(1)
శ్రీలు పొంగెడి తెలగాణ సీమ నేఁడు
మోద వార్ధి నిర్మగ్నయై మురిసిపోయె!
దీర్ఘకాలిక స్వప్న ప్రదృష్టమాయె!
మన తెలంగాణ బిల్లు కేబినెటు మెచ్చె!!
(2)
హైద్రబాదుతోఁ గూడిన యట్టి రాష్ట్ర
మీయఁగా సమ్మతిని దెల్పె న్యాయముగను!
పదియు జిల్లాల తెలగాణ భద్రముగను
వచ్చు నో సోదరా, వేగ వరము లిడఁగ!
(3)
మా తెలంగాణ ప్రజలకు మన్ననమునఁ
బదియు జిల్లాల తెలగాణఁ ద్వరగ నిడఁగఁ
బలు విధమ్ములఁ జర్చల వఱలు కతన,
ధన్యవాదాలు జీవొయం మాన్యుల కివె!
(4)
పదియు జిల్లాల తెలగాణఁ బఱఁగ నిడియు,
హైద్రబాద్ శాంతి భద్రతలన్ని కేంద్ర
హస్తమందుంచుకొన దుస్సహమ్ము మనకు!
శాంతి భద్రతల్ మనచేతఁ జక్కఁ బడవె?
(5)
విద్యలందు యథాస్థితి వెలయు ననఁగ,
మన తెలంగాణ కన్యాయ మగును గాన,
సత్వరముగను మన విద్య, శాంతి భద్ర
తలను గూర్చి పోరున కిప్డు తరలి రండు!
(6)
కేంద్ర ప్రకటన మాత్రాన గేహ మలికి,
పండుగలఁ జేసికొనఁగాను వల దటంచు
మనసు బోధించుచున్నది! మనకు రాష్ట్ర
మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి,
యెదిరి కదలికల్ దెలివితో నెఱుఁగ వలయు!
దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి