దేశంలో క్రైమ్‍ను క్రైమ్‍గా నిర్ధారించడానికి దశాబ్దాల కాలం పడుతున్నది. పట్టుబడ్డ రాజకీయ నాయకులెవ్వరూ స్వయంగా రాజీనామా పెట్టే సంస్కారం మన దేశంలో లేదు. నీలం సంజీవరెడ్డి ఒక్కరు మాత్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక చిన్న పొరపాటు పబ్లిక్‌గా సర్‌ఫేస్ అయితే తనకు తానే రాజీనామా పెట్టారు. సభ్య దేశాల్లో ఈ రివాజును పాటిస్తారు. కోర్టుల చుట్టూ తిరగరు. ప్రభుత్వాన్ని కాపాడమని కాళ్లా వేళ్లా పడరు. రాజీనామా చేస్తే తప్పు చేసిన వారికి శిక్ష తగ్గడమే కాకుండా పబ్లిక్ సింపతీ, ఇమేజ్ పెరుగుతుంది. శిక్షపడక ముందే బాబు సభ్య సమాజ సంస్కారాన్ని పాటిస్తే మంచిది.
చంద్రబాబు నాయుడు వెటరన్ రాజకీయవేత్త. అతి తెలివైన, చురుకైన రాజకీయ వ్యవహారకర్త (మ్యానిపులేటర్), గ్రేట్ సర్‌వైవర్ కూడా. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎగుడు దిగుడులను తరిచి చూసి నిలదొక్కుకున్న ఘటనా ఘటన సమర్థుడు. ఆయన చేయదల్చుకున్న డర్టీ పొలిటికల్ పథకాన్ని ఆయన స్వయానా ఎప్పుడు చేయడు. తన చేతికి మైలంటకుండా ఇతరులతో చేయిస్తాడు. ఎందుకో ఈసారి ఏ ఖర్మనో ఏమో ఆయనే స్వయంగా అనూహ్యంగా అడ్డంగా దొరికిపోయాడు.
మన హిందూ ధర్మశాస్త్రం తన కోపమే తన శత్రువని చెబుతున్నది. ఈర్ష్య, ద్వేషం, అసూయ, అనవసరమైన పగ, కక్ష, వైరం స్వీయ పతనానికి కారణమవుతాయని మన శాస్త్రాలు చెబుతున్నవి. భస్మాసుర శాపగ్రస్థ పతనం గుణపాఠం, ఒక తార్కాణం. పక్క రాష్ట్రంపై పగ, కసి బాబును ఈ దశకు చేర్చిందని భావించడంలో తప్పు లేదు.
రాజ్య విస్తరణ, సామ్రాజ్యవాదం పాతకాలం నాటి బూజుపట్టిపోయిన రాజకీయ సిద్ధాంతం. దాన్ని అనాక్రనిజం అంటారు. అనగా కాలం చెల్లిన పాత మూస పద్ధతి. అది బాబుకు అత్యంత సంతృప్తినిచ్చే సిద్ధాంతం. ఆయన జీవితాశయం సామ్రాజ్య విస్తరణ. రాజులకు ఇచ్చే ట్రైనింగ్‌లో మొదటి పాఠం రాజ్య విస్తరణ లేని రాజ్యం రాజ్యమే కాదు. దీన్ని బాబు బాగా ఒంట పట్టించుకున్నాడు. అందుకే పదే పదే రెండు రాష్ట్రాలపైన జెండా మనదే, 2019 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రప్రభుత్వాలు మనవే అంటూ ఇదేమాట పదేపదే సంధిప్రేలాపనలా చెప్పుతూనే వున్నాడు.
యూనివర్సిటీ విద్య చదివిన బాబుకు ది ప్రిన్స్ తెలిసే ఉంటుంది. ఆయనకు ’ది ప్రిన్స్’ అనే రాజకీయ సిద్ధాంత గ్రంథం మ్యాక్‌వెల్లి రాసింది తెలిసే వుంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం ’రాజకీయ అవసరాలకు అనైతిక పద్ధతులు అవలంబించవచ్చు. అధికారం పొందవచ్చు. దాన్ని అమలు చేయడంలో కూడా అదే పద్ధతి పాటించవచ్చు. రాజకీయ అగత్యానికి అవసరానికి నైతిక విలువలు అడ్డు కాకూడదు. వాటిని పాటించవలసిన అవసరం లేదు’ అని మ్యాక్ వెల్లి సిద్ధాంతం చెబుతున్నది. బాబు దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్టు ఆయన రాజకీయ చరిత్ర తెలుపుతున్నది.
మ్యాక్‌వెల్లి సిద్ధాంతం ఆరువందల సంవత్సరాల కిందటిది. ఆ రోజుల్లో దాన్ని ఎవరు పాటించారో తెలియదు. పాటించిన వారు మాత్రం చరిత్రహీనులై పోయుంటారు. ఆంధ్రాలో ఇప్పుడు కాంట్రాక్టర్ల, సంపన్నుల, వ్యాపారవేత్తల సిండికేట్ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఒకప్పుడు కర్నాటకలో, ఆంధ్రాలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా, కర్నాటక, ఆంధ్ర రాజకీయాలను శాసించే దశకు చేరింది. ఆ సిండికేట్‌లో ఆంధ్రకు ఆనాటి ముఖ్యమంత్రి కూడా ఒక ముఠా సభ్యుడు. వారంతా ధన బలంతో కుల బలంతో దేశ రాజకీయాలను శాసించడానికి పార్లమెంటు సభ్యులను కూడా వశపరచుకొనడానికి కోట్లాది ధన రాసులను వెచ్చించాలని పథకం వేశారు. అదే ప్లాన్‌ను ఈ రోజు చంద్రబాబు ఆంధ్ర రాజకీయ బిజినెస్ దళం ఆపరేట్ చేయాలని, ఆమలు చేయాలని, తమ నెట్‌వర్క్‌ను ఆరు రాష్ట్రాలకు విస్తరింపచేయాలని ఆరాటపడుతున్నది. బాబు కూడా తన విస్తరణ ప్లాను బయటపెట్టాడు.
మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు ఆంధ్ర మనీ ఫ్రెషర్ గ్రూపులుగా ఎలా మారుతారో, చట్ట సభలపై ఆధిపత్యం కోసం సంఖ్యా బలాన్ని ఎలా సమీకరించుకుంటారో...ప్రదర్శిస్తారో...వాడుతారో తేటతెల్లంగా తెలిసిపోయింది. అందుకే ఆయన ’ఇల్లీగల్ అక్యుమ్యులేషన్ అండ్ అక్విజిషన్ ఆఫ్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పాలిటీషియన్స్ ఇజ్ ఏ బిగ్ త్రెట్ టు పార్లమెంటరీ డెమాక్రసీ’ అని బహిరంగంగా చెప్పారు కొంత మంది సన్నిహితులతో. ఆంధ్రా మనీ బ్యాగులు తన క్యాబినేట్‌లో చొరబడడానికి నానా తిప్పలు పెట్టేవారని తాను ఎన్నో సార్లు వారిని ప్రతిఘటించానని చెప్పారట. కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఆర్జించిన వేల కోట్ల ధనానికి ఔట్‌లెట్ కార్యక్రమమే నోటుకు వోటు పథకం. ఈ మాస్టర్ ప్లాన్‌కు సీఈఓ ఎవరో అందరికీ తెలిసిందే.
బాబు తెలంగాణపై దండయాత్ర గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని స్పీడు పెంచారు. రెండు మూడు నెలల కొకసారి మందీ మార్బలంతో వందలాది మంది పోలీసు బలగాలనీడన బస్సు యాత్రలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజాబలం ముందు చంద్రబాబు అద్దె మైకుల బలం ఒక్క పైసాతో కూడా సమానం కాదు. అయినా కేసీఆర్ సహనంతో ఓపిక పడుతున్నాడు. తగిన సమయంలో జవాబు చెప్పటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా వున్నది.
బాబు ఎన్నికలైన తర్వాత అధికార బలాన్ని వాడుకొని తెలంగాణకు సీలేరు నుంచి పవర్‌కట్ చేయించారు. శాసన సభ్యులతో మంత్రులతో అధికారులతో పోలీసు బలగాల సహాయంతో కత్తులు, కొడవళ్ళతో, లాఠీలతో జనాన్ని తీసుకుపోయి ఆర్‌డీఎస్, శ్రీశైలం, సాగర్ గేట్లను తెరచి నీళ్ళు తోడుకపోయారు. మూడు లక్షల ఎకరాల తెలంగాణ భూభాగాన్ని అర్ధరాత్రి చెప్పాచేయక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నాడు. పోలవరం డ్యాం ఎత్తును పదే పదే కేంద్ర అనుమతులు లేకుండా పెంచుకుంటూ పోతున్నారు. ఇదివరకు అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులకు...శ్రీశైలం,సాగర్ నీరును తరలించుక పోతానంటున్నారు. తెలంగాణలో చేపట్టిన తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులకు అడ్డు కాలేస్తున్నారు.
ఇంతకు ఆంధ్రలో టీడీపీ బలమెంత? ఆ ప్రభుత్వం చివరి వరకు నిలుస్తుందా? అనుమానమే. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన కాంగ్రెస్ గుంపు, బీజేపీ, జగన్ గ్రూపు దళితులు, బీసీల కాంబినేషన్ ఆంధ్రా ప్రభుత్వ వ్యాపార రాజకీయ సిండికేట్‌కు వ్యతిరేకంగా జతకట్టే అవకాశం మెండుగా కనిపిస్తున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ కె.ఇ.కృష్ణమూర్తి, దివాకర్ రెడ్డి, బీసీ వర్గాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.కాపులు దళితులు ఏనాడూ బాబు వర్గంతో కలసి నడిచే అవకాశమే లేదు. కాబట్టి బాబు బడాయి అధికారదర్పం చెల్లదు.
బాబుది ఊసరవెల్లి పోలిక. బతుకు దెరువుకు ఎన్నో రంగులు మార్చడం, ఆయన ప్రకృతి. గత రెండు దశాబ్దాలుగా ఆయన జతకట్టని పార్టీ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మజ్లీస్, బీజేపీ, టీఆర్‌ఎస్, మర్రి చెన్నారెడ్డి రెబల్ పార్టీ. అన్ని పార్టీల జెండా మెడనేసుకొని తిరిగిన ఘనత బాబుది. అందుకే బీజేపీ అంత సులభంగా ఆయనను నమ్మదు. బాబును తెలంగాణ బీజేపీ అంటరాని వాడిగా చూస్తున్నది. మొన్న శాసనసభ పోలింగులో కూడా వారి వోటును బీజేపీకి వేయక నోటా ఆఫ్షన్ తీసుకున్నది.
బీజేపీ పొత్తుతో తాను ఎన్ని పాపాలైనా చేసి బయటపడగలనని బాబు నమ్ముతున్నాడు. ఈ మధ్య ఆయన మాటల్లో దురుసు, కాఠిన్యం పెరిగింది. మితిమీరిన నీలుగుడు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఆయన కుసంస్కారంతో కొన్ని కులాలను పేరు పేరున పదే పదే దూషిస్తున్నాడు. దీపం కింది చీకటి దీపానికి కనబడదు. గాజు బంగ్లాలో వున్నవారు బయటకు రాళ్ళు విసిరితే పరిణామాలు ఎట్లుంటాయో తెలియవలసిన అవసరం లేదా?
బాబు నిత్యం వల్లించుతున్న మాట.. ’నేనే తెలంగాణకు కర్త, కర్మ, క్రియను’ అని. తెలంగాణ అభివృద్ధి అంతా నా చలవే. రాష్ట్రాన్ని గతంలో పాలించిన ఏడుగురు ముఖ్యమంత్రులు బూర్గుల, వెంగళరావు, పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, ఎన్‌టీఆర్.. వారెవ్వరూ హైదరాబాద్‌కు ఏమాత్రం అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్ డెవలప్‌మెంట్ అంతా బాబు చలువేనా ? ఎవరైనా నమ్ముతారా?
రాజధాని నిర్మాతలు, హైదరాబాద్ రాజులు ఆసిఫ్ జాహీలు, బహమనీయులు, కాకతీయులు, రెడ్డి రాజులు, వెలమ రాజులు వారెవ్వరూ ఎలాంటి అభివృద్ధి చేయలేదనడం మూర్ఖత్వం, అజ్ఞానం.
తెలంగాణ అభివృద్ధి అంతా నిజంగా చంద్రబాబు నాయుడే చేస్తే ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఎంత పెట్టుబడితో చేశాడు? ఆ పెట్టుబడి మూలధనం ఎక్కడిది? ఆయన చేసిన అభివృద్ధి లిస్ట్ శ్వేత పత్రం ప్రచురించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
దేశంలో క్రైమ్‍ను క్రైమ్‍గా నిర్ధారించడానికి దశాబ్దాల కాలం పడుతున్నది. పట్టుబడ్డ రాజకీయ నాయకులెవ్వరూ స్వయంగా రాజీనామా పెట్టే సంస్కారం మన దేశంలో లేదు. నీలం సంజీవరెడ్డి ఒక్కరు మాత్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక చిన్న పొరపాటు పబ్లిక్‌గా సర్‌ఫేస్ అయితే తనకు తానే రాజీనామా పెట్టారు. సభ్య దేశాల్లో ఈ రివాజును పాటిస్తారు. కోర్టుల చుట్టూ తిరగరు. ప్రభుత్వాన్ని కాపాడమని కాళ్లా వేళ్లా పడరు. రాజీనామా చేస్తే తప్పు చేసిన వారికి శిక్షతగ్గడమే కాకుండా పబ్లిక్ సింపతీ, ఇమేజ్ పెరుగుతుంది. శిక్షపడక ముందే బాబు సభ్య సమాజ సంస్కారాన్ని పాటిస్తే మంచిది. రాజీనామా చేసి తాను తప్పు చేయలేదని రుజువు చేసుకోవడం గౌరవంగా వుంటుంది. ప్రజలు ఆ నిర్ణయాన్ని హర్షిస్తారు, నీరాజనం పలుకుతారు.
-వ్యాసకర్త: సీనియర్ రాజకీయవేత్త
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి