తెలగాణుల కల సాకా
రము కావలెనని యనుచో,
ఏ పార్టీ అధికారము
లోకి రావలయునయ్యా?
తెలగాణులు బాగుగాను
సమీక్షించి, ఓటువేసి,
బంగరు తెలగాణ నిడెడు
పార్టిని గెలిపింపవలయు!
టీడీపిని గెలిపించుచొ,
చంద్రబాబు చేతికి మన
జుట్టునిచ్చినట్లగునయ!
మన కల నెరవేరదయ్య!!
వైసీపిని గెలిపించుచొ,
జగనుబాబు చేతికి మన
జుట్టునిచ్చినట్లగునయ!
మన కల నెరవేరదయ్య!!
ఈ ఇరువురు సీమాంధ్రులు
తెలగాణను వెలిగింతురె?
చేతికందినంత మనల
దోచుకొనగ నూరకుండ్రె?
ఇకపోతే బీజేపీ!
తెలగాణకు మద్దతిత్తు
మని చెప్పియు, నాంక్షలిడిరి!
మన హక్కులు మంటనిడిరి!!
బీజేపియె టీడీపీ
పొత్తుగూడుచో ఆంధ్రా
బాబు చంద్రబాబు చెప్పి
నట్లుగాను వినకుండునె?
కావున ఈ బీజేపిని
ఎన్నికలలొ గెలిపించిన,
మన కలలకు బ్రేకు పడును!
తెలగాణకు నష్టమగును!!
ఇక కాంగ్రెస్ పార్టీయో,
"తెలంగాణ నిచ్చునదియు,
తెచ్చునదియు మా పార్టీ"
యని ప్రగల్భములు పలికెను!
తెలంగాణ నిచ్చుకొరకు
కట్టుబడితిమంటూనే,
తెలంగాణ హక్కులకును
తూట్లు పొడిచినారు వారు!
రెండువేల నాల్గులోన
మానిఫెస్టొలో పెట్టియు,
టీయారెస్ పొత్తుగూడి,
అధికారము చేతగొనిరి!
ఏరు దాటినంక తెప్ప
తగలేసిన రీతిగాను,
తెలగాణను ఈయరైరి,
మాటతప్పి మిన్నకుండ్రి!
రెండువేల తొమ్మిదిలో
కేసీయార్ నిరాహార
దీక్ష ఫలితముగ, ప్రకటన
చేసి, వెనుక కడుగిడిరయ!
కమిటీలతొ కాలమ్మును
నాలుగేండ్లు గడిపి, వారు,
వేయిపైన ఆత్మహత్య
లకు కారణమైనారయ!
ఎన్నికలకు ముందు ఓట్ల
కొరకు పథకమును పన్నియు,
తెలంగాణ నిత్తుమనియు,
నింత నాటకమ్మాడిరి!
నాటకీయ ఫక్కీలో
సాగినట్టి ప్రహసనమ్ము,
తెలగాణుల హృదయాలను
వేదనకును గురిచేసెను!
బిల్లులోన సవరణములు
సరకుగొనక, తెలగాణకు
గల హక్కుల లాగికొనియు,
డొల్ల తెలంగాణ మిడిరి!
తెలంగాణ అను పేరిట
మిఠాయి పొట్లమ్మిడియును,
మిఠాయి మాత్రము ప్రేమగ
సీమాంధ్రుల కిడిరయ్యా!!
తెలంగాణ మనకిడినను
హైద్రబాదుపై అధికా
రము గవర్నరుకు నిడియును
మన నవమానించిరయ్య!
తెలంగాణ మిచ్చితిమని
ఇంత ద్రోహమును చేసిన
కాంగ్రెస్సును గెలిపించుచొ,
మన కల నెరవేరునెట్లు?
అధికారము కొరకు వారు
కుమ్ములాడుకొనుటతోనె
పుణ్యకాలమే గడచును,
మన కల నెరవేర్తురెట్లు?
అందువలన మన కోసము
తెలంగాణ సాధింపగ
ప్రాణమ్ముల పణముగాను
పెట్టి, గెలిచె కేసీయార్!
తెలంగాణ సాధనకై
ఉద్యమ పార్టీ పెట్టియు,
అహర్నిశలు పోరాడియు,
మన కల నెరవేర్చినాడు!
వచ్చిన తెలగాణమ్మును
బంగరు తెలగాణగాను
మార్చగ బూనిన పార్టీ
కేసీయార్ టీయారెస్!
తెలంగాణ రాష్ట్ర సమితి
నెన్నికలలొ గెలిపించుచొ,
మన కాంక్షల, మన ఆశల
తప్పక నెరవేర్చగలదు!
తెలంగాణ ఎద చప్పుడు
ఎరిగినట్టి కేసీయార్,
తెలంగాణ గౌరవమును
విలసిల్లగ జేయగలడు!
ఎవ్వరెన్ని విమర్శలను
చేసిన, పెడచెవిని బెట్టి,
తెలగాణను సాధించిన
కేసీయార్ గెలువవలెను!
అతని నాయకత్వమ్మున
మన కల సాకారమగును!
బంగరు తెలగాణమ్మే
తప్పకుండ సాధ్యమగును!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి