గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 26, 2015

దినదినమూ చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు...!!!

-ఇటు ఏసీబీ.. అటు ఈసీ.. ఫోరెన్సిక్ రిపోర్ట్ రెడీ..
-లీకులు.. లేఖలపై కేంద్ర హోంశాఖ గుస్సా
- ఓటుకు నోటు కేసులో మూసుకుపోతున్న దారులు
-చంద్రబాబుపై కేసునమోదుకు ఆదేశించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
-కేసులో రంగప్రవేశం చేసిన ఎన్నికల కమిషన్
-ఆడియో, వీడియో టేపులు కావాలంటూ కోర్టులో మెమో
- ఏసీబీ కోర్టును ఫోరెన్సిక్ నివేదిక కోరిన ఏసీబీ
-ఐదు రోజుల్లో కీలక పరిణామాలని సంకేతాలు
- సండ్ర , వేం అరెస్టుకు అవకాశాలు
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తున్నది. ఇప్పటికే ఏసీబీ చుక్కలు చూపిస్తుండగా గురువారం ఎన్నికల కమిషన్ కూడా రంగప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు తమకు కూడా కావాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. 


chandrababunaidu

ఎన్నికల చట్టాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతున్నది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. నోటీసులు, అరెస్టుల పర్వానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఐదురోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దెబ్బమీద దెబ్బగా సెక్షన్ 8 మీద లీకులు, లేఖల మీద కేంద్రం భగ్గుమంటున్నదన్న సమాచారం ఢిల్లీనుంచి అందింది. ఇవి చాలవన్నట్టు రాష్ట్ర గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు పలువురిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్‌బీ నగర్ పోలీసులను ఆదేశించింది. అష్టదిగ్బంధంలో చిక్కుకుని త ప్పించుకునే మార్గం దొరకక బాబు గ్యాంగ్ విలవిలలాడుతున్నది.


దూకుడు పెంచిన ఏసీబీ..


ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. కేసులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరడంతో తదుపరి చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం గురువారం కోర్టులో మెమో దాఖలు చేసింది. నివేదిక ఆధారంగా నోటీసుల జారీ, అరెస్టులతో దూకుడు పెంచనున్నట్టు తెలిసింది. రానున్న ఐదు రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఓ అధికారి చెప్పారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీద ప్రస్తుతం ఏసీబీ దృష్టి పెట్టింది. అనారోగ్యం సాకుతో ఆయన అడిగిన గడువు పూర్తి కావస్తున్నది. ఆ వెంటనే ఏసీబీ ముందుకు రాని పక్షంలో అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలిసింది. అలాగే కేసులో ప్రధాన లబ్ధిదారు వేం నరేందర్‌రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. 


ఏసీబీ కోర్టులో ఈసీ మెమో..


ఈ కేసులో వీడియో, ఆడియో, తదితర ఎక్విప్‌మెంట్లు, వాటి రికార్డ్ కాపీలు తమకు కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ గురువారం ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఉప ప్రధాన ఎన్నికల అధికారి శ్రీదేవసేన అల్లంరాజు మెమో దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గతనెల 31వ తేదీన ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఈ నెల మొదటి వారంలోనే ఏసీబీ అధికారులను కోరింది. అప్పటికే ఏసీబీ అధికారులు ఆధారాలు, సాక్షాలు, వీడియో, ఆడియో టేపులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీంతో వారు ఏసీబీ కోర్టుకు వచ్చారు. 


babu-revanth

ఎన్నికల అధికారి దాఖలు చేసిన మెమోను కోర్టు స్వీకరించింది. తమ వద్ద టేపులు రికార్డు చేసేందుకు ఎలాంటి పరికరాలు ఉండవని, పేపరు రూపంలో ఉన్న డాక్యుమెంట్ పత్రాల జిరాక్స్ కాపీలను ఇస్తామని కోర్టు చెప్పింది. ఈ కాపీలను కోర్టు శుక్రవారం ఇచ్చే అవకాశం ఉంది.


సీల్డ్ కవర్లలో ఏముందో పరీశీలిస్తాం: న్యాయమూర్తి లక్ష్మీపతి


మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అందజేసిన నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కూడా గురువారం కోర్టుకు వచ్చారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు సీల్డ్ కవర్‌లో వివరాలు ఇచ్చారు.. వాటిలో ఏముందే పరిశీలించాలి... శుక్రవారం మధ్యా హ్నం తర్వాత పరిశీలిస్తామని న్యాయమూర్తి లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ కేసులో ఏసీబీ పంపిన ఆడియో, వీడియో టేపులు, హార్డ్‌డిస్క్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలించింది. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ట్రాన్సిప్షన్ సదుపాయం లేదు. అందువల్ల ట్రాన్సిప్షన్ చేయించే అవకాశం ఇవ్వాలని, అందుకు పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సమర్పించిన మూడు టేపులు, హార్డ్ డెస్క్ నకలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు గత వారం కోర్టులో మెమో దాఖలు చేశారు.


కోర్టు ఈ మేరకు టేపులు, హార్డ్ డిస్క్ నకలు (కాపీ చేసి)ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు టేపులు, హార్డ్ డిస్క్ ఇచ్చారు. కాపీ చేసిన తర్వాత వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. ఒక హార్డ్‌డిస్క్, మూడు టేపుల నకళ్లకు సంబంధించిన సీల్డ్ కవర్లతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు మరో సీల్డ్ కవర్‌ను కూడా కోర్టుకు అందజేశారు. గురువారం ఉదయం పదిన్నరకు ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి కోర్టుకు వచ్చి మెమో దాఖలు చేశారు. ఆ సమయంలోనే సీల్డ్ కవర్లను పరిశీలించాలని న్యాయమూర్తి లక్ష్మీపతి భావించారు.


ఆ సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం ఇతర కేసుల వాదనలు ఉండటంతో కుదరక సాయంత్రం నాలుగున్నరకు వాయిదా వేశారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత మరోసారి ఏసీబీ అధికారులు కోర్టు హాల్‌లోకి వెళ్లారు. అయితే కేసులు ఉండటంతో ఈరోజు కుదరడంలేదని... సీల్డ్ కవర్‌లో ఏమున్నాయో ముందుకు పరిశీలించాల్సి ఉందని అంటూ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రావాలని న్యాయమూర్తి వారికి చెప్పారు. అంతకు ముందు నిందితుల తరుఫు న్యాయవాది పార్థసారథి తన వాదనలు వినిపిస్తూ హైకోర్టులో శుక్రవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తీర్పు ఉన్నందున ఈ సమయంలో ఆడియో, వీడియో టేపులు ఇస్తే ఏదో సృష్టించి అడ్డుకునేందుకు ఏసీబీ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 


వారిద్దరి అరెస్ట్ తప్పేలా లేదు: ఏసీబీ


ఓటుకు నోటు కేసులో ఐదు రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి. కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహను ఇప్పటికే రిమాండ్‌కు పంపింది. కేసులో మరింత కీలకమని భావిస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా విచారించేందుకు యత్నించింది. కానీ ఆరోగ్య సమస్య కారణంగా పది రోజులపాటు విచారణకు హాజరుకాలేనని చెబుతూ సండ్ర ఏకంగా రాష్ట్రం వదలివెళ్లిపోయారు.


దర్యాప్తు కీలక సమయంలో సండ్ర తప్పించుకోవడంతో ఏసీబీకి మరిన్ని సందేహాలు తలెత్తాయి. సండ్ర పది రోజుల గడువు కావాలని కోరి వారం దాటిపోయింది. ఈ నెల 16న సండ్రకు నోటీసులిచ్చిన ఏసీబీ, 19లోపు హాజరుకావాలని కోరింది. కానీ ఆయన పది రోజులు గడువు కోరడంతో 29 వరకు ఆగాలని భావించింది. మరో మూడు రోజుల్లో సండ్రకు ఇచ్చిన సమయం ముగియనుంది. అనంతరం సండ్ర విచారణకు హాజరవుతారా? లేకా తప్పించుకునేందుకు మళ్లీ ఎత్తులు వేస్తారా? అని ఏసీబీ అనుమానిస్తోంది. దీనితో కోర్టు నుంచి నేరుగా సండ్రకు నోటీసులు లేదా సమన్లు ఇప్పించి విచారించాలని భావిస్తోంది. ఇలా కాకుండా సండ్రను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టే యోచనలో కూడా ఉన్నట్టు ఏసీబీ వర్గాలు ద్వారా తెలిసింది. సండ్ర కీలక కావడం, తాజా పరిస్థితులు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వీటంన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్టు ఆ వర్గాలు తెలిపాయి. 


వేం నరేందర్‌రెడ్డిని సైతం..


ఇక ఈకేసులో లబ్దిదారుడిగా ఆరోపణలెదుర్కుంటున్న వేం నరేందర్‌రెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని, ఆ విభాగపు న్యాయనిపుణులు స్పష్టంచేశారు. కుట్రలో ఆయనే లబ్ధిదారుడు కావడం, పైగా రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఏసీబీ వేం నరేంద్‌రెడ్డిని విచారించింది. అయితే ఆరోగ్య సమస్యలుండటం వల్ల కేవలం విచారించి వదిలేసింది. ఎమ్మెల్యే సండ్రను విచారించిన తర్వాత వెలుగులోకి వచ్చే అంశాలనుబట్టి వేం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని భావించింది. అయితే సండ్ర హ్యాండ్ ఇవ్వడంతో ఓపిక పట్టింది. సండ్రకు ఇచ్చిన గడువు పూర్తవుతున్న నేపథ్యంలో తదుపరి యాక్షన్ ప్లాన్‌కు సిద్దమవుతున్నట్టు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. 


వారిద్దరూ వస్తారు..


ప్రస్తుతం సండ్ర ఎక్కడున్నాడన్నది ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో సండ్రను ఎలా అదుపులోకి తీసుకొని ఏసీబీ విచారిస్తుందనేది ఆసక్తి రేపుతున్నది. అయితే పది రోజుల గడువు ముగిసే లోగా సండ్రనే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరవుతారని ఏసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. సండ్రను హాజరుపరిచేలా తాము చేస్తున్న ప్రయత్నాలు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయని వారు చెప్పారు. వేం నరేందర్‌రెడ్డి, సండ్ర ఇద్దరూ ఒకే రోజు తమ ఎదుట విచారణకు వస్తారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి