గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, డిసెంబర్ 18, 2013

చర్చలు ఇలా సాగాలి...


(1)
చర్చలే సాఁగు కొఱకయి, చక్కఁగాను
నేక వారమ్ము నేతల కీయఁ దగును!
మార్పు చేర్పులు కేంద్ర సమ్మాన్య సభను
జర్చ సారానఁ దెలుపంగఁ జాలుదురయ!
సభ్య క్రమశిక్షణము మేలు సభ్యులకును!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(2)
ఒకరు మాట్లాడుచున్న, మఱొకరు నడుమ
తలను దూర్చంగవలదయ్య! తగిన రీతి
పక్ష నిమిషకాలము చాలు వాదనకును!
ఏ నినాదాలు సేయ రాదీక్షణమున!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(3)
శాంత వాతావరణమందుఁ జక్కఁగాను
చర్చ జరుగునప్పుడు భంగ పర్చఁగాను
బూను సభ్యుల "సస్పెండు" పొందఁ జేసి,
చర్చ సాఁగంగఁ జేయుఁడు సంతసమున!
సభను వాయిదా వేయుట జరుగరాదు!
 శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(4)
సభను నడ్డుట, యఱచుట సమ్మతమ్ము
కాదు! చర్య గైకొనఁగ, శిక్షను గనకయ
మునుపె బాధ్యతఁ దెలిసి, ప్రమోదకరపు
రీతి మెలఁగంగఁ దగునయ్య నేతలంత!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(5)
శుభకరమ్మగు చర్చలే శోభఁ గూర్చు!
నుభయ రాష్ట్ర జనులకును విభవ మొసఁగు!
లాభదాయకరీతిలోఁ బ్రమదమెసఁగఁ,
జర్చ జరిపి, రాష్ట్రపతికిఁ జప్పున నిది
పంపుఁ డోయయ్య, విజయోత్సవమ్ముకొఱకు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి