గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 12, 2015

బాబు ఈ పని చేయగలరా...???అసలు కేసు గురించి మాట్లాడరెందుకని ఎవరెన్ని ప్రశ్నలు వేసినా ఉష్ట్రపక్షి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు చివరకు ఫోన్‌ట్యాపింగ్, విభజన చట్టంలోని 8వ నిబంధన అనే రెండు అంశాలను తరణోపాయంగా చూస్తున్నారు. కానీ ఇవి ఆయనను గట్టెక్కించగలవి కావని ఆ రెండింటిని పరిశీలించిన వారికి బోధపడుతుంది. అదే విషయం ఇప్పటికే నిపుణులు కూడా ఎత్తి చూపుతున్నారు. అది చంద్రబాబుకు కూడా అర్థమైనట్లున్నది. అందుకే ఆయనలో అసహనం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మన రాజకీయ నాయకులకు తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడినా ఏమీ కాదనే ధీమా ఒకటుంది. రేవంత్‌రెడ్డి కేసు సందర్భంలో చంద్రబాబు కూడా అంటువంటి ధీమానే ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత భంగపడితే దేశానికి అంత మంచిది. చట్టవిరుద్ధమైన పనులు యథేచ్ఛగా చేయడం, పట్టుపడకపోవడం, పట్టుబడినా తప్పించుకోవడం వీరికి ఒకప్పుడు మంచినీళ్ల ప్రాయంగా ఉండేది. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తల వంటివారు జైళ్లకు పోతుంటే, ప్రధానమంత్రులు సైతం బోనెక్కవలసి వస్తున్నది. ఇదంతా చంద్రబాబుకు తెలుసు.
ప్రస్తుతపు ఓటుకు నోటు కేసులో తనకు ఏమీ జరగదనే ధీమా నిజానికి ఆయనకు ఉన్నట్టు లేదు. కానీ దబాయింపు వాదనలు, అహంకారం చాలా ప్రదర్శిస్తున్నారు. ఆ వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించగలదని, జాతీయస్థాయి వారిని తప్పుదారి పట్టించగలదని ఆయన ఆశపడుతున్నట్టున్నారు. ఈ ధీమాలు, ఆశలు భంగపడటం చాలా అవసరం. 
రేవంత్ కేసులో చంద్రబాబు సూత్రధారిత్వం గురించి ఢిల్లీతో సహా దేశమంతటికీ స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇందులో అర్థం కానీ మిస్టరీ ఇక ఏమీ లేదు. కాకపోతే కొన్ని వివరాలు తెలియరావాలి. జరిగిన దానితో ఆయన రాజకీయ ప్రతిష్ఠ ఇప్పటికే మట్టిపాలైంది. తను ఎంత హుంకరించినా, దృష్టిని మళ్లించే వాదనలు చేసినా ప్రతిష్ఠ్ ఇక తిరిగి వచ్చేది కాదు. గత పదిరోజుల ఘటనలు దేశానికంతా కనిపిస్తున్నవే. సులభసూత్రాల వలె చెప్పాలంటే, స్టీఫెన్‌సన్ ఓటును ఖరీదు చేసేందుకు రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పట్టుబడినారు. స్టీఫెన్‌సన్‌తో ఫోనులో మాట్లాడి చంద్రబాబు పట్టబడినారు. వీడియో టేపుల్లో ప్రపంచానికంతా కనిపిస్తున్న రేవంత్ ఘనకార్యం గురించి చంద్రబాబు ఈ పదిరోజుల్లో నోరు మెదపలేదు. రేవంత్‌ను ఇరికించారంటారు గానీ ఏ విధంగానో చెప్పరు. 

స్టీఫెన్‌సన్‌తో తన సంభాషణ రికార్డు ఫేక్ అని ఒకసారి, ట్యాపింగ్ జరిగిందని మరొకసారి అంటారు. ఇందులో వైరుధ్యం అందరూ ఎత్తి చూపుతున్నదే. గత కొద్దిరోజులుగా ట్యాపింగ్ అనే వాదన కు కట్టుబడినట్లున్నారు. ట్యాపింగ్ జరిగి ఉంటే అది తప్పనుకున్నా, నేర పరిశోధన కోసం సైతం ట్యాపింగ్ చేయరాదని కోర్టులేమీ అనలేదు. ఒకవేళ అన్నాయని వాదనకోసం అంగీకరించినా, ఆ సంభాషణలోని తన నేర పథకం అన్నది అసలు విషయమైనప్పుడు చంద్రబాబు ఆ ప్రశ్నకు మసిపూయడం ఎందుకు? ట్యాపింగ్ అనే నేరం జరిగింది గనుక, తన ఫోన్ సంభాషణలోని నేర పథకం నేరం కాకుండా పోతుందని ఆయన చెప్పదలచుకున్నారా?

వాస్తవానికి ఈ అంశంపై ఎన్నెన్నిపదునైన, తర్కమైన ప్రశ్నలు వినవస్తున్నాయంటే, ఇంకా మిగిలిన కోణాలేవీ కన్పించడం లేదు. పైన రాసినవి కూడా అట్లా వినవస్తున్న వాటిలోంచి తీసుకున్నవే తప్ప కొత్తవికాదు. ఇవన్నీ ఎంత తార్కికంగా, పదునుగా ఉన్నాయో మరొకవైపు చంద్రబాబు శిబిరం నుంచి వినవస్తున్నవి అంత బలహీనంగా ఉన్నాయి. సాక్షాత్తూ అధినేత సహా వారందరికీ దబాయింపులు, చట్టాల గురించి ఆధారం లేని ఊహాగానాలు, కనీస పరిజ్ఞానం లేకపోవడం మినహా మరొకటి లేదని స్పష్టంగా కనిపిస్తున్నది.

కనుకనే చంద్రబాబు, ఆయన పార్టీ ఈ పదిరోజులు గడిచేసరికి ఇక్కడ, దేశస్థాయిలో కూడా పూర్తి ఒంటరిగా మిగిలారు. చివరకు ఆయన రాజకీయ భాగస్వామి బీజేపీ సైతం తనను బలపరచడం లేదు. ఇటువంటి తీవ్రమైన కేసులలో, రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నచోట, త్వరపడి ఒక వైఖరి తీసుకోకుండా కోర్టు తీర్పుల కోసం వేచి ఉండే పార్టీలు, ప్రముఖులు సైతం చంద్రబాబు రాజీనామాను, అరెస్టును కోరుతుండటాన్ని చూడగా, ఆయనకు ఇక మిగిలిన విశ్వసనీయత ఏమిటి? సాంకేతికంగా ఆలోచించినప్పుడు, కోర్టు తీర్పు చెప్పేవరకు ఎవరూ దోషికాదన్నది నిజమే. కానీ ప్రజా జీవితంగా అన్న విషయాలు సాంకేతికతలపై ఆధారపడి ఉండవు. తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‍కు సానుభూతిపరులు కానివారు, బద్ధ వ్యతిరేకులు సైతం చంద్రబాబు రాజీనామాను, అరెస్టును డిమాండ్ చేస్తున్నారంటే, ఒక కేసులో నిర్వివాదమైన రీతిలో ఆధారాలు కళ్ల ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కనీస విచక్షణా దృష్టి గలవారు సాంకేతికమైన తీర్పుల కోసం ఎదురుచూడరన్న మాట.

అయినప్పటికీ నిర్ణయాత్మకమైన రీతిలో, చంద్రబాబు వంటి రాజకీయ తరగతి ధీమాకు, అహంకారానికి భంగపాటు జరగడం చాలా అవసరం. ఒక్క ఈ కేసు కోసమే కాదు. మొదట అనుకున్నట్లు తమను ఎవరేమీ చేయలేరనే ఈ అవినీతి రాజకీయ జాతి ధీమా ఇటీవలి సంవత్సరాలలో భంగపడుతున్నది. అది న్యాయానికి, నీతికి, ప్రజాస్వామ్యానికి నెమ్మదిగా మేలు చేస్తున్నది. వీరిపట్ల సామాన్య ప్రజలకు, దర్యాప్తు సంస్థలకు, కోర్టులకు జంకు తగ్గుతున్నది. ఇది దేశంలో ఆహ్వానించదగ్గ మార్పు. ఈ మార్పు ఇంకా బలపడాలి. అవినీతికి పాల్పడే నాయకులకు, ధనవంతులకు, బలవంతులకు మనసులో ఫికర్ ఏర్పడాలి. అహంకారపు హుంకరింపులు, వక్రపు వాదనలు చెల్లబోవని అర్థం కావాలి. ఆ దిశలో చం ద్రబాబు కేసు మరొక మైలురాయి కావాలి.

ఆయనను మొదటి నుంచి గమనిస్తున్నవారు మొన్నటి గుంటూరు సభలో తన ప్రసంగపు తీరు చూసి, తర్వాత బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చేసిన హెచ్చరికలను గమనించి నమ్మలేకపోయారు. ఆయన అంతగా సంయమనం కోల్పోయి రెచ్చిపోవడానికి కారణం రేవంత్ కేసు ఒక్కటే అయినట్లు తోచడం లేదు. ఎమ్మెల్సీగా తమ అభ్యర్థిని గెలిపించుకుని, టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించి తన ఘటనాఘటన సమర్థతను నిరూపించాలన్న పథకం విఫలం కావడంతో తీవ్రమైన నిరాశ కలగడం సరే. ఆ స్థితి ఆగ్రహాన్ని కలిగించడం సహజం. ఆ కేసు తన గుమ్మం వరకు రావటమన్నది కొత్త పరిస్థితి. ఊహించనిది. ప్రమాదకరమైనది. అయినా చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు, వ్యూహకర్తగా పేరుపడిన నాయకుడు దాన్నుంచి బయటపడే మార్గాల కోసం నింపాదిగా ఆలోచించాలి. కానీ ఈ విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటే తను బయటపడటం కష్టమని, మేనేజ్ చేయలేనని ఆయనకు అర్థమై ఉండాలి. ఇదంతా చాలదన్నట్టు ఇది ఎటువంటి స్థితిలో బట్టబయలైంది? తమ కొత్త రాష్ర్టాన్ని తాను దశల వారీగా దేశంలోనే మూడవదిగా, మొదటిదిగా, ఆ తర్వాత యావత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణిదిగా మార్చగలనని ప్రతిజ్ఞలు చేస్తున్న వేళ జరిగింది!


తన గత రికార్డును, సమర్థతను దేశ విదేశాల వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులకు వివరించి ఆహ్వానిస్తూ ఆకాశయానం చేస్తున్న సమయంలో మొత్తం దేశంలోనే అత్యుత్తమమైన రాజధానీ నగరానికి భూమి పూజ చేసిన వేళ.


అటువంటి మేధో-మానసికస్థితిలో ఉండిన చంద్రబాబుకు ఈ ఉదంతం ఒక తీవ్రమైన ఎదురుదెబ్బ కావడం నిజం. ఆయన ఆగ్రహ పారవశ్యానికి ఇదొక ముఖ్యకారణం అయి ఉండాలి. ఆ మేరకు తనను అర్థం చేసుకోవచ్చు. కానీ అంతటి ఘనమైన లక్ష్యాలను ముందుంచుకున్న ఆయన అందుకు అంకితమై దానిపై దృష్టి కేంద్రీకరించి పనిచేసినట్లయితే తనను అభినందించి ఉండేవాళ్లం. అది తనకు, తన పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ర్టానికి మేలు చేసేది. కానీ ఆయన ఒక పొరుగు రాష్ట్రంలో చవకబారు రాజకీయాలకు దిగారు. రాజకీయాలు చేయడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ అవినీతి రాజకీయాలకు పాల్పడి తనను తాను పతనం చేసుకున్నాడాయన. మొదట ఎన్టీఆర్‌కు ద్రోహం, తర్వాత విచక్షణలేని ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రజలకు ద్రోహం చేసిన ఆయన, ఇప్పుడింత పచ్చి అవినీతి రాజకీయానికి పాల్పడి మొత్తం దేశం దృష్టిలోనే విలువ కోల్పోయారు. అది కూడా ఇటీవలి వారాలలో నీతి గురించి పదే పదే వల్లిస్తూ. ఇటువంటి వారికి తిమ్మిని బమ్మి చేసి బయటపడగలమనే ధీమా ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దానిని అవశేషాలు మిగలకుండా భంగపరచడం అవసరం. అది తనను దారిన పెట్టగలిగితే మున్ముందు అయినా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌కు కొంత మేలు కలుగుతుంది. తన వంటి వారికి దేశమంతటా గుణపాఠం అవుతుంది.

అసలు కేసు గురించి మాట్లాడరెందుకని? ఎవరెన్ని ప్రశ్నలు వేసినా ఉష్ట్రపక్షి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు చివరకు ఫోన్‌ట్యాపింగ్, విభజన చట్టంలోని 8వ నిబంధన అనే రెండు అంశాలను తరణోపాయంగా చూస్తున్నారు. కానీ ఇవి ఆయనను గట్టెక్కించగలవి కావని ఆ రెండింటిని పరిశీలించిన వారికి బోధపడుతుంది. అదే విషయం ఇప్పటికే నిపుణులు కూడా ఎత్తి చూపుతున్నారు. అది చంద్రబాబుకు కూడా అర్థమైనట్లున్నది. అందుకే ఆయనలో అసహనం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్థితి నుంచి బయటపడేందుకు ఒకే ఒక మార్గం కనిపిస్తున్నది. 

ఆయన తన తప్పునంతా ఉన్నది ఉన్నట్లుగా పూసగుచ్చినట్లు ప్రజలకు, కోర్టుకు వివరించి చెప్పాలి. బహిరంగంగా రెండు రాష్ర్టాల ప్రజలకు బేషరతు క్షమాపణలు ప్రకటించాలి. తన జీవితకాలంలో ముందెప్పుడూ అవినీతి రాజకీయాలకు పాల్పడబోనని హామీ ఇవ్వాలి. తనను తాను నిప్పులాంటి మనిషినని, సచ్చరిత్రుడనని పదేపదే ప్రకటించుకునే చంద్రబాబు ఈ పని చేయగలరా? రెండు రాష్ర్టాల ప్రజల మధ్య సంబంధాలను తన ప్రయోజనం కోసం బలిపెట్టే నీచానికి పాల్పడకుండా ఉండగలరా?

discription


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి