(నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి)
నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి. ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం నేటి అవసరం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించడం, పాఠ్యాంశాలలో ఆయన జీవిత చరిత్రను చేర్చడం అభినందనీయం. ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను మలుపు తిప్పిన పీవీ భారత చరిత్రలో ఒక మైలురాయి. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి రాష్ర్ట మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా చేసిన కృషి చరిత్రాత్మకమైనది. బహుభాషా కోవిదుడైన పీవీ సాహిత్యాన్ని ఎక్కువగా చదివేవారు.
1946-50 మధ్య కాకతీయ పత్రిక నిర్వహణలో తలమునకలై తన సృజనాత్మకతకు, జర్నలిజానికి మెరుగులుదిద్దుకున్నారు. అనేక కథలు, వ్యాసాలు కలం పేర్లతో రాశారు. విశ్వనాథ సత్యనారాయ ణ వేయిపడగలు నవలను సహస్ర ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. తన జీవితాన్ని రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ఇన్‌సైడర్ (లోపలి మని షి) పేరుతో ప్రచురించి సంచలనం సృష్టించారు.
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 1921 జూన్28న జన్మించారు. పీవీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు యూనివర్సిటీ నుంచి వెళ్ల గొట్టారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చేర్చుకొమ్మని కోరితే నిరాకరించిన ఘన త సీమాంధ్రులది. దాంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పీవీ మం త్రిగా, ముఖ్యమంత్రిగా విద్యా, ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.
శ్రీకాకుళ నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన భూ పంపిణీ గురించి లోతుగా ఆలోచించి భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చారు. సీలింగ్ వల్ల భూములు కోల్పోతున్న సీమాంధ్ర పెత్తందార్లు, భూ స్వాములు కలిసి జై ఆంధ్ర ఉద్యమం 1972లో ప్రారంభించి ముఖ్యమంత్రి పదవి నుంచి పీవీ దిగేదాకా విశ్రమించలేదు. ఆ తరువాత గవర్న ర్ పరిపాలన ప్రకటించబడింది. తరువాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. పీవీ ఇందిరాగాంధీ నాయకత్వంలో అనేక పదవులు చేపట్టి తనను తాను నిరూపించుకున్నారు. అనేక సభల్లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రసంగాలకు అనువాదకులుగా వ్యవహరించారు.
పీవీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నప్పుడు పేద, గ్రామీణ విద్యార్థుల కోసం.. పట్టణ, నగర, ప్రైవేట్ విద్యారంగం కన్న ఉన్నతంగా విద్యావకాశం కల్పించాలని జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. త్రి భాషా సూత్రాన్ని అనుసరించి ఉత్తర భారత దేశంలోని అనేక నవోదయ పాఠశాలలో తెలుగును పాఠ్యాంశంగా నేటికీ చదువుతున్నారంటే, తెలుగు పండిట్‌లు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పనిచేస్తున్నారంటే అదంతా పీవీ ముందుచూపు వల్లనే సాధ్యపడింది. రాజీవ్ గాంధీ అకాల మరణం తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోయింది.
మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీవీ బయటి నుంచి ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకానికి, అలా ఎన్డీఏ, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశారు. ఆర్థిక సంస్కరణల పితామహుడుగా నిలిచిపోయారు. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు కేంద్ర సర్వీసులలో 27 శాతం రిజర్వేషన్లను అమలు జరిపి చరితార్థులయ్యారు.
పీవీ 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా 10వ ప్రధాన మంత్రిగా పనిచేశారు. పీవీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయింది. ఇతర దేశాల్లో బంగారం కుదువ పెట్టుకొని వెళ్లదీసి న కాలమది. అలాంటి దశలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ దృక్పథంతో ముందుకు సాగారు పీవీ. ఆ సందర్భంగా వామపక్షాలు, ఇతర విపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోశాయి. దేశాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని విమర్శించారు.
కానీ రాజీవ్ గాంధీతో ప్రారంభమైన ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, టెలిఫోన్, టీవీ, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసింది. ఆ క్రమాన్ని మరొక మలుపులోకి పీవీ తీసుకువెళ్లారు. ఆర్థిక సంస్కరణల కోసం అప్పటికే అర్థికశాస్త్రవేత్తగా సుప్రసిద్ధులైన మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖ మం త్రిగా నియమించి సంస్కరణలను వేగవంతం చేశారు. పీవీ దూరదృష్టి ఎంత గొప్పదో నేడు అందరికీ తెలిసి వస్తున్నది. దక్షిణాది నుంచి తొలిసారిగా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన పీవీ భారత చరిత్రలో మహోన్నతమైన అధ్యాయాన్ని సృష్టించారు. అరుదైన నేతగా పేరుగాంచారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం గా నిలిచారు. తెలంగాణ మట్టినుంచి ఎదిగిన మహా నేతగా ఆయన చూపిన మార్గం మనందరికి ఆదర్శం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
yes he is a great man
ధన్యవాదాలండీ వేణుమాధవ్‍గారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి