గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 27, 2015

సెక్షన్ 8 పై కొత్తగా చెప్పేదేమీలేదు!!! -గవర్నర్‍తో మంత్రి రాజ్‍నాథ్

rajnathsingh


హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతల కుట్రలు పారే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8పై ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పుడు ఈ విషయంలో వేలు పెడితే రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తటమే కాకుండా.. కందిరీగల తుట్టెను కదిపినట్టు అవుతుందని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీనిపై కొత్తగా చేసేదేమీ లేదని, చెప్పేది కూడా ఏమీలేదని హోంశాఖ నుంచి గవర్నర్‌కు స్పష్టత వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఇప్పుడప్పుడే మార్చే అవకాశం కూడా లేదని విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. 


- యథాతథ స్థితి కొనసాగుతుంది
- ఓటుకు నోటు కేసు ఏసీబీ చూసుకుంటుంది
- కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు
- సెక్షన్ 8కు, ఏసీబీ కేసుకు సంబంధం లేదు
-గవర్నర్‌తో హోం మంత్రి రాజ్‌నాథ్? 

గవర్నర్ మార్పు లేదు!- తప్పుకొంటానన్న నరసింహన్
- కుదరదన్న రాజ్‌నాథ్‌సింగ్
-పెద్దన్న పాత్ర పోషించాలని సూచన!

కనీసం ఏపీకైనా కొత్త గవర్నర్‌ను నియమించాలని నరసింహన్ చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన హోం మంత్రి.. రెండు రాష్ర్టాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారని తెలిసింది. గవర్నర్‌తో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమైన రాజ్‌నాథ్.. అనంతరం సెక్షన్ 8కు సంబంధించిన అంశాలపై చర్చ సందర్భంగా కార్యదర్శి ఎల్సీ గోయల్, కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్‌లను కూడా భాగస్వాములను చేసి రాజ్యాంగపరంగా వచ్చే చిక్కులపై చర్చించారని సమాచారం. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదిక, ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ వివరాలను రాజ్‌నాథ్‌కు గవర్నర్ వివరించారని తెలిసింది.


మొదట హోంశాఖ ముఖ్య కార్యదర్శితో భేటీ


హోంశాఖ ముఖ్య కార్యదర్శితో తొలుత సుమారు అరగంటపాటు సమావేశమైన గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులతోపాటు సెక్షన్ 8పైన రెండు రాష్ర్టాల అభిప్రాయాలను, రాజకీయ పార్టీల అభిప్రాయాలను వివరించారు. ఒక నివేదికను కూడా సమర్పించారని సమాచారం. ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేస్తున్న దర్యాప్తు, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదిక, కోర్టు విచారణ, రోజువారీ పరిణామాలు తదితరాలన్నింటినీ తెలియజేశారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. కొద్దిసేపటి తర్వాత కార్యదర్శి దగ్గరకు వచ్చి.. పలు అంశాలపై చర్చించి, మళ్లీ హోం మంత్రి దగ్గరకు వెళ్ళారు. ఆ విధంగా మూడుసార్లు హోం మంత్రి, హోం కార్యదర్శి చాంబర్లకు గవర్నర్ రాకపోకలు సాగించారు. ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.


సంతృప్తికరంగా హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్


హోం మంత్రి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి సమక్షంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, సెక్షన్ 8పై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల వాదనలను వివరించిన గవర్నర్.. ఈ సెక్షన్ ఇప్పటికే అమలులో ఉందని చెప్పారని తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారని సమాచారం. సెక్షన్ 8పై ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడంగానీ, కేంద్రంనుంచి మార్గదర్శకాలు లేదా ప్రత్యేకంగా నోటిఫికేషన్‌లాంటిదిగానీ ఇవ్వడం వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనమేమీ లేకపోగా ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతల పరిస్థితి కొంత వికటించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని గవర్నర్ వెలిబుచ్చినట్లు తెలిసింది. సెక్షన్ 8పై ఇప్పుడు ఏం చేసినా పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఉంటుందని, న్యాయపరంగా కూడా కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడమే అవుతుందని వారికి గవర్నర్ స్పష్టంచేశారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలకు భిన్నంగా వెళ్ళినట్లయితే రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కూడా వివరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 


ఇదే అంశంపై కార్యదర్శి గోయల్, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను చూసే సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ కూడా న్యాయపరంగా వచ్చే చిక్కులను రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం మిగిలిన అన్ని రాష్ర్టాలలాంటిదేనని, సెక్షన్ 8 ఆధారంగా మార్గదర్శకాలు, నోట్ లేదా నోటిఫికేషన్‌ను అధికారికంగా ఇవ్వడమంటే రాజ్యాంగంలో రాష్ర్టాలకు ప్రసాదించిన సార్వభౌమాధికారాన్ని హరించినట్లవుతుందని చెప్పారని సమాచారం. తద్వారా పరోక్షంగా కేంద్రపాలిత ప్రాం తంగా పరిగణించినట్లవుతుందని, అందువల్ల ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడం మినహా కొత్తగా ఏ మార్పులు చేయడానికి వీలుపడదని వివరించినట్లు తెలిసింది. ఇందుకోసం రాజ్యాంగంలోనూ, పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ పేర్కొన్న అంశాలను కూలంకషంగా చర్చించారు. ప్రత్యేకంగా కుమార్ అలోక్ ఈ రెండు పుస్తకాలను తన వెంట తీసుకెళ్ళారు. సెక్షన్ 8పై తెలంగాణ ప్రభుత్వం విధానాన్ని, హైదరాబాద్‌లోని ఎంఐఎం, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాలను కూడా గవర్నర్ వివరించారు. ఈ పార్టీలన్నీ కూడా సెక్షన్ 8పై ఇటీవల చేసిన వ్యాఖ్యలను, మార్పులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన తీరును రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తెచ్చారని సమాచారం. ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితికి భిన్నంగా ఏ మార్పు చేసినా ప్రజలు, పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు వివిధ ప్రజా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వచ్చే వ్యతిరేకత, ఆందోళన తదితరాలన్నింటిపైనా గవర్నర్ వివరించినట్లు తెలుస్తున్నది.


సెక్షన్ 8తో కొత్తగా వచ్చేదేమీ లేదు


తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం అందుతుండడం మాత్రమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలను తన దృష్టికి తీసుకొస్తున్నారని గవర్నర్ వివరించారని తెలిసింది. శాంతిభద్రతల అంశంపై కూడా సమాచారం అందుతూ ఉన్నదని, సెక్షన్ 8లో మార్పులు చేయడం ద్వారా ఇంతకన్నా అదనంగా వచ్చేదేమీ చెప్పారని సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి పట్టుబడిన తర్వాతే ఏపీ నుంచి సెక్షన్ 8 విషయంలో తీవ్ర స్వరంతో డిమాండ్లు రావడానికి కారణాలను కూడా గవర్నర్ వివరించారని తెలియవచ్చింది. తాజాగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివాదంతోపాటు జేఎన్టీయూ ప్రొఫెసర్‌పై దాడి చేసినట్లు వచ్చిన వార్తలను, వాటి వెనక ఉన్న నేపథ్యాన్ని కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదని గవర్నర్‌తోపాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిసైతం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న అభిప్రాయం కలగడంకోసం ఇప్పుడు వ్యవహరిస్తున్నదానికంటే మరికొంత యాక్టివ్‌గా వ్యవహరించాలని గవర్నర్‌కు రాజ్‌నాథ్ సూచించినట్లు తెలిసింది. రెండు రాష్ర్టాలమధ్య ఈ అంశం లో ప్రస్తుతం ఉన్న వాతావరణం కొంత సద్దుమణిగేలా చూడాలని సలహా ఇచ్చారని సమాచారం. ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు గవర్నర్‌పై విమర్శలు చేయడం సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు రాజ్‌నాథ్ కాస్త తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించడంతో పాటు అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు సమాచారం.


ఓటుకు నోటు కేసులో కేంద్ర జోక్యం ఎందుకు?


ఓటుకు నోటు వ్యవహారంలో గవర్నర్ తెలియజేసిన వివరాలన్నింటినీ కూలంకషంగా విన్న కేంద్ర హోం మంత్రి.. చట్టం ప్రకారం దర్యాప్తు సాగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేంద్రం ఈ వ్యవహారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదని, చట్టం తన పని తాను చేసుకునే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశారని సమాచారం. ఇప్పటికే ఆడియో, వీడియోలద్వారా ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయినందున ఇందులో వేలు పెట్టడానికి కేంద్రానికి ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపున గవర్నర్, రాజ్‌నాథ్ ఏకాంత భేటీలో ఏసీబీ కేసుపై రాజకీయ కోణంనుంచి చర్చ జరిగి ఉండవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. బీజేపీ-టీడీపీ మధ్య ఎన్నికలకు ముందునుంచి పొత్తు ఉన్నప్పటికీ.. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలు వాస్తవమైనవేనని తేలిన నేపథ్యంలో చంద్రబాబును వెనకేసుకు రావాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పినట్లు తెలిసింది. ఇదే కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం తథ్యమని సంకేతాలు వస్తున్న రీత్యా ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో తలెత్తనున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అదుపు చేయగలుతుంది? తదితరాలను చర్చించినప్పుడు ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తూ అవసరాన్ని బట్టి ప్రభుత్వంతో చర్చించి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు గవర్నర్ సుముఖత వ్యక్తంచేయలేదు. రోటీన్‌గా జరిగే మీటింగేనని ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. రాజ్‌నాథ్‌తో భేటీకోసమే ఢిల్లీకి వచ్చినందున సమావేశం అనంతరం సాయంత్రమే హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్ళిపోయారు.


గవర్నర్ మార్పు లేదు


రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహన్‌ను ఆ పదవి నుంచి మార్చే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన గవర్నర్.. ఏపీ ప్రభుత్వం ఎలాగూ తనను విశ్వసించడం లేదని, కనుక తనకు సెలవివ్వాలని విజ్ఞప్తి చేయగా.. దానిని కేంద్ర మంత్రి సున్నితంగా తిరస్కరించారని, రెండు రాష్ర్టాల మధ్య పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారని హోంశాఖలోని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. మీ పనితీరు పట్ల కేంద్రానికి సంతృప్తి ఉన్నది. గవర్నర్ మార్పు అవసరమైనప్పుడు ఎలాగూ నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకూ కొనసాగాలి అని నచ్చచెప్పినట్లు తెలిసింది.
ఏపీ ప్రభుత్వానికి నాపై విశ్వాసం లేదు: తొలుత తనను తప్పించడంపై ప్రస్తావించిన నరసింహన్.. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించనప్పుడు కొనసాగడం సమంజసంగా ఉండదని, ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేనని రాజ్‌నాథ్‌కు చెప్పారని తెలిసింది. పైగా తాను ఎప్పుడో తప్పుకోవాలని అనుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో ప్రస్తావించినప్పుడు జూన్, జూలై మాసాల్లో చూద్దామన్నారని, ఇప్పుడు జూన్ ముగిసిపోతూ ఉన్నందున ఇప్పటికైనా సెలవు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ మార్పు సాధ్యం కాదని, ఆ ఆలోచన లేదని రాజ్‌నాథ్ సర్దిచెప్పినట్లు తెలిసింది. ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాల గురించి చర్చించడంకంటే భవిష్యత్తులో రెండురాష్ర్టాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుండా పెద్దన్న పాత్ర పోషించి, సీఎంలతో మాట్లాడి పరిస్థితిని దారిలోకి తేవాలని వివరించినట్లు తెలిసింది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి