమనించకపోలేదండీ. మాత్రాఛందాలని నేను అపోహపడలేదు. మీరు తరచుగా పాదోల్లంఘనం చేస్తున్నారని అనటం‌ లేదు. పాదప్రమాణం చిన్నదిగా ఉన్నప్పుడు పాదోల్లంఘనం కొంచెం కళ తప్పిస్తుందన అభిప్రాయపడ్డానంతే. ఈ‌ ఖండికలో కొద్ది చోట్ల మాత్రం పాదోల్లంఘనం ఉంది. దోషం కాదు గాని వీలైతే ముందుముందు అది పరిహరించటం బాగుంటుందని సూచించానంతే. ఐనా మీకు తెలియదని కాదు. మీరన్నట్లు తెలుగులో యతివిషయంలో విరుపు నియతం‌కాదు సంస్కృతం కన్నడాల్లో నియతం‌ కాని. నిజానికి కందంలో కూడా పాదోల్లంఘనం నాకు తెలిసి ఏమాత్రం కళకట్టదు కాని కథాకథనాదుల్లో తప్పటం‌లేదు తెలుగు కవులకు నన్నయ నుండి నేటిదాకా! అలాగే ప్రాచీన అర్వాచీన కవులంతా తే.గీ, ఆ.వె. వంటి వాటిలోనూ‌ యధేఛ్ఛగా పాదోల్లంఘనం చేసారు. కాని ఆధునికకాలంలో పాదోల్లంఘనం కనీసం చిన్నపద్యాల్లోంచి తప్పిస్తే అవి మరింతగా ప్రజలకు హత్తుకుంటాయి. మాటవరసకు వేమన పాదోల్లంఘనం చేయకపోవటం, యతికి విరుపును పాటించటం అనేవి ఆయన పద్యాల పఠనీయతను బాగా పెంచింది. మీ‌పద్యాలు బాగుంటాయి. లబ్ధప్రతిష్ఠులైన మీకు నేను కొత్తగా ప్రశంశలు అందించ నవుసరం లేదనుకోండి! మీకు సలహాలనిచ్చేపాటి వాడను కాకపోవచ్చును కాని మీరు నా చిరుసలహాలను సహృదయంతో స్వీకరించినందుకు ధన్యవాదాలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తాడిగడపవారూ, మరల స్పందించి, వివరణ తెలిపినందులకు ధన్యవాదములు. ఇటువంటి సద్విమర్శనములు సర్వదా ఆమోదయోగ్యములే. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి