గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 17, 2014

సీమాంధ్ర అక్రమార్కుల భూదాహం...150 కోట్ల భూమికి ఎసరు!

-న్యాయస్థానానికి ఇచ్చిన భూమి మళ్లింపు
-గత ప్రభుత్వ హయాంలో మాయాజాలం
-వైఎస్ పేషీ ఫోన్‌కాల్‌తో మొదలైన అక్రమాలపర్వం
-ఆగమేఘాల మీద ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపు
-వాస్తవాలు తేలినా సాగదీస్తున్న యంత్రాంగం
-రేపు మరోసారి విచారణ
అది హైటెక్ సిటీ సమీపంలో ఉన్న పదెకరాల సర్కారు భూమి. ఫక్తు ఖారీజ్ ఖాతా అని రికార్డుల్లో ఉంది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వచ్చే సర్వేనంబరు 972గల ఆ భూమిని 2006లో ఐదెకరాలు సబ్‌స్టేషన్ నిర్మాణానికి సీపీడీసీఎల్‌కు... ఆతర్వాత రెండు దఫాలుగా మిగిలిన ఐదెకరాల భూమిని తొమ్మిదో మెట్రోపాలిటన్ కోర్టుకు కేటాయించారు. క్షేత్రస్థాయి పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారుల సమక్షంలో హైకోర్టు నుంచి వచ్చిన అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రక్రియలు, రికార్డులు జరిగిపోయాయి. అయితే ఈ భూమికి డిమాండు పెరగడంతో కొందరు సీమాంధ్రుల కన్ను పడింది.
2008లో తెర వెనక పావులు కదిపారు. ఆ పదెకరాల భూమిని 1961లో భరత్‌రెడ్డి అనే స్వాతంత్య్ర సమరయోధుడికి (పొలిటికల్ సఫరర్) కేటాయించారంటూ ఆయన వారసులు ఇద్దరు రంగారెడ్డి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ భూమిపై వచ్చిన ఇలాంటి దరఖాస్తులను అధికారులెవరూ కనీసం పట్టించుకోరు. కానీ ఈ దరఖాస్తుపై వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేషీ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లా అధికారులు బాలానగర్ తహసీల్దార్‌ను ఆదేశించడంతో ఆయన ఆ పదెకరాల భూమిని చెరో ఐదెకరాలు మ్యుటేషన్ చేసి... రికార్డుల్లో అమెండ్‌మెంట్ కూడా చేసి పారేశారు. గతంలో ఈ భూమిని సీపీడీసీఎల్, న్యాయస్థానానికి కేటాయించిన విషయాన్ని విస్మరించారు. కనీసం ఆ కేటాయింపులను రద్దు కూడా చేయలేదు.

నిబంధనలు ఏం చెప్తున్నాయి?..


ఎవరికైనా ప్రభుత్వం పట్టా ఇస్తే దానిని 30 రోజుల్లో పోడీ (క్షేత్రస్థాయిలో పొజీజిషన్‌కు వెళ్లి... రికార్డుల్లో తమ పేరిట పేరు మార్పించుకోవాలి) చేయించుకోవాలి. లేనట్లయితే ప్రభుత్వం తిరిగి దానిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. సదరు స్వాతంత్య్ర సమరయోధుడికి కేటాయించినట్లుగా ఉన్న పట్టా 21.11.1961లో జారీ చేసినట్లుగా ఉంది. అంటే సుమారు 52 ఏండ్లు గడిచింది. ఇప్పటిదాకా పత్తాలేని వారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చారన్న అనుమానం అధికారులకు రావాలి. మరోవైపు ఆ వారసుల వద్ద ఆ పట్టా మినహా ఇతర ఆధారాలేవీ లేవు.

అసలు ఆ పట్టా సరైనదా? కాదా? అని సరిపోల్చుకోవడం అధికారుల బాధ్యత. అదీ జరగలేదు. ఎందుకని అంటే గతంలో ఐడీపీఎల్‌లో ఉన్న ఎమ్మార్వో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులన్నీ తగలబడ్డాయని సమర్థింపు. నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉన్న అధికారులు, అది పట్టించుకోకుండా అర శతాబ్దం తర్వాత వస్తే గుడ్డిగా మ్యుటేషన్ చేసి, రోజుల వ్యవధిలోనే రికార్డుల్లోనూ పేర్లు మార్చేశారు. ఈ మ్యుటేషన్ ప్రక్రియ జరిగిన కొన్నిరోజులకే ఆ తహసీల్దార్ పదవీ విరమణ చేశారు.

గుట్టు రట్టయినా మడత పేచీలు..


మ్యుటేషన్ ప్రక్రియ ముగిసీ ముగియగానే ఎంజీ కన్‌స్ట్రక్షన్స్ పేరిట కొందరు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో స్థానిక న్యాయవాదులు అడ్డుకొని, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఒక ఐపీఎస్ అధికారి తమ్ముడినని చెప్పుకున్న అతడిని మాత్రం వదిలేశారు.

వ్యవహారం కేసుల దాకా వెళ్లడంతో రెవెన్యూ అధికారులు తిరిగి విచారణ నిర్వహించారు. 2013లో బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ అక్రమ మ్యుటేషన్‌ను రద్దు చేయాలంటూ కలెక్టర్‌కు నివేదిక వెళ్లింది. కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ మ్యుటేషన్ రద్దు చేస్తూనే మరోసారి సదరు స్వాతంత్య్ర సమరయోధుడి వారసుల దరఖాస్తులను పరిశీలించాలని మడతపేచీ పెట్టారు. దాదాపు ఏడాది కాలంగా ఆ దరఖాస్తు పరిశీలన పేరిట ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈనెల 18న కూడా మరోసారి విచారణ తేదీని ఖరారు చేశారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమాంధ్రుల ఒత్తిళ్లు ఇంకా ఎలా పని చేస్తున్నాయో అర్థమవుతుంది. అయితే తమ కోర్టుకు కేటాయించిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోమంటూ కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ పట్టుదలగా ఉంది. న్యాయశాఖ కూడా స్పందించి ఈ భూమిలో తొమ్మిదో మెట్రోపాలిటన్ న్యాయస్థాన భవన నిర్మాణ పనులకు పూనుకోవాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి