గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 01, 2014

తెలంగాణ నిధులు.. ఏపీ ఖాతాలో..?!

-రూ. 458 కోట్లు తిరిగి రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం
-కేంద్ర నిధులూ సత్వరమే వచ్చేలా చర్యలు
nidhiరాష్ట్ర విభజన అనంతరం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన కొన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లాయి. వాటిని వెంటనే తిరిగి రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల విభాగాధిపతులతో మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ సూచించారు. విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన కేంద్రం నిధులు రూ.600 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.142 కోట్లు తెలంగాణకు తిరిగి వచ్చాయి. 
మిగతా రూ.458 కోట్ల నిధులు కూడా వచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి, కేంద్రానికి లేఖలు రాయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకపోతే, కేంద్రం మరో విడత విడుదల చేసే నిధులలో తెలంగాణకు సర్దుబాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ఇక మీదట ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఏపీ సీఎస్ కృష్ణారావుతో బుధవారం జరిగే భేటీలో ఈ అంశంపై కూడా సీఎస్ రాజీవ్‌శర్మ చర్చించే అవకాశం ఉంది.

కేంద్ర నిధులు రాబట్టేందుకు చర్యలు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని విభాగాధిపతుల సమీక్ష సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ సూచించారు. వివిధ పథకాల అమలు కోసం మొత్తం రూ. 17 వేల కోట్లు కేటాయించాలని 14వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రం అన్ని రాష్ర్టాలకు కలిపి రూ. 3 లక్షల 33 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వాటా 2.8 శాతం. ఆ లెక్కన మొత్తం నిధులు పది వేల కోట్లకు మించదు. వీటిలో ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణకు రూ.3,300 కోట్ల నిధులు వచ్చాయి. రూ.6,700 కోట్లు ఇంకా రావాల్సి ఉంది.

ఏయే విభాగాలలో అయితే నిధులు రావాల్సి ఉందో ఆయా శాఖల ఉన్నతాధికారులు వెంటనే లేఖలు రాసి వాటిని రాబట్టాలని సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఇక 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులలోనూ తెలంగాణ రాష్ర్టానికి సుమారు రూ.3,700 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీరాజ్ విభాగానికి రూ.1000 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.750 కోట్లు అందాల్సి ఉంది. మిగతావి వివిధ శాఖలవి ఉన్నాయి. వాటిని కూడా వెంటనే కేంద్రం విడుదల చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

బ్యాంకులకు ప్రభుత్వం హామీ పత్రాలు
రైతుల రుణాల మాఫీ కోసం ఇప్పటికే 25 శాతం నిధులను విడుదల చేయగా.. మిగతా మొత్తానికి రైతుల తరఫున ప్రభుత్వమే బ్యాంకులకు హామీ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రుణాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే రైతుల తరఫున బ్యాంకులకు పూచీకత్తుగా వ్యవహరించనుంది. ఒకవేళ బ్యాంకులు రైతులను పాత రుణాలు చెల్లించాలనిగానీ... కొత్త రుణాలు ఇవ్వడానికిగానీ ఇబ్బందులు పెడితే మండల, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులకు రైతులకు సూచించారు.

నేడు ఇరు రాష్ర్టాల సీఎస్‌ల భేటీ
రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఉద్యోగుల కేటాయింపు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు బుధవారం రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావుల నేతృత్వంలో జరగుతున్న కీలక సమావేశం ఇది. ఉద్యోగుల విభజన, సంస్థలు, కార్యాలయాల రీ ఆర్గరైజేషన్‌లాంటి కీలకమైన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం రెండు రాష్ర్టాలకు చెందిన అన్ని శాఖల హెచ్‌వోడీలను హాజరు కావాల్సిందిగా సీఎస్‌లు ఆదేశించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల విభజనపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న కొన్ని సందేహాలు, పరిపాలనపరమైన సమస్యలను కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి