గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 10, 2015

బాబుపై ఎఫ్‌ఐఆర్...!!!???

babu

-లెక్కకు మించిన సాక్ష్యాధారాలతో రంగం సిద్ధం చేసిన ఏసీబీ?
-వీడియో, ఆడియో ఫుటేజ్‌లు, నిందితుల విచారణ అంశాలతో రెడీ
- సెక్షన్ 120 (బీ) ప్రకారం కుట్ర కేసు నమోదుకు అవకాశాలు
- బాబును విచారించేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ బృందాలు
- సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులకు చాన్స్
- ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ డీజీలతో సీఎం కేసీఆర్ భేటీ
- కేసు పూర్వాపరాలు వివరించిన ఉన్నతాధికారులు !
- ట్యాపింగ్ వార్తలను ఖండించిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్


ఓటుకు నోటు కేసులో సంచలన నిర్ణయాలకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయంపై పక్కా ఆధారాలు సంపాదించిన ఏసీబీ అధికారులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది. అంతే కాకుండా సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులుకూడా ఇచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు అవకాశాలు లేకపోలేదని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ఏసీబీ అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. 

ఈ కేసులో లభ్యమైన ఆడియో, వీడియో విజువల్స్, విచారణ సందర్భంగా రేవంత్ అండ్ బ్యాచ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా చంద్రబాబుపై సెక్షన్ 120 బీ (నేర పూరిత కుట్ర విత్ కామన్ ఇంటెన్షన్), పీసీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం కేసులు నమోదు చేసేందుకు లాంఛనాలు పూర్తి చేస్తున్నట్లు ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు చంద్రబాబు నివాసం, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ పోలీసుల భద్రతను తొలగించి.. ఏపీ పోలీసులను నియమించుకోవడం ఆసక్తి రేపుతున్నది. అందులోనూ గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణవాదులపై అరాచకాలకు పాల్పడిన కర్నూలు బెటాలియన్‌ను దిగుమతి చేయడం గమనార్హం. ఇదంతా చంద్రబాబును పట్టి పీడిస్తున్న అభద్రతా భావానికి నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. తన అరెస్టును తప్పించుకునేందుకు ఢిల్లీలో మంతనాలు జరిపేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారన్న అభిప్రాయాలు కూడా విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌లు మంగళవారం రాత్రి కలిశారు. ఓటుకు నోటు కేసుపై చర్చించారని సమాచారం.

ఆ మూడే కీలక ఆధారాలు: స్టీఫెన్‌సన్‌కు రూ.5కోట్లు ఆఫర్ చేసిన రేవంత్.. ఆ సంభాషణలో పదే పదే బాస్, బాబు, చంద్రబాబు అంటూ 72సార్లు చెప్పడం, నేరుగా స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో, తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్టీఫెన్‌సన్ ఫిర్యాదును ఏసీబీ ప్రధాన ఆధారాలుగా తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. రేవంత్ అండ్ బ్యాచ్‌ను నాలుగు రోజులు విచారించిన మరిన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలనుకూడా సేకరించినట్టు తెలిసింది. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఉద్దేశించిన రూ.50లక్షలను ఎవరు సమకూర్చారో ఆధారాలతో ధ్రువీకరించుకున్నట్లు సమాచారం.

అన్ని రకాలుగా విచారించవచ్చు..


ఏదైనా కేసులోగానీ, ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినపుడుగానీ ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తికి నోటీసులు జారీచేసే అధికారం కేసును దర్యాప్తు చేసే అధికారికి సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద ఉంటుందని సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ కుట్ర కేసులో ఎవరినైనా ప్రశ్నించే అధికారం తెలంగాణ పోలీసులకుందని మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములుకూడా స్పష్టంచేశారు. నోటీసులు, సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి, కోర్టు ద్వారా సమన్లు ఇప్పించేందుకు అన్ని అధికారాలు తెలంగాణ ఏసీబీకి ఉన్నాయని పేర్వారం తేల్చిచెప్పారు. రాజధానిలో పోలీసులు మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ పరిధిలోనే పనిచేస్తారని, ఏపీ పోలీసులకు హైదరాబాద్ పోలీసులపై ఎలాంటి అధికారం, పెత్తనం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్యకు కూడా కుట్ర చేసిన బాబుపై క్రిమినల్ కేసు నమోదుచేసి, విచారణ చేసే అధికారం దర్యాప్తు విభాగాలకు చట్టం కల్పించిందని శ్రీరంగారావు తెలిపారు. రేవంత్ చెప్పిన అంశాలు, ఆఫర్‌ను నెరవేరుస్తామని చంద్రబాబే స్వయంగా స్టీఫెన్‌సన్‌కు ఫోన్‌లో చెప్పడం కేసు నమోదుకు వజ్రాయుధంలాంటిదని శ్రీరంగారావు అభిప్రాయపడ్డారు.

ఇక దూకుడుగానే..


ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించి దొరికిపోయిన రేవంత్ అరెస్ట్ అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఏసీబీ ఎక్కడా దుందుడుకుగా వ్యవహరించలేదు. కేసులో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ బాస్ అనే ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబుపై అన్ని సాక్ష్యాధారాలను సేకరించింది. ఇక ఇప్పటినుంచి దూకుడుగానే వెళ్లాలన్న నిర్ణయంతో ఏసీబీ అధికారులున్నట్టు తెలుస్తున్నది. ఈ కేసు వ్యవహారంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. కేసు పూర్వాపరాలపై సీఎంతో చర్చించినట్టు తెలిసింది. చంద్రబాబుకు నోటీసులిచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడమా? లేకా సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్ వేసి కేసులు నమోదు చేసి విచారించాలా? అన్న విషయంలో తమకు కొంత సందిగ్ధం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కేసు నమోదు ఎప్పటికైనా తప్పదని, అందుకు లెక్కకు మించిన ఆధారాలు సాధించామని వారు తేల్చిచెప్పారు.

సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో కొత్తముఖాలు..


రేవంత్ అండ్ బ్యాచ్ కస్టడీ తర్వాత వెలుగులోకి వచ్చిన అనేక సాక్ష్యాధారాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుతో పాటు ఓ రాజ్యసభ ఎంపీ, ఆయనకు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఈవో, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నాయని ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర, శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా కుట్ర చేసినందుకు వారిపై కూడా క్రిమినల్ కేసులను నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు అనుమానిస్తున్న మరికొందరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్పాయి.

ట్యాపింగ్ వార్తల్లో నిజం లేదు: ఏకే ఖాన్


ఏపీ ముఖ్యమంత్రి సహా కొంతమంది ప్రముఖుల టెలిఫోన్లు ట్యాప్ చేసినట్ట్టు కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఖండించారు. అవన్నీ అవాస్తవమని, నిరాధారమైనవని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఏకే ఖాన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ ఒక పారదర్శకమైన విచారణ ఏజెన్సీగా డీజీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. చట్టం పరిధిలోనే నడుచుకుంటుందన్నారు.

అరెస్ట్ భయంలో బాబు.. ఇంటి చుట్టూ సొంత భద్రత


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకున్నట్టు కన్పిస్తున్నది. ఇప్పటిదాకా చంద్రబాబు నివాసం, ఆయనకు చెందిన టీడీపీ కార్యాలయం వద్ద తెలంగాణ పోలీసులే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. రేవంత్‌రెడ్డి అండ్ బ్యాచ్‌పై జరుగుతున్న విచారణ.. ఆ సందర్భంగా బయటికి వస్తున్న కొత్త విషయాలు, ఈ వ్యవహారానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు ఏసీబీ సంపాదిస్తున్న సాక్ష్యాధారాల నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ తప్పదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన రక్షణను సొంత పోలీసులకు అప్పగించినట్లు అర్థమవుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలంటూ ఏపీ ఉన్నతాధికారులు ఒత్తిడితీసుకువచ్చారు. ఆ సిబ్బంది విధులు ముగించుకోకముందే కర్నూలు బెటాలియన్‌కు చెందిన ఒక కంపెనీ (128 మంది) సిబ్బందిని రంగంలోకి దించారు.

ఆంధ్రా గ్రేహౌండ్స్ విభాగం నుంచి 35 మందిని, ఉగ్రవాద, తీవ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వాడాల్సిన ఆక్టోపస్ యూనిట్‌నుంచి సైతం 45 మందిని చంద్రబాబు ఇంటి వద్ద కాపలాకు దించారు. అత్యంత పటిష్టమైన ఆక్టోపస్‌ను స్వంత లాభానికి వాడుకోవడం వివాదాస్పదమేనని సీనియర్ ఐపీఎస్‌లు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చంద్రబాబు ఇంటి వద్ద బుధవారం నుంచి 250 మందికి పైగా ఏపీ పోలీసులను భద్రతలో చంద్రబాబు నిమగ్నం చేసినట్టు ఆ రాష్ట్ర పోలీస్ వర్గాలద్వారా తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని పాత ఇంటినుంచి చంద్రబాబు ఇటీవలే మరో ఇంట్లోకి మారారు. ఆ రెండు ఇండ్ల వద్ద భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. అరెస్ట్ సమయం వచ్చినా, లేదా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చినా అనుమతివ్వకుండా తెలంగాణ పోలీస్ అధికారులను అడ్డుకోవడం లేదా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగేవారిపై దాడులకు తెగబడటమే టార్గెట్‌గా ఈ బెటాలియన్లను రంగంలోకి దింపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అరాచకానికి అడ్రస్ కర్నూలు బెటాలియన్!


కర్నూలు స్పెషల్ పోలీస్ బెటాలియన్ అంటే పోలీస్ శాఖలో అరాచకం అనే పేరుందని తెలంగాణ పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న సమయంలో ఓయూతో పాటు అసెంబ్లీ, సెక్రటేరియేట్ పరిసర ప్రాంతాల్లో ఈ బెటాలియన్ ఫోర్స్‌నే ఆంధ్రా పాలకులు రంగంలోకి దించి దాడులకు పాల్పడ్డారని వారు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్‌పై వివక్షేంటి?


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పోలీస్ శాఖను అవమానపరిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన జరిగిన ఏడాదినుంచి రాజధానిలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. అలాంటిది.. ఉన్నపళంగా ఏపీ సీఎం నివాసాలు, కార్యాలయాల వద్ద విధుల నుంచి తెలంగాణ పోలీసులను తప్పించారు. ఏపీ సీఎంపై ఆరోపణలు వస్తే తెలంగాణ పోలీసులను తొలగించడం ఇక్కడి పోలీసులను అవమానపర్చడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి