కలిసి యుందమటందురు గాని, యెటులు
కలిసి యుందురు? తెలగాణ ఘనతఁ ద్రుంచి,
దోచుకొన్నట్టివారలే, దోచఁ బూని,
పైఁకిఁ గలిసియుందమటన్న బాగుఁ గనునె?
మమ్ము విడువుఁడు, వేఱుగా మనెద మనుచుఁ
గోరుచున్నట్టివారలఁ గోరి, కోరి,
కలిసియుందమటంచునుఁ గపటముగను
బలుక సరియౌనె? యిది యేక పక్షము గదె?
బలముఁ జూపెట్టి, కలిపియుంపంగ నిది, ని
రంకుశము గాదె? ప్రేమలు రంజిలఁగను
రెండు పక్షాలు సమ్మతిన్ నిండు మనము
తోడఁ దెలిపినఁ, గూడియుండుటలు గలుగు!
నేఁడు తెలగాణ రాష్ట్రమ్ము నీయఁగాను
కేంద్రమే పూన్కితోనుండె! సాంద్రమైన
ప్రేమతో విడిపోదము క్షేమమెంచి!
మనమునందునఁ గలిసియే మనెద మయ్య!!
నేత లిప్పుడసెంబ్లిలో నిక్కముగను
జర్చలం బ్రొద్దు పుచ్చంగఁ జాలినంత
కుట్ర జేయుచునుండిరి కోరి కోరి!
యేది యేమైనఁ దెలగాణ నిత్తురయ్య!!
ఎన్ని కుట్రలు జేసిన నేమి యైన,
మా తెలంగాణ నాపంగ మానవతను
వీడి, దౌష్ట్యముఁ జేసినఁ బగయె పెరుగు!
వీడి పోవుట ఖాయము! వెలుఁగు నిజము!!
చిన్న రాష్ట్రాల తోడనే శీఘ్రముగను
వృద్ధి యెసఁగునటంచును బేరుకొనియు
నార్టికలు మూఁడు నొసఁగిన హర్ష దాత
కంజలింతును తెలగాణ యాత్మతోడ!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి