గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 15, 2014

ఇదీ...సీమాంధ్ర పాలకుల నిర్వాకం!


బాసరలో ట్రిపులైటీ
నెలకొల్పుట పేరునకని,
నూజివీడులో, ఇడుపుల
పాయలొ జూచిన తెలియును!!

సీమాంధ్రుల పక్షపాత
మున కిదియే నిదర్శనము!
మొక్కుబడిగ నెలకొల్పిరి,
సమస్యలకు తావిచ్చిరి!!

త్రాగుటకును మంచినీళ్ళు
కరువైనవి ఈ చోటున!
స్నానాదికములకు నదిని
ఆశ్రయింపవలె నిచ్చట!!

ఆహారపు సరఫరాలొ
ప్రైవేట్ వ్యక్తుల దందా!
అధికారుల మెప్పించుచు
విద్యార్థుల మాడ్చుచుండ్రి!!

అనారోగ్య స్థితుల కిచట
వైద్యమ్మే కరువాయెను!
ప్రజాస్వామ్యమున విద్యా
ర్థుల బానిసలను జేసిరి!!

అధికారులు, నాయకులకు
ఎన్నిమార్లు మొరపెట్టిన,
వాగ్దానములిచ్చెదరయ,
నెరవేర్చుట మరచెదరయ!

విద్యార్థుల దయనీయపు
పరిస్థితికి తలిదండ్రులు
చక్కజేయు దారిలేక,
ఆవేదనచెందుచుండ్రి!

గతంలోన విద్యార్థులు
నలుగురు ఇది తాళలేక,
మరియొక మార్గము లేకయె
ఆత్మహత్య జేసికొనిరి!

విద్యార్థిను లిట వేధిం
పులకును గురియగుచుండిరి!
ఆదుకొనెడివారు లేక,
బావురుమని యేడ్చుచుండ్రి!!

ఆందోళన జరిగినపుడు
’గుర్తింతురు’ అని భయపడి,
విద్యార్థినులంత ముసుగు
ధరియించుట దారుణమ్ము!

"ఒక విద్యార్థినిని గదిని
బంధించియు, హింసించిరి"
అను ఆరోపణను జూడ,
ఈ స్థితెంత దారుణమయ?

హైదరబాదున నిర్మిం
పగ జూచిన ట్రిపులైటీ
బాసరలో పెట్ట గోర,
కక్షబూనిరయ్యవారు!

కోస్తలోన, సీమలోన
నెలకొల్పిన సౌకర్యాల్
బాసరలో ఏలలేవు?
తెలగాణముపై వివక్ష??

కాంగిరేసు పరిపాలన,
సీమాంధ్రుల అజమాయిషి,
ఈ విద్యా సంస్థ నిటుల
అధోగతికి నెట్టివేసె!

మన తెలగాణపు సంస్థను
మనమే సరిచేయవలెను!
మన బాధల దీర్చునట్టి
పాలకులను ఎన్నవలెను!!

***      ***      ***

ఈ విషయంలో పూర్తి వివరాలకు :

(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

Varunudu చెప్పారు...

ఈ పద్యాలద్వారా ఏమి చెప్పాలనుకొన్నారో అర్థం కాలేదండీ. సీమాంధ్ర అంటే ఒక ఇడుపుల పాయో మరోటో మాత్రమే కాదు. ఎప్పుడైనా సీమాంధ్రుల పల్లెటురికి వచ్చి చూడండి. ఎవరో పచ్చగా ఉన్నాయంటే మీరు ఔను గామోసు అనుకోవడం కాదు. రాయల సీమ లో పల్లెటూళ్ళు ఎప్పుడైనా చూసారా? నీటి కోసం ఎంత దూరం వెళ్ళాలో తెల్సా..? ఎక్కడైనా కష్టపడుతున్నది సామాన్యుడే.. దానికి పైగా ఆంధ్రోళ్ళు అనే ఒక వెటకారపు పిలుపు. ఆంధ్రోళ్ళు అంటే మీరు చూపే ఒక పాతికా, పరకా రాజకీయనాయకులో , పెట్టుబడిదారులో మాత్రమే కాదు. వాళ్ళ మీద మీకు ఎంత కోపం వుందో, ఇక్కడ ప్రజలకూ అంతే ఉంది.

సరే ఇలా బాసరలో నీటి సమస్య సీమాంధ్రుల వల్లే అనుకొందాం. మీ ప్రాంత రాజకీయ నాయకులేమయ్యారు? వారిని చొక్కా పట్టుకొని నిలదీయడం ఇప్పటికైనా నేర్చుకోక పోతే.. వాళ్ళు, రాబోయే మరో వందేళ్ళ దాకా సీమాంధ్ర దౌర్జన్యం అనే బూచి చూపి, వాళ్ళ డబ్బులూ, వాళ్ళ ఓట్లూ జాగర్త చేసుకొని, ప్రజలని మరచి పోతారు. మీరు ఇలా పద్యాలు వ్రాస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త !

ఐనా రాజకీయనాయకుడికి ఒక ప్రాంతం అనేముంది? దేశమంతా నయవంచకులే ఇప్పుడు రాజ్యమేలుతున్నారు అనే సత్యం మరచి పోయి, తెలంగాణ లో వర్షమొచ్చినా అది ఆంధ్ర దురహంకారమే అని, ఎండ కాసినా ఆంధ్రా దౌర్జన్యమే అని ఎన్నేళ్ళు ఆత్మ వంచన చేసుకొంటారు? ఇలా ప్రాంతాల వారిగా ప్రజల మధ్య విద్వేషాగ్ని రగల్చకండి. వీలైతే పరిష్కారం చూపండి. అలా చూపే వాడు తెలంగాణ వాడైనా, కన్యాకుమారి వాడైనా చెయ్యెత్తి జైకొట్టడానికి దేశమంతా సిద్దంగా ఉంటుంది.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి. నేను రాసిన టపా శీర్షికలోనే స్పష్టంగా ఉంది తెలంగాణలోని బాసర ట్రిపులైటీని నిర్లక్ష్యం చేసిందెవరో! మాకు అన్యాయం చేసింది సీమాంధ్ర ప్రభుత్వమే...ఇందులో భాగస్థులైన టీకాంగ్ నాయకులు తెలంగాణకు అన్యాయంచేస్తున్నా వాళ్ళ స్వలాభాలు ఆశించి మిన్నకున్నారు. వీళ్ళకు బుద్ధిచెప్పే రోజు వచ్చింది. తప్పక బుద్ధిచెపుతాం.

మీరు పనిగట్టుకుని ఇంత పెద్దవ్యాఖ్య ఎందుకు రాశారు? ఏం అర్థం కానందుకు రాశారా, అపార్థం చేసుకుని రాశారా? నేను రాసే టపాల్లో సీమాంధ్రులంటే సీమాంధ్రకు సంబంధించిన స్వార్థ నాయకులు, పెట్టుబడిదారులు, తెలంగాణ నీళ్ళు, నిధులు, కొలువులు, భూములు అక్రమ మార్గాల్లో కొల్లగొట్టిన దగుల్బాజీలని చాలాసారు సెలవిచ్చాను. సామాన్య సీమాంధ్ర ప్రజలు మా సోదరులు అని కూడా చాలాసార్లు సెలవిచ్చాను. నేను ఈ టపాను అజ్ఞానంతో రాయలేదు. తెలిసే రాశాను. ఇందులో నిజానిజాలు ఆలోచిస్తే మీకు బోధపడతాయి.

సీమాంధ్రలో మూడు జిల్లాలు, తెలంగాణలో ఎనిమిది (మొత్తం పదింట్లో హైదరాబాదు, రంగారెడ్డి కాక) జిల్లాలు వెనుకబడిన జిల్లాలను కేంద్రమే ప్రకటించింది. దీన్నిబట్టి మీరర్థంచేసుకోవలసింది ఏమంటే సీమాంధ్రకన్నా, తెలంగాణ పూర్తిగా ఉపేక్షింపబడిందని! ఇంతకన్నా నేను మీకు ఎక్కువ చెప్పదలచుకోలేదు. స్వస్తి.

అజ్ఞాత చెప్పారు...

కోస్తలోన, సీమలోన
నెలకొల్పిన సౌకర్యాల్
బాసరలో ఏలలేవు?
తెలగాణముపై వివక్ష??

గురువు గారు , సీమ లో సౌకర్యాలు అన్నారు , ఎం సౌకర్యాలు ఉన్నాయ్ సర్ సీమ లో ? రాత్రి ఏడూ దాటితే వూరు ఎల్లటానికి బస్సు ఉండదు , పొలం కి నీరు పెట్టటానికి రెండు గంటలకి మించి కరెంటు ఉండదు , ఏదో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్న చోట తప్ప మిగతా ఎక్కడ ఆరోగ్య సదుపాయం లేదు , చిన్న పాటి ఉద్యోగం కూడా దొరకక సీమ నుండి పక్క రాష్ట్రం లో ఉన్న బెంగలూరు కి ఎన్ని కుటుంబాలు వలస వెళ్ళాయో మీకు తెలుసా ? ఎన్ని ప్రబుత్వ పాటశాలలు ఇంకా చావడి, గుడి లో నిన్న మొన్న దాక నడిపారో తెలుసా మీకు , ఇంకా నడుపుతూనే ఉన్నారు కొన్ని చోట్ల అంటే మీరు నమ్ముతార ? సీమ కి కూడా ఈ రాజకీయనాయకులు చేసింది ఏమి లేదు , అసలు అక్కడ తినటానికే తిండే సరిగ్గా లేదు మీరేదో సౌకర్యం అంటున్నారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలుగోడుగారూ, మీరు అపార్థం చేసుకున్నారు! నేను రాసింది కోస్తాలోని నూజివీడు ట్రిపుల్‍ఐటిలోనూ, సీమలోని ఇడుపులపాయ ట్రిపుల్‍ఐటీలోనూ సీమాంధ్ర పాలకులు సమకూర్చిన సౌకర్యాలు, తెలంగాణలోని బాసర ట్రిపుల్‍ఐటీలో సమకూర్చలేదు అని! అరవైఏండ్లనుండి మమ్మల్ని బానిసల్లా చూస్తూ మా ట్రిపుల్‍ఐటీపై కూడా వివక్ష చూపారు...అని! అందుకే మేం తెలంగాణ రాష్ట్రం కోరాం, సాధించుకున్నాం! ఇకపై ట్రిపుల్‍ఐటీని మేమే బాగుచేసుకోవాలి అని నా భావం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి