గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 19, 2015

వీటికి అనుమతులేవి బాబూ...?

-తెలంగాణ ప్రాజెక్టులంటే కండ్లల్లో నిప్పులా?
-బేసిన్‌లో లేకున్నా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర మీది
-జలదోపిడీకి సింగిల్ విండోగా పోతిరెడ్డిపాడు
-ఒక్క శ్రీశైలం నుంచే ఆరు ప్రాజెక్టులు!
-జల సంఘం అనుమతి లేదు.. బచావత్ అవుననలేదు పర్యావరణ, హైడ్రాలజీ ఆమోదాలూ లేవు
-ఎగువ రాష్ర్టాల అభ్యంతరాలనూ వినలేదు
-60 ఏండ్లుగా సాగుతూ వస్తున్న మాయా జలం
-హక్కులున్న తెలంగాణ ప్రాజెక్టుల మీద గగ్గోలు
-తెలంగాణకు నీరడ్డడమే లక్ష్యం



మీ భూమిలో మీరు పంట వేసుకుంటే అన్యాయం.. అక్రమం! మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే ఘోరం.. నేరం. అదే మేం పరుల భూమిని ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తే మాత్రం భేష్. పక్కింటి వాళ్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఆహా, ఓహో!.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనల తీరు. అసలు అక్రమ ప్రాజెక్టులు అంటే ఏమిటో చంద్రబాబుకు గానీ, ఆయనకు భజన చేసే ఈనాడుకు గానీ తెలుసా అన్న సందేహం కలుగుతున్నది. ఎలాంటి అనుమతులు లేకపోయినా, కనీసం బేసిన్‌లో లేకపోయినా, ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోయినా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జబర్దస్తీగా నిర్మించుకోవడాన్ని అక్రమ ప్రాజెక్టులు అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఎలాంటి అధికారం లేని, కనీసం బేసిన్‌లో కూడా లేని ప్రాంతాల్లో, జల సంఘం, బచావత్, పర్యావరణ, హైడ్రాలజీ సహా ఏ అనుమతులు లేకుండానే సీమాంధ్రులు భారీ ప్రాజెక్టులను నిర్మించుకున్నారు. వాటికి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీల్లో కృష్ణా జలాలను దోచుకెళ్లిపోతున్నారు. ఇదంతా సీమాంధ్రకు మేలు చేసేది కాబట్టి.. ఏపీ సీఎం చంద్రబాబుకు గానీ ఆయన భజన బృందానికి గానీ అది తప్పుగా అనిపించడం లేదు. కానీ కృష్ణా బేసిన్‌లో ఉండి.. సర్వహక్కులు కలిగిన తెలంగాణలో ఇవాళ ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటే చాలు ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయినట్లు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా బేసిన్‌లో లేని ప్రాంతాలకు ఆ నదీజలాల్లో 52 శాతం నీటిని పట్టపగలు బహిరంగంగా దోచుకుని తీసుకు వెళుతున్న విషయం ఆ ప్రాంత పాలకులకు తెలియదా?


potireddypadu

పోతిరెడ్డిపాడు..: చెన్నై (ఒకప్పటి మద్రాస్)కి తాగునీటి పేరుతో మొదలైన కృష్ణా జలాల తరలింపు సీమాంధ్ర నీటి దోపిడీకి రాజమార్గంగా మారింది. తెలంగాణ బిడ్డ, దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) బతికి ఉన్నంత కాలం పోతిరెడ్డిపాడుని వ్యతిరేకిస్తూనే వచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ దోపిడీ విశ్వరూపం దాల్చింది. అప్పటి వరకు పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్రకు రోజుకు 11 వేల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వెళుతుండగా, వైఎస్ దానిని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడుని తొలుత నాలుగు స్లూయిస్‌లతో నిర్మించగా వైఎస్ కొత్తగా మరో 10 స్లూయిస్‌లు నిర్మించారు. కొత్తవి నిర్మించగానే పాత స్లూయిస్‌లను మూసి వేస్తామని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ ప్రాంతానికే చెందిన పొన్నాల లక్ష్మయ్య సెలవిచ్చారు. కానీ నిర్మాణం జరిగిన తర్వాత, అటు పాతవి, ఇటు కొత్తవి యధావిధిగా కొనసాగుతున్నాయి తప్ప లక్ష్మయ్యగారు కిమ్మనలేదు. ఫలితంగా ఇవాళ రోజుకి 55 వేల క్యూసెక్కులు తరలిపోతున్నాయి. అంటే రోజుకు 5 టీఎంసీల చొప్పున నెలకు 150 టీఎంసీలు. పోతిరెడ్డిపాడు నుంచి 18 కి.మీ దూరంలో బనకచర్ల రెగ్యులేటర్ ఉంది. ఈ 18 కి.మీ లైనింగ్ చేస్తే రోజుకి కనీసం 13 టీఎంసీలు తరలించుకుపోయే ప్రమాదం ఉందని తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నమస్తే తెలంగాణతో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు 45 వరద రోజులుగా ఉంటే వైఎస్ వచ్చిన తర్వాత 30 రోజులకు కుదించారు.


ఒక్క ప్రాజెక్టుకూ అనుమతి లేదు..


కృష్ణా వరద జలాలపై కేవలం శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఆర్‌బీసీ)కి తప్ప మిగిలిన సీమాంధ్రలోని ఒక్క ప్రాజెక్టుకు అటు బచావత్ నుంచి కానీ ఇటు కేంద్రం జల సంఘం నుంచి, పర్యావరణ శాఖ, హైడ్రాలజీ తదితర ఏ ఒక్క విభాగం నుంచి అనుమతులు లేవు. ఏవీ లేకుండానే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగోడు, తెలుగుగంగ, కేసీ కెనాల్, కేసీ కెనాల్ లిఫ్ట్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించారు. ఇందులో వెలుగోడు ఒక్కటే ప్రస్తుతం చివరి దశలో ఉంది. 


కేసీ కెనాల్ కట్టుకథ...


కేసీ కెనాల్ అంటే కర్నూలు-కడప కాలువ. ఇది తుంగభద్ర నది ఆధారంగా నిర్మించారు. దీనికి 39.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. కానీ ఇవాళ వినియోగిస్తున్న జలాలు 70 టీఎంసీలు. ఎలా వచ్చాయి? పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు వెళ్లిన తర్వాత ఎడమ వైపు తెలుగు గంగకు, కుడివైపు ఎస్‌ఆర్‌బీసీకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నుంచి నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించుకున్నారు. సీమాంధ్ర పాలనలోనే కొత్తగా కేసీ కెనాల్ లిఫ్ట్ అంటూ మరో 10 టీఎంసీలు కూడా కేటాయించుకున్నారు. అప్పట్లో జపాన్ బ్యాంక్ ద్వారా రూ.1200 కోట్ల నిధులు పొంది కెనాల్‌ను ఆధునీకరించుకున్నారు. ఫలితంగా 8 టీఎంసీల నీళ్లు మిగులుతాయని అంచనా వేశారు. అంటే వాస్తవ కేటాయింపు 39 టీఎంసీలు 31.9 టీఎంసీలకు తగ్గాలి. కానీ వాస్తవ వాడకం చూస్తే కేసీ కెనాల్‌కు సుమారు 70 టీఎంసీల నీరు మళ్లించుకుంటున్నారని తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఎక్కడ 39.9 టీఎంసీలు? ఎక్కడ 70 టీఎంసీలు? ఉమ్మడి రాష్ట్రంలో అడిగేవాళ్లు లేక ఇష్టారాజ్యం కొనసాగింది.


ఏ నీరైనా ప్రవహించేది అటే..


రీ-జనరేటడ్ వాటర్ కింద బచావత్ ట్రిబ్యూనల్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11 టీఎంసీలు కేటాయించింది. న్యాయంగా వీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి. అయితే ఈ 11 టీఎంసీలు, కేసీ కెనాల్ ఆధునీకరణ వల్ల మిగిలిన 8 టీఎంసీలు. అంటే మొత్తం 19 టీఎంసీలు నాటిపాలకులు ఒక్క ఎస్‌ఆర్‌బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కే కేటాయించుకున్నారు. అప్పట్లో ఎస్‌ఆర్‌బీసీ ఆధునీకరించేందుకు ప్రపంచబ్యాంక్ లోన్ కోసం సీమాంధ్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే బెనిఫిట్ కాస్ట్ రేషియో కింద తీస్తే (అంటే కిలోమీటర్ పారితే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది) ఎస్‌ఆర్‌బీసీ నుంచి 56 కిమీ దూరంలోని గోరకల్లు వరకు ఒక్క ఎకరం కూడా లేదు. దీంతో లోన్ రాలేదు. అప్పుడు ఎస్‌ఆర్‌బీసీకి, తెలంగాణలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీని జోడించి ఏపీ-2 ప్రాజెక్టు కింద లోన్ పొందిన ఘనవీరులు సీమాంధ్రులు. అదే ఎస్‌ఎల్‌బీసీ విషయానికి వస్తే ఇంత వరకు పూర్తి కాలేదు. ఏనాడు ఎస్‌ఎల్‌బీసీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీ కెనాల్‌కు ఇన్ని నీళ్లు పోతున్నా, ఇంకా చాలదన్నట్లు రాజోలిబండపై పేచీకి వస్తరు. 


స్వర్ణముఖి కాదు... చంద్రముఖి


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి పేరిట ఒక నది ఉంది. ఇందులో 365 రోజుల్లో ఒక్క రోజు కూడా నీళ్లు ఉండవు. దీనిమీద బారేజ్ ఉంది. గమ్మత్తుగా చుక్క నీరు ఉండని ఈ నది పరిధిలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇపుడు 42 చెరువులు మండు వేసవిలో కూడా నీళ్లతో కళకళలాడుతుంటాయి. కారణం ఏమిటంటే... మద్రాస్‌కు తాగునీరు పేరుతో తీసుకెళుతున్న తెలుగు గంగ కాలువకు లింకులు ఏర్పాటు చేసుకుని నింపుకుంటున్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే కష్టమని ముందుగా ఊహించి సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా వందల కిమీ లింకు కెనాల్స్ నిర్మించుకున్న ఘనత సీమాంధ్ర పాలకులది. 


అక్రమంగా నిర్మించుకున్న రిజర్వాయర్లు..


ఈ ప్రాజెక్టులే కాదు ఎస్‌ఆర్‌బీసీ(శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్)కి కింద అవుకు (5 టీఎంసీ), గోరకల్లు (20 టీఎంసీ), గాలేరు-నగరి ప్రాజెక్టు కింద చిత్రావతి (10 టీఎంసీ), గండికోట (10 టీఎంసీ), బ్రహ్మంగారి మఠం (30 టీఎంసీ), వెలిగోడు (12 టీఎంసీ)... ఇవన్నీ అనుమతులు లేకుండా నిర్మించుకున్న రిజర్వాయర్లే. పైకి ఎన్ని కథలు చెబుతున్నా.. ఇవన్నీ కృష్ణా జలాలపై ఆధారపడినవే. వీటన్నింటికీ మూలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ. 1,90,000 ఎకరాలు ఆయకట్టు ఉన్న ఎస్‌ఆర్‌బీసీకి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని కేటాయించుకున్న సీమాంధ్ర పాలకులు, 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న తెలంగాణ పరిధిలోకి వచ్చే ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్)కి మాత్రం రోజుకి 4 వేల క్యూసెక్కులు మాత్రమే కేటాయించారు. 


శ్రీశైలం కబ్జాకు యత్నం..


ఈ ఘోరాలు అన్ని చాలవన్నట్లు 2011లో శ్రీశైలం డ్యామ్‌ను పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం కూడా జరిగింది. దానిని గుర్తించి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో తోక ముడిచారు. శ్రీశైలం ఎగువ భాగాన సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది ఇరుకైన కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంది. అక్కడ వీయర్ (బ్రిడ్జి) నిర్మించి సుమారు 50 టీఎంసీల నీరు ఎప్పుడూ ఉండేలా చూడాలని సీమాంధ్ర పాలకులు ఎత్తుగడ వేశారు. అంటే 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చిన తర్వాతే శ్రీశైలం డ్యామ్‌లోకి నీరు వెళుతుంది. లేదంటే సిద్ధేశ్వరం దగ్గరే నిలుపుకుని వీయర్ ద్వారా సీమకు నీళ్లు మళ్లించుకోవచ్చు. 


తెలంగాణ వాడుతున్నది 1 టీఎంసీ మాత్రమే


బేసిన్‌లోని లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు శ్రీశైలంనుంచి వందలు, వేల టీఎంసీలు నీళ్లు పోతుంటే, కృష్ణా బేసిన్ ఉండి, నికల జలాలు, వరద జలాలపై పూర్తిగా హక్కు కలిగిన తెలంగాణ బిడ్డలు ఇప్పటి వరకు వాడుకుంటున్నది ఎంతో తెలుసా? కేవలం ఒక్క టీఎంసీ మాత్రమే. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం! కృష్ణా నికర, వరద జలాలపై ఆధారపడి తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి తప్ప ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు. కల్వకుర్తి కూడా ఒక పంపుని ట్రయిల్ రన్ పేరుతో నడుపుతున్నారు. ట్రయిల్ రన్ పేరుతో శ్రీశైలం నుంచి గత ఏడాది కాలంగా ఇప్పటి వరకు కేవలం ఒక టీఎంసీ మాత్రమే వాడుకున్నారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో తెలంగాణ 56 శాతం మునిగిపోతే , ఆంధ్రా 44 శాతమే ముంపునకి గురైంది. 


ఏమిటీ వివిక్ష ?


కృష్ణా బేసిన్‌లో లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు ... బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల కేటాయింపులు ఇవి.
ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా పరిధిలో రిజర్వాయర్లు ప్రతిపాదనల్లో ఉన్నప్పటికీ... ఇంత వరకు ప్రాజెక్టులే పూర్తి కాకపోతే, ఇక రిజర్వాయర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బేసిన్‌లో లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు 30 వరద రోజులు పెట్టుకుని, తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం 90 రోజులు కేటాయించడంలో సీమాంధ్ర పాలకుల కుటిలతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
అంటే 30 రోజుల వరద నీటి వల్ల ప్రాజెక్టులను వెంటవెంటనే త్వరగా నింపుకోవచ్చు. అదే 90 రోజులు అంటే చాలా ఆలస్యం అవుతుంది.


ఇదిగో అక్రమాలు..


listt

పెన్నా నదిని ఆధారం చేసుకుని సోమశిల ప్రాజెక్టు నిర్మించామని సీమాంధ్ర పాలకులు చెప్తుంటారు. 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిలకు 50 టీఎంసీలు శ్రీశైలం నుంచే తరలిస్తున్నారు. కండలేరు ప్రాజెక్టును సమీపంలోని వాగుని ఆధారంగా చేసుకుని నిర్మించామంటారు. ఆ వాగులో కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే లభ్యమవుతుంటే ప్రాజెక్టును మాత్రం 68 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. మిగిలిన నీరెక్కడినుంచి వస్తుంది? ఇక గాలేరు-నగరి..గాలేరు అనే నది కర్నూలు జిల్లాలో ఉండగా, నగరి అనేది చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ రెండు నదులను కలుపుతూ నిర్మించారేమో అనుకోవద్దు.. ఇదీ కృష్ణా జలాలు మింగేయడానికే. సీమాంధ్ర కదా కృష్ణమ్మ పోతిరెడ్డిపాడు నుంచి 390 కి.మీ దూరంలో ఉన్న నగరి వరకు బిరాబిరా వెళుతుంది. అలాగే హంద్రినీవా. హంద్రి కర్నూలు జిల్లాలో ఉంటే, నీవా చిత్తూరు జిల్లాలో ఉన్న నది. ఇక్కడికి కూడా కృష్ణా నది 610 కి.మీ సుదూరం ఉరకలెత్తి ప్రవహిస్తుంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి