గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 31, 2013

సమన్యాయమంటే...ఇది!


ఇట సమన్యాయ మనఁగాను నేమి యనఁగఁ,
దెల్గుదేశమ్మునందు నీ దినమునుండి
యిటఁ దెలంగాణ సభ్యుల నెంచి, ముఖ్య
మంత్రిఁ జేయుట; యధ్యక్ష మాన్యుఁ జేయు;
టిద్దియే సమన్యాయమ్ము! తెలుఁగుదేశ
మందు నిట్టులఁ బాటింపుమన్నఁ జంద్ర
బాబు పాటించునే యిప్డు పఱఁగ దీని?

అదియునుంగాక, చంద్రబా బందఁజేయ
వలయుఁ దన సర్వధనములఁ బఱఁగ బీద
లైన తెలగాణ టీడీపి యాశ్రయులకు!
పంచిపెట్ట, సమన్యాయ పంథ యగును!!

ఇన్ని చేసిన పిదపనే హితముఁ గోరి,
యీ "సమన్యాయ" నినదమ్ము నెత్తవలయు!
అంతియే కాని యూరక నఱవనేల?
అర్లుగల బఱ్ఱె పెయ్యంత నాబతోడ
నాకినట్టులఁ గనుపింప నగునె నేఁడు?

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


(గమనిక: "అర్లుగల బఱ్ఱె ఒఱ్ఱొఱ్ఱి చచ్చినట్లు", "అర్లుగల బఱ్ఱె పెయ్యంత నాకినట్లు" అనేవి తెలంగాణలో వాడుకలో ఉన్న సామెతలు. ప్రేమ లేకున్నా పైకి కపట ప్రేమ నటిస్తూ నాటకాలాడే వాళ్ళను ఉద్దేశించి తెలంగాణ వాళ్ళు ఈ సామెతలు చెప్పి వెక్కిరిస్తుంటారు.)

6 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

వెక్కిరించటం తెలంగాణావారి నైజం అంటున్నారా?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అవును. అన్నీ తెలిసీ, తెలియనట్టు నటించేవారిని వెక్కిరించక తప్పుతుందా? కాపట్యాన్ని మదిలో ఉంచుకొని, అమాయకుల లాగా నటించేవారిని, సిగ్గొచ్చేలా వెక్కిరించడం తెలంగాణావారి నైజమే! స్పందించినందుకు ధన్యవాదాలు!

Jai Gottimukkala చెప్పారు...

సిగ్గూ ఎగ్గూ వదిలేసి ఇష్టం ఉన్నా లేకున్నా కలిసే ఉండాలనేటొడిని ఎక్కరిస్తే వానికి సిగ్గు రాదు మధు భయ్యా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణ పట్ల ద్రోహచింతన ఉండి, పైకి నంగనాచి కబుర్లు చెప్పే కుహనా పెద్దమనుషులకు సిగ్గొచ్చేలా చేయడానికి ప్రత్నించడం తెలంగాణ నైజమైతే, సిగ్గూ ఎగ్గూ వదిలేసి, దౌర్జన్యం ప్రదర్శించడం సీమాంధ్రుల నైజం. వాళ్ళకు ఎన్ని మోటు సామెతలు చెప్పినా సిగ్గు శరం రాదు. ఐనా సిగ్గొస్తుందేమోనని నా ప్రయత్నం భయ్యా!
నవ్యాంగ్ల వత్సర శుభాకాంక్షలతో...

rajiv raghav చెప్పారు...

మధు గారు,
మన రాజకీయ నాయకుల గురించి వదిలేద్దాం.... ఇప్పటి వరకు జరిగినా సంఘటనల ఫలితంగా కల్సిఉండడానికి మాకు ఏ మాత్రం సుముఖంగా లేదు... ఖచ్చితంగా విడిపోవల్సినదే.. మీకు నచ్చిన విధంగానే తెలంగాణాని ఏర్పాటు చేయడానికి నిర్ణయం కూడా జరిగిపోయింది.... కానీ ఈ ప్రాసెస్ లో భాగంగా విడిపోబడుతున్న ప్రాంతానికి, అంటే నిన్నటి వరకు మీతో కల్సి ఉన్న మిగతా ప్రాంతానికి సరయిన మౌఖిక సదుపాయాలు బిల్లులో కల్పించకపోవడం మీకు అభ్యంతకరమా కాదా అన్నది మీరు వ్యక్తిగతంగా చెప్పగలరా?..
మీకు అభ్యంతరం కాదనుకుంటే తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఇతరులు ఏ విధంగా నష్టపోయినా పర్లేదు అన్నట్టుగా భావించాలి....
లేదా ఇప్పటి వరకు మనం కలిసున్నాం.. వారు కూడా మా సోదరులు లాంటి వారే... మన కారణంగా ఏర్పాడుతున్న తెలంగాణా కారణంగా వారు ఇబ్బందులు పడడం భావ్యం కాదు అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న విభజన ప్రాసెస్ మీద మీకు అభ్యంతరం ఉండి ఉండాలి.....

విభజన బిల్లులో హైదరబాద్ తో కూడిన తెలంగాణా ఇస్తున్నందున, కొత్త రాజధాని అవసరమయ్యే సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి సాయం చేస్తారో విపులంగా వివరించకపోవడం న్యాయమా అన్యాయమా అన్నది మీరే చెప్పాలి......

అవన్నీ మాకు అనవసరం... మాకు తెలంగాణా వచ్చింది.. అది చాలు.. మిగతా వాటితో మాకు సంబంధం లేదు అంటారా!! మీ ఇష్టం....

ఏమి జరిగినా, జరగపోయినా మాలో చాలా మంది మీతో మానసికంగా ఎప్పుడో విడిపోయాము. ఇక బౌగోళికంగా విడిపోవడం గురించే వెయిటింగ్ చేస్తున్నాము....

అది మిమ్మల్లి ఇబ్బందిపడడం గురించో, లేదా భాద పడడానికో ఉద్దేశించినది కాదు....
మనం కూడా రాజకీయ నాయకుల వలే ఆలోచించకూడదన్నది నా ఉద్దేశం...అలా చేస్తే వారికి, మనకి తేడా ఏముటుంది?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

రాజీవ్ రాఘవ్‍గారూ! సీమాంధ్ర నేతలలో గల విభిన్న స్వరాలనూ, సమైక్యాంధ్ర నినాదాన్నీ నిత్యం వింటూవున్న నాకు అసలు సీమాంధ్రులకు ఏం కావాలో స్పష్టంగా తేల్చుకోవాలని చురకలాగా ఈ టపా రాశాను! ఇక్కడ "సీమాంధ్రులు" అంటే, సీమాంధ్ర నాయకులూ, పెట్టుబడిదారులూనని మీరు అర్థం చేసుకోవాలి. సీమాంధ్ర ప్రజలపై మా తెలంగాణులకు ఏ ద్వేషభావమూ లేదు. ఏ ఆంక్షలూ లేని తెలంగాణ మాకు కావాలనే కోరికతో బాటు, సీమాంధ్రకు అన్ని వసతులున్న రాజధానీ మొదలైనవి సాఫీగా పరిపాలన సాగడానికి ఉండాలని మేం కోరుకుంటున్నాం. సీమాంధ్ర నాయకులకు తెలంగాణను ఇంకా ఇబ్బందులపాలు చేయాలనే కోరిక ఉండడం వల్ల మేం అశాంతికి గురవుతున్నాం.
నాయకులే స్వార్థప్రయోజనాల్ని ఆశించి తెలంగాణ బిల్లుకు అడ్డుపడుతున్నారు. అలా కాక చర్చలు చేపట్టి సీమాంధ్రకు ఏం కావాలో అడగవచ్చు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పడుతుందన్నది వాళ్ళకు తెలుసు. ఐనా కుట్రలు పన్నుతున్నారు. తద్వారా చర్చలలో సీమాంధ్రకూ, తెలంగాణకూ ప్రయోజనం చేకూరే విషయాలు రాకుండానే రాష్ట్రపతికి బిల్లు చేరుతుంది. మా ప్రయోజనాల్ని మేం ఎలాగూ సాధించుకుంటాం. నష్టం మీకే. దీన్ని మీరు మీ నాయకుల ఎదుట ప్రతిఘటించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది.
స్పందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి