గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 04, 2014

మన బతుకమ్మతల్లి వృత్తాంతాలు...

బతుకమ్మ దేవత గురించి, బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

లక్ష్మీదేవే బతుకమ్మ: చోళరాజు దంపతులైన ధర్మాంగదుడు, సత్యవతిలకు నూరుమంది కొడుకులు. అయితే, వాళ్లందరూ యుద్ధంలో చనిపోతారు. దుఃఖంలో ఉన్న ఆ దంపతులు మళ్లీ సంతానం కావాలని లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తరు. వారి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలి? అని అడుగగా ఆమెను తమ బిడ్డగా పుట్టమని కోరుకుంటరు. తథాస్తు అని వారి బిడ్డగా పుడుతుంది. ఆ సమయానికి అత్రి, వశిష్ట మహామునులు వచ్చి ఆ బిడ్డను బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు. అట్లా, లక్ష్మీదేవే బతుకమ్మగా పెరిగి, పెద్దదయి చక్రాంకుడనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుంది. కోరిన వారందరికీ సంతానం, సిరి సంపదలను ప్రసాదిస్తూ, అనేక వేల ఏండ్లుగా లక్ష్మీదేవే బతుకమ్మగా పూజలందుకుంటోందని ఒక కథ ప్రచారంలో ఉంది.

Cover

బతుకుమని కోరుకోగా బతికిన బతుకమ్మ: మరొక కథలో మహిషాసురునితో యుద్ధం చేసి, అతణ్ణి చంపి అలసిపోయిన పార్వతీ దేవి స్పృహ కోల్పోతుంది. ఆమె ప్రాణాలను కోల్పోతుందేమోనని స్త్రీలందరూ దేవిని చుట్టుముట్టి బతుకమ్మ...బతుకమ్మ అని ప్రార్థిస్తూ ఉంటరు. కాగా శుద్ధ పాడ్యమి నాడు స్పృహ కోల్పోయిన దేవి దశమి రోజున స్పృహలోకి వస్తుంది. నాటి నుంచే దేవిని బతుకమ్మగా తొమ్మిది రోజులు పాటల్లో కీర్తిస్తూ పండగ జరుపుకుంటున్నట్లు ఒక కథ ప్రచారంలో ఉంది.

తంగేడు పూవే ఆ చెల్లెలు: బతుకమ్మను పేర్చడంలో తంగేడుపూలను వాడటానికి గల కారణాన్ని బట్టి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వెనుకట ఒక చెల్లెలు అన్న ఇంటికి వస్తుంది.ఆమె రావడానికి ముందే పనిమీద వేరే ఊరికి వెళ్తాడు అన్న. చెల్లెలు అన్న వచ్చేవరకు ఉందామనుకుంటుంది. తెల్లవారి వదినతో కలసి చెరువుకు స్నానానికి వెళుతుంది. అనుకోకుండా చెరువు ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోతాయి. ఒకరి చీరను ఒకరు కట్టుకుంటారు.

దాంతో ఇది నాదంటే ఇది నాదని ఇద్దరి మధ్యా మాటా మాటా పెరుగుతుంది. వదిన కోపంతో మరదల్ని చెరువులోకి తోసేసి వెళ్లిపోతుంది. అదే రాత్రి చెల్లెలు తన భర్త కలలో కనిపించి వదిన తనను చెరువులో పడేసిందని చెబుతుంది. భర్త చెరువు వద్దకు రాగా అక్కడ పచ్చని పూలతో తంగేడు చెట్టు కనిపిస్తుంది. దాని దగ్గరకు వెళ్లగానే పాపకారి వదిన నన్ను నీళ్లలో నూకేసింది. చెట్టయి మొలిచాను. తంగేడు పూలై పూచాను అంటూ ప్రతి సంవత్సరం తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి చెరువులో వేయమని కోరుతుంది. భర్త అదే విధంగా చేస్తాడు. ఆనాటి నుంచి తంగేడు పూలతో బతుకమ్మను పేర్చడం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు చెబుతారు.

bathukammam-baby

అనాహత చక్రోపాసనే బతుకమ్మ: కుండలి చక్రోపాసనమే సామాన్య స్త్రీలకు బతుకమ్మ ఆరాధనగా మారి ఉండవచ్చనే అభిప్రాయమూ ఉంది. కుండలిని ఏడు చక్రాల సమ్మేళనం అని, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారం-ఒకొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవతను ప్రతిష్ఠించి వారికి ఒక్కొక్క పండగను ఏర్పరిచారు.

అవి వినాయక చవితి, దుర్గాష్టమి, విజయదశమి, నాగుల చవితి, దీపావళి, సంక్రాంతి, రథ సప్తమి. ఈ పండగలన్నీ కుండలిని చక్రాలకు సంబంధించిన పండగులే. కుండలిని చక్రాల్లో నాలుగవదైన అనాహత చక్రానికి శక్తి దేవత అయిన దుర్గాదేవి అధిష్టాన దేవత. నవ రాత్రుల్లో విజయదశమికి దుర్గాదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, అనాహత చక్రోపాసన, శక్తి ఆరాధననే బతుకమ్మ పండగగా రూపాంతరం చెంది వుండవచ్చని ఒక అభిప్రాయం. గౌరీదేవిని బతుకమ్మలో నిలిపి ఆమెను పూజించడం చక్రోపాసనలోని అంతరార్థంతో సరిపోతుంది కూడా.

beera-srinivas

బతుకనివ్వమని వేడుకోగా బతికిన వైనం: బతుకమ్మ ఆరాధనకు మరొక కథను కూడా చెబుతుంటరు. వెనుకట ఎప్పుడో వర్షాలు లేక దుర్భిక్షమేర్పడి భరించరాని కరువు వచ్చిందని, తిండి లేక వేలమంది చనిపోయారని, చనిపోగా మిగిలిన వారు తమనైనా బతకనివ్వమని బతుకమ్మ దేవతను ప్రతిష్టించి వేడుకున్నారని అంటారు. ఆ దేవత దయతోనే వారందరూ బతికారని, వర్షాలు కురిసి పంటలు పండాయని, అప్పటినుంచే బతుకమ్మ దేవతను పూజించి పండగ చేసుకునే సంప్రదాయం వచ్చిందనీ అంటారు.

కాకతీయుల కాలం నుంచే బతుకమ్మ: ఎన్ని కథలు, అభిప్రాయాలూ ఎలా ఉన్నా బతుకమ్మ పండగను జరుపుకునే సంప్రదాయం ఎప్పటినుంచి వస్తున్నదనే ప్రశ్నకు చారిత్రకంగా సరైన సమాధానం లేదు. ఆరుద్ర మాత్రం కాకతీయుల యుగంలో రెడ్డి రాజుల కాలంలో బతుకమ్మ పండగను చేసుకునే వారని తెలిపారు. అంటే కాకతీయ యుగం కంటే ముందే బతుకమ్మ పండగను జరుపుకునే సంప్రదాయం ఉందని ఊహించవచ్చు.
- డా॥ రావి ప్రేమలత

తామర పువ్వే బతుకమ్మ: పూర్వం యోధానుయోధులైన ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వాళ్లకు ఒక్కతే చెల్లెలు. ఆమెకు ఏడుగురు అన్నలైతే ఏడుగురు వదినెలు. చెల్లెలంటే అన్నలందరికీ పంచప్రాణాలు. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతున్నరు. ఆ అమ్మాయిని అన్నలెంత ప్రేమతో చూస్తారో వదినెలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. వాళ్లు చాలా కష్టాలు పెట్టేవారు. చెల్లెలు పడుతున్న బాధ అన్నలకు తెలియదు. చెల్లె కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు. అయితే, ఒకసారి అన్నలంతా వేటకు పోయారు. చాలా రోజుల వరకూ తిరిగి రాలేదు. అన్నలు లేంది చూసి వదినెలు ఆమెను యమబాధలు పెట్టారు. ఇంటి పనులన్నీ, బయటి పనులన్నీ చెప్పడమే గాక ఎప్పుడూ వాళ్లకు లొంగి ఉండాలని భయపెట్టారు. ఈ బాధలన్నీ పడలేక ఆ చెల్లెలు ఒంటరిగా ఎంతో ఏడ్చింది. బతుకు మీద విసుగుపుట్టి ఎక్కడికో వెళ్లిపోతుంది. వేటకు పోయిన అన్నలు తిరిగి వస్తారు.

చెల్లెలికోసం తిండి తిప్పలు మాని ఊర్లన్నీ వెతుకుతారు. చేలు, శెలకలు, గుట్టలు, వాగులు, వంకలు, అడవంతా గాలిస్తారు. చెల్లె జాడ చిక్కదు. అన్నలందరూ బక్క చిక్కి సావుకు దగ్గరై ఒక ఊరివద్ద ఆగుతారు. ఆ ఊరి పెద్ద బాయి దగ్గరకు పోయి నీళ్లు తాగుదామని చూస్తరు. చూడగా పెద్ద తామర పువ్వు కనబడుతుంది. అది అన్నల జూసి ఒడ్డుకొస్తుంది. ఎప్పుడూ లేంది తామర పువ్వు బాయిలెట్ల పూసింది? మమ్ముల జూసి ఎందుకు కదిలింది? అనుకుంటరు వాళ్లు. పట్టుకోబోతే ఆ పువ్వు దూరం జరుగుతుంది. ఇది మన చెల్లె గావచ్చు. ఈ బాయిలపడి ఇట్ల పువ్వులెక్క మొలిచింది. మన మీద అలిగి దూరం పోతుంది అనుకుని అందరూ నీళ్లు కూడా తాగకుండ ఫికరు జేస్త బాయి గట్టున కూసుంటరు.

అప్పుడే అటుదిక్కు ఆ రాజ్యమేలే రాజు వచ్చి నీళ్లు తాగుదామని మెట్ల పొంటి బాయిల దిగుతడు. ఆయనను చూసి ఆ తామర పువ్వు దగ్గరి కొస్తది. రాజు దాన్ని చేతుల్ల దీసుకుంటడు. దాన్ని తీస్కొని తన రాజభవనాన్ని ఆనుకుని ఉన్న కొలనుల వేస్తడు. తామరపువ్వు అప్పుడు అక్కడున్న మిగతా పువ్వులతో మాట్లాడుతది. తనను తీస్కపోను దేవుడొస్తడని, తానొక అవతారమని చెప్తది. కొలను సుట్టూత తంగేడుపూల చెట్లు మొలుస్తయి. కొంతకాలానికి దేవలోకం నుంచి విష్ణుమూర్తి వస్తడు. తామెర పువ్వును మనిషిగ చేస్తడు. ఆమెనే లక్ష్మీదేవి.

ఇట్ల ఆ పువ్వుకు బతుకుదెర్వు చూపనందుకు ఆమెకు బతుకమ్మ అని పేరు పెడ్తరు. ఆ బతుకమ్మే లక్ష్మీదేవి. లక్ష్మీదేవే గౌరమ్మ. ఆమెను రాజు కొలువులోనే పెండ్లి చేసుకుని దేవలోకం తోల్కపోతడు. జానపదులు ఈ కథను యాజ్జేసుకుంటూ, ప్రతి యేడు దసరా పండగకు ముందు తొమ్మిది రోజులు తంగేడు పువ్వులతోటి బతుకమ్మను పేర్చి ఆడుకుంట, పాడుకుంట పూజలు చేస్తరు. ఇదీ జనంలో ప్రచారంలో ఒక కథ.
-భూపాల్

దళితులకు బతుకమ్మ దూరమెందుకాయెనో చెప్పే వృత్తాంతం:

మెజారిటీ దళిత మహిళలకు ఈ పండగ దూరం కావడానికి గల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ కథను రచయిత్రి జూపాక సుభద్ర ఇలా వివరించారు.... 
ఎన్నడో ఎనుకటనట ఎక్కువ తక్కువ అనకుంట అందరి కందరు ఆడోల్లు పండగప్పుడు సెరువు కాడికి బతుకమ్మ వట్టుకునిపోయి ఆడేదట. నిన్నమొన్నటి దాన్క గూడ దళిత మహిళలు బత్కమ్మ ఆడకపోయెటోల్లు. మా ముసలవ్వ యెర్కల గూడ ఆడలేదట. ఓ గంతకన్న యెనుకట జరిగిందని సెప్తరు.

మనగూడెమాడామె ఒకామె పొద్దంత పంజేసి పానం పుల్లసీలచ్చిందట. వచ్చే దార్లనే వాగుంటే ఆ వాగుల పెయిగడుక్కొనచ్చిందట. పొద్దంగిందని దబదబ యింటిసుట్ట దొరికిన కొన్ని పూలను ఏర్కచ్చిందట. సైదానికి కొత్త సిబ్బి గూడ దొర్కక, బువ్వ ఆరబెట్టి గంజంచి సూర్లసెక్కిన సిబ్బిని దీసిందట. యేర్కచ్చిన పూలను దబదబ సిబ్బిల పేర్చుకున్నదట. యింట్ల కుండలు, ముంతలన్ని యెంకులాడినా ఒక్క పెసరు, శెనిగె, జొన్న గింజ దొర్కలేదట. "గీ యిల్లు పాడువడ, యిల్లంత బోర్లిచ్చినా వొక్కిత్తు రాలకపాయె. ఏం జేతు, పండగాయె, పలారం బంచి పెట్టకుంటెట్ల, బతుకమ్మ సాపిత్తది...ఓ దిక్కు సీకటైతంది" అని బాగా తండ్లాడిందట. యింతల దండెమ్మీద తునకలు ఆత్మబంధువోలే అగుపడ్డయట. "యిదువరకెవ్వలు తునుకలు పంచి పెట్టలె...తినేదే గద పంచిపెడ్తేమైతది. గిదేమన్న తినగూడని యిసమా...తునకలు దినని దేవుల్లెవలున్నరు, దేవన్న దేవతలకాంచి అందరు తిన్నోల్లేనాయే" అని మనసును సమజ్జేసుకుని, దొబ్బతునక తీస్కపోతే మనిషంత తుకుడలు జేసి పెట్టవచ్చు అనుకోని దండెమ్మీద ఆరేసున్న దొబ్బను పోయిలేసి కాల్చింది. మంచి సీటి సీర,  రైక కట్టుకోని, నెత్తికి సమర్రాసుకొని నున్నగా దువ్వుకున్నది. దబ దబ పొయికాడికి బోయి కాలిన దొబ్బను దీసి, బూడిది దులిపి, బత్కమ్మ మీద పెట్టుకుని సెరువు కాడికి పయినమైందట.

తొవ్వల కాకులు గద్దలు పసిగట్టి ఆ బతుకమ్మతోనే నసబెట్టుకుంట పోయినయి. యీమె సెరువుకాడికి కొంచెమైతే సేరిపోవు. గీ దొంగ గద్దలూకుంటయా...మందిల పడితె అంకదనుకున్నయో ఏమో...ఓ మోర్దోపు గద్ద బతుకమ్మ మీని దొబ్బను లటుక్కున కోడిపిల్లనందుకున్నట్టందుకొని యెత్కపోయిందట. అజ్జూసి వూరోల్లంత  "సీ...సీ...ఆ పూల బతుకమ్మ మీన దొబ్బవెడ్తివి గదనే. గాయింతది గద్దెత్కపాయె, యెంత పంజేత్తివే. గద్ద దొబ్బతోని నీ బతుకమ్మనే యెత్కపోయింది పోయే... మీ గూడెపోల్లెవలూ యికనుంచి బతుకమ్మాడద్దు, మీకు బతుకమ్మనే లేదు" అని కట్టడి జేసిండ్రట. మన గూడెపోళ్లు ఎంత కొట్టుకున్నా మొత్తుకున్నా యిన్లేదట వూరోల్లు. యిగ గా కాన్నించి గూడెం ఆడోళ్ల సేతులకెల్లి యెల్లిపోయింది బతుకమ్మ. 
-జూపాక సుభద్ర

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి