గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 22, 2015

వినాశ కాలే...విపరీత బుద్ధిః..!!!



ఇవాళ చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీథుల్లోకి ప్రజలను రప్పించాలని చూస్తున్నాడు. ఆయన వందిమాగదులు మీడియా సమావేశాలు పెట్టి బస్తీమే సవాల్ అంటున్నారు. ఇష్టారాజ్యంగా పేలుతున్నారు. ఒకనాడు సీఎం కుర్చీ కోసం హైదరాబాద్‌లో నరమేధం సృష్టించిన చరిత్ర సీమాంధ్రులది. కాళ్లు కడిగిన మామను పొట్టనబెట్టుకుని కుర్చీలు ఎక్కిన చరిత్ర వారిది. మళ్లీ అదే జరగాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడే తెలంగాణ ప్రజలు విజ్ఞత చూపించాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి. ఏడాది కాలంగా నగరంలోని ఆంధ్రులతో కలిసిమెలిసి జీవించి సాధించిన ప్రశాంతతను భగ్నం కాకుండా చూసుకోవాలి. 

1975 నాటి మాట. ఒక ఎన్నికల కేసులో అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధాని ఇందిర ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆమె తప్పుకోవాలంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చాయి. తన పదవికి ఎసరు వచ్చే సరికి ఆమె ఎమర్జెన్సీ విధించారు. పత్రికలపై సెన్సార్‌షిప్ పెట్టారు. ప్రతిపక్షనేతలందరినీ అరెస్టు చేయించారు. ఆ సందర్భంగా సంపూర్ణ విప్లవ సారథి లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ అన్న మాట. "వినాశకాలే...విపరీత బుద్ధిః" ... అని! ఆ మాట అక్షర సత్యమైంది. 

పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులే పుడతాయి. చంద్రబాబు ఇందుకు మినహాయింపు కాదు. శ్రీ కృష్ణ జన్మస్థానానికి అడుగు దూరంలో ఉన్న చంద్రబాబులో తనను తాను రక్షించుకోవడం కోసం ఎంతకైనా వెళ్లాలన్న తెగింపు కనిపిస్తున్నది. చట్టాలన్నింటికీ తాను అతీతుడినని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్రాపోలీసులు టీ-న్యూస్‌కు అక్రమ పద్ధతుల్లో నోటీసులు ఇవ్వడాన్ని ఇదే కోణంలో చూడాలి. ఓం ప్రథమంగా ఓటుకు నోటు కేసులో తన ఆడియో బయటపడగానే విజయవాడ సభలో ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు తార్కాణం. తన ఫోన్ ఎట్లా ట్యాపింగ్ చేస్తారని పెడబొబ్బలు పెట్టారు. 

తాను ఐదుకోట్ల ఆంధ్రులకు ముఖ్యమంత్రినని హుంకరించారు. తన సమస్యను మొత్తం సీమాంధ్ర సమస్యగా మార్చాలని యత్నించారు. మీ ముఖ్యమంత్రిని అవమానించడం మీరు సహిస్తారా? అంటూ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి వీధుల్లోకి తేవాలని యత్నించారు. దబాయించి భయపెట్టి బయటపడాలని చూశారు. కానీ అది ఫలించలేదు. చంద్రబాబు పిలుపులకు ఎక్కడా ప్రతిస్పందన లేకపోగా పట్టపగలు బహిరంగంగా దొరికిపోయిన దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో టీడీపీ శ్రేణులకు ప్రజల ముందుకు వెళ్లాలంటేనే ముఖం చెల్లని స్థితి ఏర్పడింది. పైపెచ్చు అక్కడి ప్రతిపక్షాలు వీధుల్లోకి రావడంతో మింగలేని కక్కలేని స్థితి ఏర్పడింది. 

తన బాగోతం వెల్లడించే వీడియాలు ప్రసారం చేస్తున్నారన్న ఆగ్రహంతో సీమాంధ్రలో ఓ టీవీ చానెల్ ప్రసారాలు కూడా నిలిపివేశారు. మరో టీవీ ప్రసారాలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. తర్వాత ఢిల్లీనుంచి నరుక్కురావాలని హస్తిన యాత్ర జరిపారు. హోంమంత్రినుంచి ప్రధాని దాకా పొర్లు దండాలు పెట్టారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో కష్టాలు అన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని కోరారు. ఆయన ఎన్ని దండాలు పెట్టినా అప్పటికే అన్ని విషయాలు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న కేంద్రం ఈ బురద తాము పూసుకోలేమంటూ చేతులెత్తేయడంతో కథ అడ్డం తిరిగింది. తమ అవసరానికి చట్టాలను ముందు పెట్టడం, తమకు వ్యతిరేకమైతే వాటి ఉనికిని ప్రశ్నించడం ఫాసిస్టులకు ఆనవాయితీ. 

చంద్రబాబు రాజకీయ జీవితమంతా పాటించింది ఈ పద్ధతే. ఈ సారీ అదే ముందుకు తెచ్చారు. స్టింగ్ ఆపరేషన్లు చెల్లవనే సుప్రీంకోర్టు పాత తీర్పును బయటకు తీశారు. 150 మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంటూ తమ మీడియాను ఉసిగొలిపి గగ్గోలు పెట్టారు. అసలు ఎన్నికల వేళ ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని ఈసీ మాత్రమే విచారణ జరపాలని వాదించారు. ఈసీని కాదని ఏసీబీ దర్యాప్తు ఎలా చేస్తుందని లా పాయింట్ లాగారు. తాను వేరే రాష్ర్టానికి ముఖ్యమంత్రిని అయినపుడు తనకు నోటీసు ఎలా ఇస్తారని దబాయించారు. తనకు డీజీపీ ఉన్నాడు.. ఏసీబీ ఉందంటూ తమ తప్పును నిబంధనల మాటున కప్పిపుచ్చాలని యథాశక్తీ యత్నించారు.

ఏసీబీ వెనక్కి తగ్గకపోవడంతో ఉమ్మడి రాజధానిలో వాటా ఉందనే వింత వాదన తెచ్చారు. ఏడాది క్రితం పక్కన పడేసిన సెక్షన్ 8 మళ్లీ ముందుకు తెచ్చారు. గవర్నర్‌ను కలిసి కేంద్రానికి సిఫారసు చేయాలని రాయబారాలు నడిపారు. అయితే గవర్నర్ నిబంధనల ప్రకారం తన పని తాను చేసుకుపోవడంతో తన మంత్రులను ఉసిగొలిపి నరసింహన్‌పై అడ్డగోలు విమర్శలతో యుద్ధానికి దిగారు. 


చివరకు కథ అడ్డం తిరిగినా.. కేంద్రం గవర్నర్‌పై వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమైనా పద్ధతి మార్చుకోవడం లేదు. అంటే ఒక్క చంద్రబాబును కాపాడడం కోసం హైదరాబాద్‌లో సెక్షన్-8 పెట్టాలి. ఒక్క బాబు కోసం స్టింగ్ ఆపరేషన్ల పేరిట రేవంత్ వీడియోను చెల్లదని ప్రకటించాలి. ఒక్క ఏపీ సీఎం కోసం ఫోన్ల ట్యాపింగ్ చట్ట విరుద్ధమంటూ బాబు ఆడియో పక్కన పడేయాలి...అంటే తన ఒక్కడి కోసం దేశంలో చట్టాలు మారిపోవాలి. నిబంధనలు మారిపోవాలి.. ఏం చేసైనా కేసులోంచి బయటపడాలి.. అదొక్కటే ఆయన లక్ష్యం. 

ఈ దిశగానే ఏపీ పోలీసులను హైదరాబాద్‌లో దింపారు. పోలీసు స్టేషన్లు కూడా తెరుస్తామన్నారు. ఇక్కడ ఆంధ్రులకు రక్షణ లేదన్నారు. ఇండ్లు కూల్చి వేస్తున్నారని కన్నీరు కార్చారు. గవర్నర్‌ను గంగిరెద్దు అన్నారు. రెండు కండ్లు.. ఇద్దరు కొడుకులు సిద్ధాంతాన్ని విసిరేసి సీమాంధ్ర రక్షకుడి రూపం దాల్చారు. కానీ విధి బలవత్తరమైంది. గవర్నర్‌పై విమర్శలు ఎదురుతన్నాయి. పోలీసుల అంశం వివాదాస్పదమైంది. దీనితో ఈసారి గవర్నర్‌ను వదిలి నేరుగా తెలంగాణపైనే యుద్ధం పెట్టుకున్నారు. తెలంగాణ టీవీకి నోటీసు పంపించారు. ఇంకా అనేక పత్రికలకు నోటీసులిస్తానని బెదిరింపులకు దిగారు. 

తెలంగాణ గడ్డమీద తెలంగాణ టీవీకి నోటీసు ఇవ్వడం ద్వారా.. అందుకు సీమాంధ్ర పోలీసులను పంపించడం ద్వారా చంద్రబాబు తెలంగాణ మీద యుద్ధ ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించాలనే ఎత్తుగడ ఇందులో కనిపిస్తున్నది. ప్రజలు వీధుల్లో ఘర్షణలకు దిగాలని పరిస్థితి అదుపు తప్పాలని బాబు లాబీ కోరుకుంటున్నది. తర్వాత కేంద్రం జోక్యం ద్వారా రాజీ కుదురుతుందనే ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తున్నది. ఇదే క్రమంలో ఆయన తప్పు మీద తప్పు చేస్తున్నారు. మత్తయ్యను విజయవాడ తరలించడం, కేసు నమోదు చేయడం, హైదరాబాద్‌లో పోలీసులను దింపడం, గవర్నర్‌ను దూషించి దొరికిపోవడం, తన పరిధిలో లేని రాష్ట్రంలో నోటీసులు ఇవ్వడం ఇలా వరుస తప్పిదాలు చేసుకుంటూ పోతున్నాడు. 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. అది అవసరం కూడా. చంద్రబాబు లాంటి వారిని శిక్షించడం చాలామంది భావిస్తున్నట్టు అంత తేలికేం కాదు. చంద్రబాబు అంటే వ్యక్తి కాదు.. ఒక లాబీ. ఒక బలమైన మూక. అనేక వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న మాఫియా. వారి కనుసన్నల్లో అధికార యంత్రాంగం, పెట్టుబడిదారీ వర్గం, మీడియా, ముసుగు ప్రజాసంఘాలు పని చేస్తున్నాయి. రైతుల పేరుతో మొదలు కొని సమాజంలోని సమస్త వర్గాల పేరిట వారి కనుసన్నల్లో పనిచేసే సంఘాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. చివరికి తెలంగాణ ముసుగులో కూడా వారి ప్రయోజనాలు రక్షించే సంఘాల దుకాణాలు అనేకం ఉన్నాయి. 

చూడడానికి అవి సీమాంధ్రులను విమర్శించినట్టే కనిపిస్తాయి. కానీ వారికి ఇబ్బందులు రానీయవు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను ప్రణాళికాబద్ధంగా దిగజార్చుతూ ఉంటాయి. ఇవాళ చూడండి. తెలంగాణ శాసనసభ్యులను దారుణంగా అవమానపరిచిన కొన్ని మీడియా సంస్థలను ఎంఎస్‌ఓలు బహిష్కరిస్తే మిన్నూ మన్ను ఏకం చేసి మహిళలను ముందు పెట్టి ఉద్యమాలు నడిపిన మీడియా సంస్థలు ఇవాళ సీమాంధ్రలో ఓ టీవీని నిషేధిస్తే కిమ్మనవు. రెండు పత్రికలను చంద్రబాబు ఏడాది కాలంగా బహిష్కరించినా పట్టనట్టు ఉంటాయి. అంతేకాదు..ఎక్కడో ఢిల్లీలో బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయల తీసుకుని పట్టుబడితే టేపులు అరిగేదాకా ప్రసారాలు చేస్తాయి. 

గుజరాత్‌లో నరమేధం మీద, యూపీఏ కుంభకోణాల మీద చర్చల మీద చర్చలు పెడతాయి. ఇవాళ రేవంత్ చంద్రబాబు వీడియాలు ఆడియోలను మాత్రం ప్రసారం చేయబోవు. వాటిని అసలు చర్చించవు. పైపెచ్చు తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్, హైదరాబాద్‌లో సెక్షన్-8 అంటూ రోజుకో కథనంతో తెలంగాణ ప్రజల్లో కలవరం పుట్టిస్తాయి. సీమాంధ్ర నేతలను కూర్చోబెట్టి తీర్పులు ఇప్పిస్తాయి. రాజకీయపార్టీల పద్ధతి అంతే.. చిన్నచిన్న సమస్యలపై తెలంగాణ ప్రజలను వీధుల్లోకి తెచ్చిన పార్టీలు ఇవాళ బాబు దొంగతనం మీద ఒక్క ధర్నా కూడా చేయవు. ఒక్క కార్యక్రమం చేపట్టవు. కేసీఆర్ పాలనపై మీటింగుల మీద మీటింగులు పెట్టి జడ్జిమెంట్లు ఇచ్చిన ప్రజాసంఘాలు బాబు దొంగతనం మీద పల్లెత్తి మాట్లాడవు. 

చాలామందికి కనీసం ఖండించే ధైర్యం కూడా ఉండదు. కొన్నేళ్ల క్రితం ఓ సినీ నటుడు తన ఇంట్లో నిర్మాతపై పట్టపగలు తన సొంత రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నానా గొడవా అయింది. నెత్తుటి మడుగులో ఉన్న సదరు నిర్మాతకు హాస్పిటల్‌లో చేర్పించి అపరేషన్ చేసి బుల్లెట్లు బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రివాల్వర్‌తో పాటు కాల్పులు జరిగిన ప్రదేశంలో నటుడి భార్య రక్తపు మరకలు తుడిచి పారవేయించిన గుడ్డలు కూడా స్వాధీనపరుచుకున్నారు. బుల్లెట్లు ఉన్నాయి. రివాల్వర్ ఉంది. నెత్తుట్లో తడిసిన గుడ్డలు ఉన్నాయి. కాల్పులు జరిగినట్టు ఇన్ని ఆధారాలున్నాయి. 

అయినా సరే చిత్రంగా ఆ నటుడు కనీసం జైలు ముఖం కూడా చూడకుండా బయటపడ్డాడు. నాలుగు రోజులు హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుని దర్జాగా ఇంటికి వెళ్లిపోయాడు. అందుకు కావల్సిన పత్రాలను బాబు లాబీ కనుసన్నల్లోని వ్యవస్థలు అందించాయి. కీలక పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు అందించాయి. అన్ని వ్యవస్థలు కట్టగట్టుకుని పోటీపడి సహకరించాయి. న్యాయస్థానంలో కూడా చాలా వేగంగా కేసును కొట్టేశారు. ఇపుడతడు ప్రజాప్రతినిధి. సరిగ్గా అదే లాబీ ఇపుడు చంద్రబాబును రక్షించేందుకు రంగంలోకి దిగింది. మత్తయ్య లాంటి పరారీలో ఉన్న నేరస్తుడికి గంటల వ్యవధిలో స్టే దొరకడం దానికి తార్కాణం.


కేసును సీబీఐకి మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సదరు లాబీలు సమాజంలోని అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాయి. అందుకే బాబును ఎక్కడన్నా ఓడించవచ్చు..కానీ ఫలానా చోట మాత్రం ఓడించడం అసాధ్యం అని ఉమ్మడి రాష్ట్రంలో ఒక నానుడి ఉండేది. అందుకే ఎన్ని జాతీయ చానెళ్లు ఆయన అవినీతిని గురించి కోడై కూసినా ఏం చేయలేకపోయాయి. 

ఇవాళ కూడా ఏసీబీ కోర్టు దాటే వరకే కేసీఆర్ ఏదైనా చేయగలిగేది... అని ఓ టీటీడీపీ నాయకుడు జనాంతికంగా చెబుతున్నాడంటే..ఇంత జరిగినా ఇన్ని ఆధారాలున్నా బాబు బ్యాచ్ ధీమాగా తిరగగలుగుతున్నదంటే సదరు లాబీ ఏయే వ్యవస్థల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బాబు లాబీ లక్ష్యం ఒకటే కేసును సీబీఐకి బదలాయించడం. తద్వారా కేంద్రంలో పలుకుబడి వినియోగించి బయటపడడం. బీజేపీలో ఓ వృద్ధనాయకుడి వద్ద విశేష పలుకుబడి ఉన్న ఈ వర్గం ఆయనను దువ్వుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అందుకే ఏసీబీ జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తున్నది. ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరిస్తున్నది. నిందితుల వివరణలు తీసుకుంటున్నది. వీడియో, ఆడియో టేపుల పరిశీలనలో వాస్తవాలు తారుమారు చేయాలని వేసిన బాబు ఎత్తుగడను చిత్తు చేస్తూ మూడు రాష్ర్టాల ఫోరెన్సిక్ విభాగాలకు వాటిని పంపించింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా బాబు కవ్వింపులకు ఏ మాత్రం చలించకుండా తన పని చేసుకుపోతున్నది. ఏపీ పోలీసులు తెలంగాణలో ప్రవేశించినా అరెస్టు చేయకుండా వదిలేసింది. కేంద్రానికి నివేదించడం ద్వారా బాబు సర్కారును ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. అందుకే ఇవాళ చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీథుల్లోకి ప్రజలను రప్పించాలని చూస్తున్నాడు. 

ఆయన వందిమాగదులు మీడియా సమావేశాలు పెట్టి బస్తీమే సవాల్ అంటున్నారు. ఇష్టారాజ్యంగా పేలుతున్నారు. ఒకనాడు సీఎం కుర్చీ కోసం హైదరాబాద్‌లో నరమేధం సృష్టించిన చరిత్ర సీమాంధ్రులది. కాళ్లు కడిగిన మామను పొట్టనబెట్టుకుని కుర్చీలు ఎక్కిన చరిత్ర వారిది. మళ్లీ అదే జరగాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడే తెలంగాణ ప్రజలు విజ్ఞత చూపించాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి. ఏడాది కాలంగా నగరంలోని ఆంధ్రులతో కలిసిమెలిసి జీవించి సాధించిన ప్రశాంతతను భగ్నం కాకుండా చూసుకోవాలి. అడ్డంగా దొరికిపోయిన దొంగలు జైలు ఊచలు లెక్కించేదాకా ఆవేశాన్ని అణచుకొని సంయమనం పాటించడం ఇపుడు మనందరి కర్తవ్యం. 

ధర్మం జయించుగాక! అధర్మం నశించుగాక!! 


- సవాల్‌రెడ్డి



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి