గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 11, 2014

పోలవర నిర్మాణంతో భద్రగిరిజ(ను)ల సమాధి ఖాయం!


నేఁడు కేంద్రమ్ము పూనిన నీచమైన
చేఁతలకు ఘోరమైనట్టి స్థితియె కలుగు!
భద్రగిరిజనులును మఱి భద్రగిరియు
జలసమాధి యౌదురు సుమ్ము! సత్య మిదియె!

కుటిల సీమాంధ్ర నాయక కోటి నిపుడు
సంతసింపఁగఁ జేయంగఁ జాలినట్టి
పోలవరమును నిర్మాణము నిఁకఁ జేసి,
భద్రగిరి ముంపఁ బూనుట భద్రమగునె?

భద్రగిరి ముంపు గ్రామాలు వారల కిడి,
బిల్లు నామోద ముద్రతోఁ జెల్లుఁబాటుఁ
జేసి, యార్డినెన్సున నేఁడు చిత్రముగను
నేడు మండలమ్ముల నిడ నేమి కతము?

గిరులను, గిరిజనులను రక్షింపకుండ,
పోలవరమును నిర్మింపఁ బూనుటేల?
పోలవర గిరిజనులు సంపూర్ణమైన
మానవులు గారె? ముంపంగ మానుఁడయ్య!

పోలవర డిజైనును మార్చి, ముంపులేని
విధముగాఁ గట్ట వీలుండ, విడచి దాని,
ముంపుఁ గోరియు నిర్మాణము నిటుఁజేయఁ
గుట్రయే గాని మఱియొండు కోరి గాదు!

భద్రగిరిలోని మండలాల్ వశము సేసి
కొనెడి దుశ్చింత వారల కున్నదయ్య!
అదియె నెరవేరె నార్డినెన్సందఁజేయ!
మా తెలంగాణమిది యొప్పమానునయ్య!!

ఒకరి కన్యాయమునుఁ జేసి, యొకరి కిపుడు
సంతసముఁ గూర్పఁగాఁ బూన సఖ్యమౌనె?
ఆ డిజైనును మార్చియు నాదరించి,
మాకు నన్యాయమునుఁ జేయ మానుఁడయ్య!


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి