రెండువేలనాలుగులో
తెలంగాణ ఇచ్చెదమని
నమ్మించియు ఓట్లు గొనియు
ఐదేండ్లుగ మోసగించ్రి!
రెండువేలతొమ్మిదిలో
తెలంగాణ రాష్ట్రమ్మును
ఇచ్చునదియు, తెచ్చునదియు
కాంగ్రెస్సే అని అనిరయ!
కేసీయార్ నిరాహార
దీక్షబూనగాను వేగ
తెలంగాణ నిత్తు మంచు
పలికియు, మాటను తప్పిరి!
ఆంక్షలేవి లేకుండా
తెలంగాణమిచ్చినచో
టీఆరెస్ విలీనమును
చేతుమనెను టిఆరెస్!
టీఆరెస్ వాగ్దానము
పెడచెవినిం బెట్టినారు!
ఆలస్యము చేసినారు,
నిర్లక్ష్యము చేసినారు!!
ఆలస్యము ఐనకొలది
ప్రజలలోన భయాందోళ
నమ్ములు వ్యాపింపంగను
ఆత్మహత్యలే జరిగెను!
వేయిమంది బలిదానము
చేసిన గని కేంద్రమునకు
సుంతయినను జాలి, కరుణ
కలుగలేదు, కఠినాత్ములు!
విద్యార్థులు, ఉద్యోగులు,
ప్రజాసంఘ ప్రభృతు లపుడు
ఉద్యమమ్మునందు దూకి,
సకల జనుల సమ్మె చేస్రి!
కాంగ్రెస్సిది లెక్కగొనక,
ఉద్యమమును అణగద్రొక్క,
పోలీసులనుసిగొల్పెను,
కేసులెన్నొ పెట్టించెను!
లాఠీ ఛార్జీలు మరియు
బాష్పవాయుప్రయోగములు,
రబ్బర్ బుల్లెట్లు ప్రయో
గించి, అణచ జూచినారు!
ఏ ప్రయోగములు చేసిన,
ఎన్ని కేసులను పెట్టిన
తెలంగాణ ప్రజ లెవ్వరు
ఉద్యమమును మానకుండ్రి!
కమిటీ లెన్నో వేసియు,
సూచనలెన్నొ పొందియు,
ఎంత కాలము గడిపియు
తెలంగాణ నీయరైరి!
ఇన్ని చేసినను కానని
కేంద్రమిపుడు కదలివచ్చె!
రకరకాల సర్వే ఫలి
తాలను గని కదలివచ్చె!!
ఎన్నికలే సమీపించ,
లబ్ధిపొందగాను దలచి,
తెలంగాణ రాష్ట్రమిచ్చు
మిషతో ఎర వేసిరయ్య!
తెలంగాణమును ఇచ్చుట
ప్రేమతోడ కాదు...కాదు,
జాలికూడ కాదు...కాదు,
మానవత్వముతో కాదు!
వోట్లకొరకు, సీట్లకొరకు
అధికారము పొందుకొరకు!
ఏదైతేనేమి మనకు
తెలంగాణ మిచ్చినారు!
ఎట్టి తెలంగాణ మిడిరి?
డొల్ల తెలంగాణ మిడిరి!
సీమాంధ్రకు న్యాయ మిడిరి,
తెలగాణకు ద్రోహ మిడిరి!!
టీఆరెస్ విలీనమును
జరుపనట్టి కోపముతో,
తెలంగాణపై కక్షను
బూని, ద్రోహమును చేసిరి!
తెలంగాణ నెప్పుడిత్తు
మని చెప్పిరొ, దాని దాటి,
అసమగ్రపు తెలగాణను
పదియేండ్లకు నిప్పుడిడిరి!
వేయిమంది బలిదానము
జరిగిన పిదపను నిచ్చిరి!
ఆంక్షలు వలదంటున్నా,
ఆంక్షలతోడనె యిచ్చిరి!!
తెలగాణులకును మిఠాయి
పొట్లమిడిరి ఖాళీగా!
మిఠాయిలను సీమాంధ్రకు
ఇడిరి మరీ భద్రంగా!!
ఇంతగొప్ప కాంగ్రెస్సును
ఎట్టుల గెలిపింతుమయ్య?
వేయి ఉసురులను దీసిన
కాంగ్రెసెట్లు గెలుచునయ్య??
బీజేపీ, టీడీపీ
వైయెస్సార్‍సీపిలట్లె
రాజకీయ లబ్ధికొరకు
వలవేసిరి, ప్రేమ గాదు!
తెలగాణకు అండయైన,
తెలగాణకు బాసటైన,
తెలగాణకు రక్షయైన
టీఆరెస్ మన ఊపిరి!
తెలంగాణ రాష్ట్రమ్మును
బంగరు తెలగాణగాను
మార్చబూను కేసియార్‍కు
బాసటగా నిలువుమయ్య!!
తెలంగాణ అస్తిత్వం
కాపాడగ బూనినట్టి
కేసీయార్ ఆశయమ్ము
వర్ధిల్లగ ప్రతిన గొనుము!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి