సీమాంధ్ర వలస పాలన సంకెళ్లను తెంచిన ఉద్యమ చైతన్యం ఇంకా ఇంకా కొనసాగాలి. స్వంత రాష్ట్రంలో స్వపాలన వేళ్లూనుకోవాలి. ఉద్యమ నాయకత్వం ప్రజల ఆశలు పండేదాక అదే పోరాట పటిమతో, త్యాగనిరతితో ముందుకు సాగాలి. ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలతో ఫలించిన ఏడాది పసిగుడ్డు వీర తెలంగాణను విమర్శలతో కాదు..దీవెనలతో ఎత్తి ముద్దాడుకుందాం రండి! నడక నేర్చి,పరుగు తీసి అగ్రభాగాన నిలిచేలా చేయిచేయి కలిపిచేయూతనిద్దాం రండి..
రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఉద్యమ కాలమంతా ఎన్నో అవమానాలు, వెక్కిరింతలు, వ్యంగ్యాల తర్వాత ప్రజలిచ్చిన విజయాన్ని కళ్ళకద్దుకొని ఉద్యమపార్టీ అధికారం చేపట్టింది. ఇంకా కాలు కుదురుకోని కొత్తరోజుల్లోనే గోల్కొండపై జాతీయజెండా ఎగురవేసి పాలన ఎంత విభిన్నంగా ఉండబోతుందో.. మూసపోతను పక్కనబెట్టి కొత్త దారులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి తెలంగాణవాదిలో నెత్తురు పొంగేలా.. ఉవ్వెత్తున ఆ రోజు ఎగిసిన ఆ జెండా ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న వాళ్లు కూడా లేచి నిలబడి శాల్యూట్ చేసిన ఆత్మగౌరవ జెండా అది. తరాలుగా ఎవరూ పట్టించుకోని గొల్లకొండ, విజయాన్ని భుజాల మీద మోస్తూ నిటారుగా నిలబడి నిలువెల్లా వెలిగిపోయిన విలువైన దృశ్యం అది. దీనిని కూడా విమర్శించిన మహానుభావులున్నారు!
వాళ్ళు దేనిని విమర్శించలేదుగనక..!? నడవాలి అనుకొనే వాడికి లోకమంతా దారులే..! చెయ్యాలనుకొనేవాడికి చేతినిండా పనులే అంటారు. "ఏం చేశాడు కేసీఆర్? బోనాలు, బతుకమ్మ పండుగలు తప్ప!" అన్నారు తిట్టుకొనేవాళ్లు. పాలనలో పండుగలే కాదు.. ఉద్యమాన్ని ఉత్సవంలా నడిపించారు ఆయన. సకల జనుల సమ్మెలు, రోడ్లమీద వంటావార్పులు.. ఇవన్నీ అందరూ కలిసి ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేదననూ పంచుకొనే సామూహిక నెలవులు. ఒక కారణంతో పదిమంది కలిసిన చోట ప్రళయమైనా, కోపమైనా, ఆనందమైనా, ఉత్సాహమైనా పెల్లుబికి ప్రవహిస్తుంది. ఈ సూత్రం అర్థం చేసుకోవడం నాయకుడికుండే గొప్ప లక్షణం. మనుషులు ఉత్సాహంగా బతకాలనుకోవడం తప్పెట్లా అవుతుంది? సామూహిక పర్వాలు, ఉత్సవాలు మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్నీ, నా వెనుక ఇంతటి సమాజం వుందన్న భరోసాను కలిగిస్తాయి. దీన్ని గుర్తించి ప్రభుత్వమే జరిపించడం తప్పెలా అవుతుంది?
నీటి వసతులు లేని తెలంగాణలో ఊరికి జీవనాడి చెరువులే. దశాబ్దాల తరబడి పాలకులు కన్నెత్తి చూడక పూడుకుపోయిన చెరువులు.. మిషన్ కాకతీయతో ఊరి గొంతు తడపబోతుంటే.. దాంట్లోనూ తప్పులు వెదకడమే చేస్తున్నారు కొందరు. సహకరిం చి హుందాతనాన్ని నిలుపుకోవాల్సిన నాయకులు ప్రభుత్వాన్ని పలుచన చేయాలన్న రాజకీయం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు జరిగే పనులతో గత పాలనలో తమ చేతికానితనం బయటపడుతుందనే ఉక్రోషం తప్ప మరొక విషయం, ప్రయోజనం వుందా? ఇలా మాట్లాడే వాళ్లందరికీ వ్యక్తిగత ఎజెండానో, రాజకీయ ఎజెండానో వుండి తీరుతుంది. ఇలాంటి వాళ్లున్నప్పుడు, ప్రజాప్రయోజనం ముందు ఇవేమీ పట్టించుకోవాల్సిన పనిలేదు.
ఒక చైనా సామెత వున్నది. విమర్శలు ఎంత తీవ్రంగా వుంటే నువ్వంత పని చేస్తున్నావని అర్థం. ఎవరూ నీ గురించి మాట్లాడటం లేదంటే నువ్వేమీ చేయడం లేదని పరమార్థం! నీ గురించి నోరు చించుకొనేవాళ్ళు ఎక్కువయిన కొద్దీ..
You are Rocking.. You are something Over here.. ! ఒక టీవీ ఛానల్‌లో కేటీఆర్ అన్నారు.. "తిట్లు" మాకు ఆశీర్వాదాలు అనుకొంటాం అని. కాదు.. కాదు.. ఆత్మవిశ్వాసాలు అనుకోవాలి. విమర్శలో అర్థం వుంటే తప్పక స్వీకరించి సరిదిద్దుకోవలసిందే. తిట్టడమే దినచర్యగా పెట్టుకొనేవాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకూ "తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన" నాకు తెలిసిన ఆంధ్రులు మళ్లీ అన్నారు.. "ఏం చేస్తాడు.. ఏమీ చెయ్యలేడు కేసీఆర్.." అని. అవకాశం ఇప్పుడేగా వచ్చింది. మరో ఆరు నెలల తర్వాత మాట్లాడండి అన్నాను. వాళ్లు పొలిటీషియన్స్ కాదు. ఈ మధ్య మళ్లీ కలిసినప్పుడు వాళ్లే అంటున్నారు.. "బాగా చేస్తున్నాడు.." అని. రాష్ట్రం విడిపోతే ఏదో జరిగిపోతుందన్నారు. బాగానే ఉందిగా అని పెద్దావిడ ఆశ్చర్యంగా మాట్లాడారు. సామాన్యులు ప్రభుత్వం పనితనాన్ని అంగీకరిస్తున్నారు. వేసవిలో కరెంటు కోతలతో అల్లాడే ప్రజల అసంతృప్తులను రెచ్చగొట్టవచ్చని ఎదురుచూసిన వాళ్ల నోళ్ళు పడిపోయాయి. ఇది నిజంగా నిజం. ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారని మథనపడుతున్న వాళ్ల నోళ్లు ఆశ్చర్యంతో తెరుచుకుపోయాయి.
చిన్న రాష్ర్టాలు ఏర్పడితే అభివృద్ధి వుండదని అరిచి అరిచి బొంగురుబోయిన నోళ్ళు.. ప్రపంచ వ్యాప్తంగా చిన్న దేశాలు, చిన్న రాష్ర్టాలే త్వరితగతిన అభివృద్ధి చెందడం రుజువయిందన్న నిజాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు. చిన్నదా పెద్దదా అని కాదు.. చిత్తశుద్ధి ముఖ్యం. అరిచే ప్రతివాడికీ ఒక ఎజెండా వుంటుంది. అవసరమయింది విశాల దృక్పథం.. ప్రతి దాన్నీ విమర్శిస్తూ అరవడం కాదు! ఫాం హౌజ్‌లో పడుకోవడం గురించీ విమర్శే. విమర్శ సహేతుకంగా వుంటే సలాం కొట్టచ్చు. అక్కడేమయినా రేవ్‌పార్టీలు, క్లబ్‌డ్యాన్సులూ జరుగుతున్నాయా? చెట్టుకీ, పిట్టకీ, మబ్బుకీ, వానకీ దగ్గరగా ప్రకృతిలో గడపడం నేరమా? ప్రకృతి ఒడిని మనసారా ఆస్వాదించగలిగినవాడే మనుషుల మనసుల్ని గెలవగల సున్నితత్వం, సాన్నిహిత్యం గలవాడై వుంటాడు. ఇటువంటి వారికి రైతులాగే ఓపిక, సహృదయమూ అలవడతాయి. మరి ఒక నేత ఆ లక్షణాలతో ఉన్నప్పుడు ప్రజలకు మంచే జరుగుతుంది కదా!
ఎవరు ఎన్నుకుంటే ఏం.. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. నడక బలంగా ఉన్నప్పుడే.. కాలిముద్రలు చరిత్రలో నిలిచి వుంటాయి. ప్రజా జీవితాల్లో మన స్వపరిపాలన ముద్రల్ని మరింత బలోపేతం చేయాలి. పొరపాట్లు జరగొచ్చు.. అయితే యేం... చేస్తున్న వారికే కదా తప్పులు దొర్లేది. ఏమీ చేయని వారికి పొరపాట్లతో సంబంధమేముంది? తప్పుడు మాటలతో తప్ప! రాష్ట్రం ఒక సంవత్సరం ఎదిగిన పసిబిడ్డ. ఎత్తుకొని ఎదిగించాల్సిన బాధ్యత మోస్తున్న కేసీఆర్ ఆరోగ్యంపై అభిమానుల గుండెపగిలే పుకార్లు, కథలు ప్రచారం చేసిన వాళ్ల చెంపలు ఛెళ్లుమనిపించేలా... ప్రజల ఆశీస్సులతో వేగంగా... శక్తివంతంగా అడుగులేస్తూ ముందుకు సాగాలి.
సీమాంధ్ర వలస పాలన సంకెళ్లను తెంచిన ఉద్యమ చైతన్యం ఇంకా ఇంకా కొనసాగాలి. స్వంత రాష్ట్రంలో స్వపాలన వేళ్లూనుకోవాలి. ఉద్యమ నాయకత్వం ప్రజల ఆశలు పండేదాక అదే పోరాట పటిమతో, త్యాగనిరతితో ముందుకు సాగాలి.ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలతో ఫలించి న ఏడాది పసిగుడ్డు వీర తెలంగాణను విమర్శలతో కాదు.. దీవెనలతో ఎత్తి ముద్దాడుకుందాం రండి! నడక నేర్చి, పరుగు తీసి అగ్రభాగాన నిలిచేలా చేయి చేయి కలిపి చేయూత నిద్దాం రండి..
- రావులపల్లి సునీత
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి