గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 16, 2015

ఒంటరినై పోయాను...ఇక ఇంటికి (ప్రజల్లోకి) ఏమని పోను?

ఏకాకి బాబు!

chandra


ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకాకిగా మారిపోతున్నారు. కేంద్రంలో పెద్దలను కలిసినా ఫలితం లేకపోవడం, గవర్నర్ వద్దే తేల్చుకోవాలని సలహా ఇవ్వడంతో ఇక ఈ కేసు నుంచి తనను బయటపడేసే బాధ్యతను ఏపీ పోలీసుల నెత్తిపైనే పెట్టినట్లు తెలుస్తున్నది. ఎంత ఆగ్రహంతో ఊగిపోతూ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ.. వారు సైతం కేసు బలంగా ఉన్న నేపథ్యంలో చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు చంద్రబాబు రాజీనామాకు విపక్షాలు మూకుమ్మడి గొంతుతో డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు స్వపక్షంలో అసమ్మతిరాగం పెరుగుతున్నది.
-నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్
-బాబు ఫోన్ ట్యాపింగ్‌కు ఆస్కారమే లేదు
-నగరంలో శాంతి భద్రతల సమస్య లేదు
-సెక్షన్ 8 ప్రసక్తే ఉత్పన్నం కాదని వివరణ
-ఓటుకు నోటు కేసులో మూసుకుపోయిన దారులు
-జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విముఖత
-బయటపడేయాలని సొంత పోలీసులపై బాబు ఒత్తిడి
-చేతులెత్తేస్తున్న ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు
-గవర్నర్ సలహాదారులను పిలిపించడంపై రగడ
-బాబు రాజీనామాకు కాంగ్రెస్, లెఫ్ట్ డిమాండ్

ఇవి సరిపోవన్నట్లు.. గవర్నర్ సలహాదారులను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని వారికే సలహాలు ఇవ్వడం కొత్త వివాదానికి దారితీస్తున్నది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిసి దాదాపు గంటన్నరపాటు చర్చలు జరుపడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. పలు ఇతర అంశాల ప్రస్తావనతోపాటు ఓటుకు నోటు కేసు, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ఉభయుల మధ్య చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

వివాదం రేపుతున్న సలహాదారులతో భేటీ


ఓటుకు నోటు కేసులో తన పేరు చార్జిషీటులోకి ఎక్కడం ఖాయమని తేలిపోవడంతో కేంద్రాన్ని సంప్రదించిన బాబుకు.. అక్కడి నుంచి వచ్చిన సలహా ఆయన పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేసినట్లయింది. ఈ విషయంలో మాట్లాడేందుకు రావాలని గవర్నర్ ఆహ్వానించినప్పటికీ.. తానెందుకు వెళ్లాలన్న అక్కసుతో వెళ్లకుండా.. ఆయన సలహాదారులను ఇంటికి పిలిపించుకున్నారు. ఒక గవర్నర్‌కు సలహాదారులుగా ఉన్నవారిని ఒక ముఖ్యమంత్రి పిలిపించుకోవడం ఏంటనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నది. పైగా వారిని తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నించారన్న ఆరోపణలు భారీస్థాయిలో వినిపిస్తున్నాయి.

పాలనపరంగా, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు గవర్నర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించింది. ఆ బాధ్యతల్లో ప్రస్తు తం మాజీ ఐపీఎస్ మహంతి, మాజీ ఐఏఎస్ శర్మ ఉన్నారు. అయితే వీరు కేవలం గవర్నర్‌కు మాత్రమే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వాధికారులకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు.. ఆ ఇద్దరు సలహాదారులను తన ఇంటికి పిలిపించుకోవడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా సెక్షన్ 8 అమలుకు గవర్నర్‌పై ఒత్తిడి తేవాలని, ఆ మేరకు ఆయనకు సూచనలివ్వాలని చెప్పడమేకాకుండా.. తాను చెప్పే అంశాలను గవర్నర్‌కు చెప్పి అమలు చేయించాలని పదే పదే సలహాదారులపై బాబు ఒత్తిడిచేశారని గవర్నర్ కార్యాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నేరుగా గవర్నర్ పిలిస్తే వచ్చి ఆయనే ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా! మాకేంటి ఈ గోల? అని గవర్నర్ కార్యాలయం అధికారులు
వాపోతున్నారు. అసలు గవర్నర్ సలహాదారులపై చంద్రబాబు పెత్తనమేంటన్న ప్రశ్నలను కూడా విపక్షాలు లేవనెత్తుతున్నాయి.

ఏపీ పోలీసులపై తీవ్ర ఒత్తిడి!


కేంద్రం పట్టించుకోకపోవడంతో సొంత పోలీసులపైనే ఆధారపడుతున్న చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో తనను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే కేసు బలంగా ఉన్న నేపథ్యంలో ఏపీ అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రోజుకు నాలుగైదుసార్లు ఏపీ డీజీపీ, ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సమావేశమవుతున్న చంద్రబాబు.. తనను బయటపడేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని తెలిసింది. నోటీసులిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? నోటీసులు తీసుకోకుంటే ఏమవుతుంది? నోటీసులు లేదా సమన్లు ఇస్తే స్టే తెచ్చుకోవాలా? అన్న పలు అంశాలపై మార్గాలు వెతకండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలో నోటీసులు ఇప్పించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ నుంచి నాకు నోటీసులు వస్తే ప్రతిగా మనం కూడా నోటీసులు ఇవ్వాలి అని స్పష్టంచేసినట్లు తెలిసింది. చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఏపీ పోలీసులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. తాను తప్పుచేసి కూరుకుపోయి.. తమను కూడా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు.

ముప్పేట విమర్శల దాడి


ఓటుకు నోటు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామాకు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ కేసులో బాస్ చంద్రబాబేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. ఏ-1 రేవంత్‌రెడ్డి కాదని, చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి, విచారణ ఎదుర్కొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలకు చెందాల్సిన సొమ్ము దోపిడీ చేస్తూ తెలంగాణలో టీడీపీనీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అందులోభాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి తెరతీశారని విమర్శించారు. తాను అవినీతిలో కూరుకుపోయి గవర్నర్‌పై విమర్శలు చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. సీపీఐ సీనియర్ నేత కే నారాయణ కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో టేపులు కూడా దొరికిపోయిన తర్వాత ఏపీ సీఎం ఎంత దబాయించినా ప్రయోజనం లేదని నారాయణ అన్నారు. చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. వీడియో, ఆడియో టేపులు బయటపడడంతో చంద్రబాబు దిక్కుతోచక ఇతర అంశాలు ముందు పెట్టి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎత్తుకున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనప్పటికీ అభ్యర్థిని నిలబెట్టడమే టీడీపీ చేసిన తప్పిదమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామనే ధీమా ఉండటం వల్లే అభ్యర్థిని నిలిపిందని అర్థమవుతున్నదని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు బుకాయింపు ధోరణి విడనాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత చూసుకోవాలని, ముందు తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయవిచారణకు సిద్ధం కావాలని హితవు పలికారు. ఆరోపణలు రుజువుచేసుకోకుండా దీనిని రెండు రాష్ర్టాల సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చురేపడం సరికాదన్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. టీవీ చానళ్లలో ప్రసారమైన టేపుల వాయిస్‌ను వింటే క్లియర్‌గా అర్థమవుతుందన్నారు.

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఢిల్లీ పెద్దలను గవర్నర్ కలిసివచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ర్టాల సీఎంలతో గవర్నర్ మాట్లాడే అవకాశం ఉందని రెండు రోజుల ముందే వార్తలు వచ్చాయి. అయితే.. గవర్నర్ పిలిచినా చంద్రబాబు ఆయనతో సమావేశం జరిపేందుకు వెళ్లలేదు. ఈ తరుణంలోనే గవర్నర్‌ను కలిసిన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఓటుకు నోటు వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు రుజువు చేసే ఆడియో టేపులు బయటపడిన విషయం, రాజధానిలో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

చంద్రబాబు సంభాషణల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని గవర్నర్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌లకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారని, చట్ట ప్రకారం స్వతంత్రంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారని సమాచారం. కావాలనే తమ ప్రభుత్వంపై, తనపై ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు, ఇతర మంత్రులు విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు కేసీఆర్ తెలిపారని సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తమ వద్ద ఉన్న సమాచారాన్ని గవర్నర్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, ఇతర నేతలు ఈ డిమాండ్ చేస్తున్నది కేవలం తమ ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్ర, అక్కసుతోనేనని కేసీఆర్ స్పష్టంచేసినట్లు సమాచారం. గడిచిన ఏడాదికాలంలో నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్న విషయాన్ని గవర్నర్‌కు గుర్తు చేసిన కేసీఆర్.. సెక్షన్ 8 ఆలోచనకే ఆస్కారం లేదని అన్నట్లు తెలిసింది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ పరంగా తాము కంకణబద్ధులై ఏర్నామని స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది. ఇదే సందర్భంలో ఇద్దరు గవర్నర్ సలహాదారులు ఏపీ సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలవడాన్ని నరసింహన్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్ళినట్టు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి