గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 07, 2014

కుత్సిత బాబు...చేసె...కుట్రల్!

-తెలంగాణ రాష్ట్ర సర్కారుపై బస్సుబుస్సులు
-బురదజల్లండి.. అప్రతిష్ఠపాల్జేయండి..
-ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌లే టార్గెట్..
-విమర్శలు తీవ్రతరం చేయండి..
-టీడీపీ టీ నేతలను ఎగదోస్తున్న చంద్రబాబు?
-మండిపడుతున్న తెలంగాణవాదులు
రిజర్వ్‌బ్యాంకు కాదన్నా.. రైతుల రుణమాఫీకింద తొలివిడత రూ.4250 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం! ఏపీలో రుణమాఫీ ఊసేలేదు! దళితులకు మూడెకరాలు పంచుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం! మరి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది? పెన్షన్ సొమ్మును గణనీయంగా పెంచి గౌరవంగా అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం! ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచనే చేయలేదు!! మినరల్‌వాటర్ పేరుతో నీటి దందాకు ఏపీలో తలుపులు తెరిస్తే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మహత్తరమైన వాటర్‌గ్రిడ్ పథకానికి తెలంగాణలో రూపకల్పన జరిగింది! ఎవరూ అడగకున్నా దళిత, గిరిజన ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకాన్ని, మైనార్టీ యువతులకు షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు! 
cbఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.480 కోట్లు, ఎర్రజొన్న రైతుల బకాయిల కింద రూ.11 కోట్లు విడుదల చేశారు! ఆటోవాలాలకు పన్ను రద్దు చేయడమే కాకుండా.. బకాయిలనూ మాఫీ చేశారు! ఇలా చెప్పుకొంటూపోతే ఏపీ ప్రభుత్వంకన్నా.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో దూకుడు ప్రదర్శిస్తున్నది! ఇలాంటి కార్యక్రమాలను యావత్ తెలంగాణ హర్షిస్తుంటే.. ఒకరు మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు! ప్రజాప్రభుత్వ పనితీరుతో గుండెలు బాదుకుంటున్నారు! ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు! ఇదీ సమస్త తెలంగాణవాదుల అభిప్రాయం! మరి.. తెలంగాణలో ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతుంటే ఆయనేంచేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైకి టీ టీడీపీ నేతలను ఎగదోస్తున్నారు!!


ఓవైపు నానాటికీ టీఆర్‌ఎస్ సర్కారుకు పెరుగుతున్న ప్రజామద్దతు! మరోవైపు రోజురోజుకూ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి సాగుతున్న వలసలు! ఈ నేపథ్యంలో తెలంగాణలో కనీసం పార్టీ ఉనికినైనా కాపాడుకునే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిమగ్నమైనట్లు కనిపిస్తున్నది.అందుకే తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటమంటూ ఆరాటపడుతున్నారు! తన పార్టీ తెలంగాణ నేతలను టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైకి ఎగదోస్తున్నారు! అధినేత ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు అంటూ రాద్ధాంతం చేసేందుకు బస్సెక్కడానికి టీ టీడీపీ నేతలు ఆయాసపడుతున్నారు! తమ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వాస్తవాన్ని విస్మరించి.. ఆత్మహత్యల్లో రాష్ర్టాన్ని రెండోస్థానంలో నిలిపిన ఘనతకు ముసుగేసి ఇప్పుడు రభస చేయడానికి రంకెలేస్తున్నారు!

తెలంగాణ కరెంటు కష్టాలకు పునాదులేసింది తమ ప్రభుత్వ హయాంలోనేనన్న నిజాన్ని మర్చిపోయి.. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు! పన్నాగం ఒక్కటే.. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసి.. రాజకీయ లబ్ధి పొందటం! ఎత్తుగడ ఒక్కటే.. తెలంగాణలో శూన్యమైపోతున్న తన రాజకీయ బలాన్ని కాపాడుకోవటం!! అందుకు ఏకైక మార్గం.. లేనిసమస్యలపై రాద్ధాంతం చేయటం. తన ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడిందన్న దుగ్ధ.. తెలంగాణలో తన పార్టీకి స్థానం లేకుండా పోయిందన్న కడుపు మంట.. తన పార్టీనుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలస వెళుతున్నారన్న బాధ!

తనను సవాలు చేసిననాయకుడు తెలంగాణ సాధించడమేకాకుండా.. కొత్త రాష్ర్టానికి సీఎం అయ్యాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేనితనం! వెరసి.. తెలంగాణపై తన కరడుగట్టిన వ్యతిరేకతను కొనసాగించేయత్నం! అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేయాలన్న దుష్టతలంపు! టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన తైనాతీలను ఎగదోస్తున్న చంద్రబాబు కుతంత్రాల వెనుక ఉద్దేశాలపై తెలంగాణవాదుల అనుమానాలివి!

సోమవారం ఉదయం సెక్రటేరియట్‌లో తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు చేసిన ఉద్బోధ ఈ దిశగానే సాగిందని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీనుంచి వలసలను నిరోధించాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలి. ఇందుకోసం మెట్రోరైల్, మై హోమ్ అధినేత రామేశ్వరరావు భూమి వ్యవహారం, రుణమాఫీ, విద్యుత్, తాగునీరు, ఉద్యోగాలు తదితర సమస్యలపై గొడవ చేయండి. వీటిల్లో న్యాయాన్యాయాలు విశ్లేషించాల్సిన పనిలేదు అని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

చంద్రబాబు ఆదేశాలను అందుకున్న టీ టీడీపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ జిల్లాలో ఈ నెల 10 నుంచి బస్సుయాత్ర చేయాలని నిర్ణయించారు. 10న నల్లగొండ, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ప్రధానంగా విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు అంశాలపై రగడ చేస్తూనే, వాటికి చిలువలు పలువలు జోడించి.. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లాలనేది టీడీపీ తెలంగాణ నేతల పన్నాగంగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. నిజానికి చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ర్టానిది దేశంలో రెండోస్థానం. 1993నుంచి 2013 వరకు 25,393 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు తనువు చాలిస్తే.. తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నాడు తెలుగుదేశం-బీజేపీ నాయకులు రైతులను నిందించారని పలువురు గుర్తుచేస్తున్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కేవలం గుప్పెడు మందికే గత ప్రభుత్వాలు పరిహారం చెల్లించాయి. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టని చంద్రబాబు ఇవాళ రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరో కీలక అంశమైన విద్యుత్ విషయంలోనూ వేళ్లన్నీ చంద్రబాబునే చూపిస్తున్నాయి. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు చెలరేగి విమర్శలు చేయడంలో చంద్రబాబుది ఘనమైన చరిత్రని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. సీలేరు, కృష్ణపట్నంలతోపాటు వివిధ ప్రైవేటు విద్యుత్ కంపెనీల నుంచి తెలంగాణకు రావలసిన విద్యుత్‌ను రాకుండా చేస్తున్నది చంద్రబాబునాయుడేనని ఆరోపిస్తున్నారు. పీపీఏలను రద్దు చేసి ఆ కంపెనీలను కట్టడి చేస్తున్నది చంద్రబాబునాయుడేనని చెప్తున్నారు.

తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టని పాపంలో చంద్రబాబుకు కూడా వాటా ఉందని విద్యుత్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పదేండ్ల్లు రాష్ర్టాన్ని పాలించిన చంద్రబాబు తెలంగాణలో ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కూడా అదనంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించలేదన్నది వాస్తవమని స్పష్టంచేస్తున్నారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాల్జేసే ఏకైక లక్ష్యంతో సాగుతున్న తెలంగాణ టీడీపీ నేతలు వీటిని ఉద్దేశపూర్వకంగానే మరుగునపడేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఖరుకు టీడీపీ నేతల్లోనే బస్సు యాత్ర పట్ల వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించలేదు. మా నాయకుడు కూడా ఏపీలో ఏ సమస్యనూ పరిష్కరించలేకపోయారన్నది వాస్తవం అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. తాము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకపక్షంగా విమర్శించినా ప్రజలు స్వీకరించే స్థితి అయినా ఉండాలని అన్నారు.

ఆ మాటకొస్తే తెలంగాణలో విద్యుత్ కష్టాలకు చంద్రబాబునాయుడే కారణమని ప్రజలు నమ్ముతున్నారని, ప్రజల దృష్టిలో టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అనే ముద్ర పడిందని మరో నేత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌లోటుతో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీఏలను రద్దు చేసి, తెలంగాణలో విద్యుత్ సంక్షోభం సృష్టించారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మేం ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఒక నాయకుడు అంగీకరించారు.

పైగా తెలంగాణ రాష్ర్టానికి చేయాల్సినంత నష్టంచేసిన తమ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయిస్తున్నారని అన్నారు. తాము పార్టీ పాలసీ పేరుతో విమర్శల దాడి మొదలుపెడితే.. పరిస్థితి తమకే ఎదురు తిరిగేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల రుణమాఫీ అంశంలో తొలి విడతగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4250 కోట్లు బ్యాంకులకు విడుదల చేసిందని పేర్కొన్న ఒక నేత.. ఈ విషయంలో ఏపీలో తమ ప్రభుత్వం చేసింది శూన్యమని చెప్పారు. ఈ వాస్తవాన్ని ఎవరైనా యాత్ర సందర్భంగా ప్రశ్నిస్తే తామేం సమాధానం చెప్పాలన్న సంశయం టీడీపీ టీ నేతల్లో కనిపిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఏపీలో అభాసుపాలవుతున్న బాబు.. వాటినుంచి విమర్శకుల దృష్టి మళ్లించేందుకే తెలంగాణ ప్రభుత్వంపై రాళ్లేయిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి.

ప్రభుత్వపరంగా విమర్శలు చేయడం వరకైతే ఏదో విధంగా చేస్తామని, కానీ.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే టార్గెట్‌గా విమర్శలు చేయాలని, రాష్ట్రమంతా తిరిగి విష ప్రచారం చేయాలని ఆదేశించారని ఒక సీనియర్ నేత తెలిపారు. ఈ సందేహాలెలా ఉన్నా.. టీఆర్‌ఎస్‌పై విషంగక్కేందుకు టీడీపీ నేతలు బస్సెక్కుతున్నారు!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి