తెలంగాణ కవిపండితమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
జయనామ యుగాది పర్వదిన శుభాకాంక్షలు!!
స్వాగత వృత్తము:
స్వాగతమ్ము జయ స్వాగతమమ్మా
వేగిరమ్మె యిఁక వేడుకనిమ్మా
భోగభాగ్యములు పొందుగనిమ్మా
యోగసిద్ధులవి యొప్పుగనిమ్మా!
స్వగ్విణీ వృత్తము:
మా తెలంగాణమున్ మంచిరాష్ట్రమ్ముగన్
చేతువంచిప్పుడున్ శీఘ్రమే కోరుచున్
మాతరో నిన్ను మేమాదరోత్కృష్టతన్
నూతనోత్సాహమందోలలాడింతుమే!
రథోద్ధత వృత్తము:
దుష్టపాలనము దూరమాయెఁగా
కష్టకాలమిఁక ఖర్వమాయెఁగా
శిష్టభావనలు శీఘ్రమే యిడన్
తుష్టి నొందెదము తూర్ణ మో జయా!
వనమయూర వృత్తము:
ఎన్ని తెలగాణమున హీనతను డుల్చన్
నిన్ను నుతియించెదము నిక్కమగు భక్తిన్
విన్నపము చేసెదము వేగ మముఁ బ్రోవన్
మన్ననను మమ్ము గనుమమ్మ జయ మాతా!
తోవక వృత్తము:
కలుములతోడను గాంక్షలు తీరన్
విలువలఁ బెంచెడి ప్రేమల నిమ్మా
ఫలితము దక్కఁగ వంతలు తీర్చన్
దలఁచెద మిప్పుడు తల్లి జయమ్మా!
ప్రియంవదా వృత్తము:
అరువదేండ్ల కల హంగు మీఱఁగన్
విరుల వర్షమును బ్రేమ తోడుతన్
గురియఁ జేయఁగను క్రొత్త రాష్ట్రమున్
వరలఁ జేయ జయ వందనమ్మిదే!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!