గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 21, 2015

బాస్.. చంద్రబాబే...!!!

-నన్ను మొదట కలిసింది మత్తయ్య..
- ఆయనను పంపించింది రేవంత్‌రెడ్డి
- రేవంత్‌ను పంపింది చంద్రబాబు
- టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే ఐదు కోట్లు ఇస్తామన్నారు
- బాబు మాట్లాడి డీల్ కన్ఫర్మ్ చేస్తారని రేవంత్ చెప్పాడు
- మావాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ.. ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన సూత్రధారి అని, డీల్‌ను ఆయనే కన్ఫర్మ్ చేశారని, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ కుండబద్దలు కొట్టారు. ఈ డీల్‌లో బాస్ చంద్రబాబేనని ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి పంపితే వచ్చానని మత్తయ్య జెరూసలెం అనే వ్యక్తి.. చంద్రబాబు పంపితే వచ్చినట్లు సెబాస్టియన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటే రెండు కోట్లు ఇస్తామని చెప్పారని, అదే టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఏసీబీకి వివరించారు. ఈ విషయాలను తాను వెంటనే ఏసీబీ డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, వారు తన ఇంట్లో ఆడియో, వీడియో రికార్డర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. 


stephen

తనతో చంద్రబాబు కూడా మాట్లాడారని, డీల్ గురించి తమ పార్టీ వాళ్లు చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారని, తాను ప్రతిపాదించిన మొత్తానికి అంగీకారం తెలిపారని స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఇచ్చా రు. ఈ మొత్తం వ్యవహారాలు ఆడియో, వీడియో రికార్డర్లలో రికార్డయ్యాయని చెప్పారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ ఈ మేరకు బుధవారం (17-6-2015) ఇచ్చిన వాంగ్మూలం కాపీని నమస్తే తెలంగాణ సంపాదించింది. తాను స్వచ్ఛందంగా, పూర్తి సమ్మతితో ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నానని స్టీఫెన్‌సన్ పేర్కొన్నారు. తనపై ఎవరి ఒత్తిడులూ లేవని స్పష్టంచేశారు. స్టేట్‌మెంట్‌లో స్టీఫెన్‌సన్ ఏమన్నారంటే..


నేను ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా 2014, నవంబర్ 4 నుంచి ఉన్నాను. 28-5-2015న ఉదయం 9గంటల సమయంలో మత్తయ్య జెరూసలేం అనే వ్యక్తి నా ఫోన్‌ (9849014838) కు కాల్ చేశారు. బషీర్‌బాగ్‌లో 30-5-2015న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్రిస్టియన్ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. నేను నా వ్యక్తిగత కార్యక్రమాల్లో బిజీగాఉన్నానని, ఉదయం 11 గంటల తర్వాత ఏ విషయం చెప్తానని ఆయనకు తెలిపాను. 28-5-2015న ఉదయం 10గంటల సమయంలో మత్తయ్య జెరూసలెం సికింద్రాబాద్ బోయగూడలోని నా ఇంటికి వచ్చాడు. మిమ్మల్ని కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనను పంపించాడని తెలిపాడు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటే రూ.2కోట్లు ఇస్తానని మత్తయ్య జెరూసలెం ఆఫర్ చేశాడు. 


దేశం వదిలి వెళ్లేందుకు నాకు టికెట్ కూడా ఏర్పాటుచేస్తానని చెప్పాడు. నేను మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత ఆయన నా ఇంటినుంచి వెళ్లిపోయాడు. గంటన్నర తర్వాత ఆంటోనీ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని, అందుకే ఆయనను వెంట తీసుకొచ్చానని చెప్పాడు. ఆంటోనీ ఆయన స్నేహితుడిని హారీ సెబాస్టియన్‌గా నాకు పరిచయంచేశాడు. సెబాస్టియన్‌ను మా ఇంట్లో వదిలి ఆంటోనీ వెళ్లిపోయాడు. సెబాస్టియన్ నాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, తాను ఎర్రగడ్డలోని ఒక చర్చిలో మత ప్రబోధకుడినని తెలిపాడు. ఎమ్మెల్సీఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని, లేదా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని కోరేందుకు తనను చంద్రబాబు పంపించారని చెప్పాడు. ఓటింగ్‌కు దూరంగాఉంటే రూ.2కోట్లతోపాటు తీర్థయాత్ర నిమిత్తం జెరూసలెం వెళ్లేందుకు ఫ్యామిలీ టికెట్ ఇస్తామని చెప్పాడు.


టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేసినట్టయితే రూ.5 కోట్లు ఇస్తానని చెప్పాడు. దాంతో ఏ విషయం తర్వాత చెప్తానని ఆయనకు తెలిపాను. ఎన్నికల్లో ముడుపులు స్వీకరించకూడదని అనుకున్న నేను, డబ్బులు తీసుకొని ఓటు వేయడం చట్ట వ్యతిరేకం, అనైతికం అని భావించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ, ఏసీబీకి 28.5.2015ననే లేఖ రాశాను. 28.5.2015 సాయంత్రం 3గంటల సమయంలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌వద్ద ఉన్న ఏసీబీ కార్యాలయంలోని డీఎస్పీకి లేఖ అందజేశాను. తన ఫిర్యాదుపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవాలని డీఎస్పీగా ఉన్న అశోక్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశాను. హైదరాబాద్‌లోని కృష్ణా ఒబెరాయ్ హోటల్లో కలుసుకునేందుకు అనువైన సమయం చెప్పాలంటూ అదే రోజు సాయంత్రం 6గంటల సమయంలో మత్తయ్య జెరూసలెం నా మొబైల్(9849014838)కు ఒక ఎస్‌ఎంఎస్ పంపించాడు.


29.5.2015న నాకు అదే ఫోన్ నంబర్‌కు మరో ఎస్‌ఎంఎస్ పంపించాడు. తాము చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని కోరాడు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ఏర్పాటుచేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానిస్తూ 30.5.2015న నాకు మరో మెసేజ్ పంపించాడు. 


29.5.2015న నా మొబైల్ (9949054323)కు వాట్సాప్ ద్వారా Praise Jesus, Brother Elvis, Bishop Harry Sebastian, Christian Minority Cell, Telugu Desam Party.. అంటూ వచ్చిన మెసేజ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం విషయమై ఇంతకు ముందుచేసిన విజ్ఞప్తిపై నా నిర్ణయం గురించి అడిగారు. నేను ఎస్‌ఎంఎస్ ద్వారా ఆయనకు సమాధానం ఇచ్చాను. ఆ రోజు సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు టీఆర్‌ఎస్ భవన్‌లో తనకు పార్టీ సమావేశం ఉందని, ఆయనతో టచ్‌లో ఉంటానని, నా ఇంటి వద్ద కలుసుకుంటానని ఎస్‌ఎంఎస్‌లో తెలిపాను. అదే రోజు రాత్రి 9గంటల సమయంలో సెబాస్టియన్‌కు ఫోన్‌చేశాను. బాధ్యులైన పార్టీ నేతలతోనే మాట్లాడుతానని చెప్పాను. దానితో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ డీల్ చూస్తారని చెప్పాడు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు అదే రోజు సమాచారం ఇస్తూ, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి తదుపరి రోజు ఉదయం రానున్నారని తెలిపాను. 30.5.2015 ఉదయం 10గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేసి, తాను, రేవంత్‌రెడ్డి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు డీఎస్పీ తన సిబ్బందితో ఉదయం మా ఇంటికి వచ్చారు. వీడియో, ఆడియో రికార్డింగ్ సదుపాయం ఉన్న ఒక ఐఫోన్‌ను తీసుకువచ్చి, మా ఇంట్లో సిటింగ్ హాల్‌లో ఉన్న టీవీ పక్కన అమర్చారు. 


అదే రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి వచ్చారు. సిటింగ్ హాల్లో ఉన్న సోఫాపై పక్కపక్కన కూర్చున్నారు. వారికి ఎదురుగా ఉన్న మరొక సోఫాలో నేను కూర్చున్నాను. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరేందుకు చంద్రబాబు తనను పంపించారని రేవంత్‌రెడ్డి చెప్పాడు. రూ.2.5 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఒకవేళ ఈ డీల్ బయటపడితే మిమ్మల్ని ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా చంద్రబాబు నామినేట్ చేస్తారని, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా క్రిస్టియన్ మైనారిటీ పోస్టు ఇప్పిస్తారని రేవంత్ చెప్పాడు. నన్ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని, ఆ సమావేశం అత్యంత రహస్యంగా ఉంటుందని కూడా రేవంత్‌రెడ్డి చెప్పాడు. నేను చంద్రబాబునాయుడును కలుసుకునేందుకు నిరాకరించాను. రేవంత్‌రెడ్డితోనే మాట్లాడుతానన్నాను. కూల్‌డ్రింక్‌లేదా టీ తాగుతారా అని అడుగగా, మంచినీళ్లు తీసుకుంటానని రేవంత్‌రెడ్డి చెప్పాడు. ఆయనకు నా కుమార్తె జెస్సికా స్టీఫెన్‌సన్ మంచినీళ్లు ఇచ్చింది.


రూ.2.5కోట్లపై సంతృప్తి చెందకపోతే ఎంత కోరుకుంటున్నారో చెప్పాలని, దానిని తాను చంద్రబాబుకి తెలియజేస్తానని, ఆయనే వ్యక్తిగతంగా డబ్బు విషయం నిర్ణయిస్తారని రేవంత్‌రెడ్డి నాతో చెప్పాడు. నిర్దిష్టంగా ఎమౌంట్ ఎంతో చెప్పాలని నన్ను మళ్లీ అడిగాడు. ఆయన విజ్ఞప్తిపై నేను ఓ 5కోట్లు అని చెప్పాను. ఆ తర్వాత వారు వెళ్లిపోయేందుకు లేచి, ఈ రోజే చంద్రబాబు మీతో మాట్లాడుతారని, డీల్ కన్‌ఫర్మ్ చేస్తారని చెప్పారు.


అదే రోజు సాయంత్రం సెబాస్టియన్ నాతో 3,4సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. చంద్రబాబు సమావేశాల్లో బిజీగా ఉన్నారని,తీరిక దొరకగానే కాల్ చేస్తారని చెప్పాడు. సాయంత్రం 4గంటల సమయంలో సెబాస్టియన్ నా ఫోన్(9949054323)కి కాల్ చేసి చంద్రబాబునాయుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఫోన్‌ను చంద్రబాబుకు ఇచ్చారు. మా వాళ్లు బ్రీఫ్డ్ మీ ఎబౌట్ ది డీల్.. అంటూ నాతో మాట్లాడటం మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆందోళన చెందవద్దని, తాను మీతో ఉంటానని చెప్పారు. నేను వాళ్ల మనుషులకు ఏదైతే ప్రతిపాదించానో దానిని ఆమోదిస్తున్నట్టు చెప్పారు. ఆందోళన చెందవద్దని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని, ఇది తన కమిట్‌మెంట్ అని, మనం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఆ విధంగా నాకు రూ.5కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. తనను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. 30.5.2015 ఉదయం 9గంటల సమయంలోనే తన కొత్త మొబైల్ నంబర్‌ను నాకు తెలియజేస్తూ సెబాస్టియన్ మెసేజ్ పంపించాడు. 


31.5.2015న ఉదయం 8.50 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు కాల్ చేశాడు. రూ.50లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆయన, రేవంత్‌రెడ్డి మా ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. మధ్యాహ్నం 3.20కి సెబాస్టియన్ మళ్లా ఫోన్ చేశాడు. సమావేశం ప్రదేశం మార్చాలని కోరాడు. దానితో నేను సికింద్రాబాద్ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న వీధిలో నివసించే నా స్నేహితుడు మాల్కం టేలర్ ఇంటికి రావాల్సిందిగా సూచించాను. టేలర్ నాకు 25ఏళ్లుగా స్నేహితుడు. వెంటనే నేను టేలర్‌కు ఫోన్‌చేసి కొందరు ముఖ్యమైన వ్యక్తులను మీ ఇంట్లో కలుసుకుంటానని తెలిపాను. అప్పుడు ఆయన తన తల్లి గారి ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరని, అక్కడ కలుసుకోవచ్చని సూచించాడు. 


ఈ విషయాలను నేను వెంటనే ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు తెలియజేసి మాల్కం టేలర్ తల్లిగారింటికి బయల్దేరాను. నేనూ, నా స్నేహితుడు మాల్కం టేలర్ హాల్ రూమ్‌లో కూర్చున్నాం. ఏసీబీ అధికారులు అక్కడికి ఆడియో, వీడియో రికార్డింగ్ సాధనాలతో వచ్చి వాటిని అక్కడ అమర్చారు. నా చేతిలో ఉంచుకునేందుకు ఒక ఐ ఫోన్ వీడియో రికార్డర్‌ను ఇచ్చారు. 4గంటల సమయంలో సెబాస్టియన్‌నుంచి నాకు ఫోన్ వచ్చింది. తాను ఉప్పల్ నుంచి వస్తున్నానని, మీటింగ్ ప్లేస్‌కు చేరుకోవడానికి మార్గంచెప్పాలని అడిగారు. దానితో నేను అడ్రస్ చెప్పేందుకు ఫోన్‌ను నా స్నేహితుడు మాల్కం టేలర్‌కు ఇచ్చాను.


4.20సమయంలో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి వచ్చారు. హాల్ రూమ్‌లో కూర్చున్నారు. కొంత సమయం తర్వాత తెల్లషర్టు, జీన్స్ వేసుకున్న ఒక బలిష్టమైన వ్యక్తి నల్లబ్యాగ్‌తో వచ్చాడు. ఆ బ్యాగ్‌ను రేవంత్‌రెడ్డి పక్కన పెట్టాడు. 


బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని డబ్బును టీపాయి మీద పెట్టాలని సదరు బలిష్టమైన వ్యక్తిని రేవంత్ కోరాడు. దానితో అతడు రూ.500 నోట్లతో ఒక్కొక్కటి రూ.2.50 లక్షలున్న బండిల్స్‌ను బ్యాగ్ నుంచి బయటకుతీశాడు. తర్వాత రేవంత్‌రెడ్డి, డబ్బు బ్యాగ్ తెచ్చిన వ్యక్తి లేచి, పనులున్నాయని చెప్పి వెళ్లిపోయారు. సెబాస్టియన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు. ఈలోగా ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డి, బ్యాగ్ తెచ్చిన వ్యక్తిని ఫ్లాట్‌లోకి తీసుకొచ్చారు. తర్వాత నేను నా స్నేహితుడి తల్లిగారి ప్లాట్‌నుంచి వెళ్లిపోయాను. కానీ సమీపంలోనే ఉన్నాను. మూడు గంటల తర్వాత ఏసీబీ డీఎస్పీ నాకు ఫోన్ చేసి పిలిపించారు. రేవంత్‌ఎదుట కూర్చోబెట్టి డబ్బు గురించి, రేవంత్, సెబాస్టియన్, డబ్బు తెచ్చిన వ్యక్తి అక్కడ ఉండటం గురించి నన్ను అక్కడే విచారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు నాకు లంచంగా ఇచ్చేందుకు ఆ రూ.50 లక్షలను తెచ్చారని నేను ఏసీబీకి డీఎస్పీకి వివరించాను. డీఎస్పీకి ఇచ్చిన పై స్టేట్‌మెంట్‌ను డీఎస్పీ నమోదు చేసుకున్నారు.


తర్వాత ఏసీబీ అధికారులు నన్ను, నా స్నేహితుడు మాల్కం టేలర్‌తోపాటు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, డబ్బు తెచ్చిన వ్యక్తిని బంజారాహిల్స్‌లోని వారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఏసీబీ అధికారులు నన్ను కూలంకషంగా విచారించారు. నా స్టేట్‌మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు ఏసీబీ అధికారులు అమర్చిన ఆడియో, వీడియో రికార్డర్లలో రికార్డయ్యాయి...అని స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో తెలిపారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి