గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 24, 2015

ఆ గొంతు బాబుదే! - తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు!!!

-తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు!
-రేపు చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు?
-ఓటుకు నోటు కేసులో ఇక కీలక ఘట్టం
-ట్యాపింగ్ కాదు.. ఫోన్‌లో రికార్డు చేసినదే..
-నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక!
-నేటి మధ్యాహ్నం ఏసీబీ చేతికి..
-అందిన వెంటనే కీలక చర్యలు!
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకోబోతున్నది. ఈ కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ధ్రువీకరించినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఆడియో టేపు ట్యాప్ చేసినది కాదని, ఫోన్‌లో రికార్డయినదేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేటతెల్లమైనట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కట్ అండ్ పేస్ట్ వ్యవహారంకూడా కాదని ఎఫ్‌ఎస్‌ఎల్ తన నివేదికలో స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ మేరకు తమ విశ్లేషణలతో కూడిన సమగ్ర నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి అందించబోతున్నట్లు తెలిసింది. ఆ నివేదిక అందిన తర్వాత ఇతర లాంఛనాలు పూర్తిచేసుకుని గురువారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇక బాబుకు చుక్కలే..:

టీవీల్లో ప్రసారమైన ఆడియో టేపులలో గొంతు తనదికాదని ఒకసారి, కట్ అండ్ పేస్ట్ చేశారని మరోసారి, ట్యాప్ చేశారని ఇంకోసారి చెప్తూ వచ్చిన చంద్రబాబుకు దిమ్మతిరిగే వాస్తవాలు ఈ నివేదికలో ఉన్నాయని తెలుస్తున్నది. తమకు అందిన ఆడియో టేపులు స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డయినవేనని, ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నట్లుగా ట్యాప్ చేసి రికార్డుచేసినవి కావని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది. సదరు ఆడియోలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 


babu

ఏ రోజు.. ఎన్ని గంటలకు.. ఎంత సేపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారనే విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చినట్లు తెలియవచ్చింది. స్టీఫెన్‌సన్ వ్యక్తిగత మొబైల్‌ఫోన్‌ను పరీక్షించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు ఈ మేరకు నిర్ధారణలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్.. తమకు కొత్త హార్డ్‌డిస్క్, కొన్ని ఖాళీ డీవీడీలు కావాలని కోరింది. ఎఫ్‌ఎస్‌ఎల్ కోరినట్టు అన్నీ తాము ఇప్పటికే అందించామని ఏసీబీ వర్గాలు చెప్పాయి. కేసుకు సంబంధించి తమకు అందిన ఆడియో, వీడియో టేపులను ముందు జాగ్రత్త చర్యగా స్టోర్ చేసుకునేందుకే ల్యాబ్ అధికారులు ఇవి కోరి ఉంటారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. దాదాపుగా ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పరీక్షలు ముగిసి, నిర్ధారణలు పూర్తయ్యాయని, బుధవారం మధ్యాహ్నానికి నివేదికను ఏసీబీకి అప్పగిస్తామని ఎఫ్‌ఎస్‌ఎల్ వర్గాలు తెలిపాయి.


రేపే బాబుకు నోటీసులు?:

స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించిన నేపథ్యంలో ఏసీబీ తన దర్యాప్తు వేగాన్ని పెంచనుందని తెలుస్తున్నది. నివేదిక అందిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఏసీబీవర్గాలు చెప్పాయి. ఓటుకు నోటు కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చే నివేదిక తమకు అత్యంత కీలక ఆధారమని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


ఆ నివేదికకోసం ఎదురుచూస్తున్నామని, అది చేతికి రాగానే కేసులో తుది ఘట్టాన్ని మొదలు పెడతామని తెలిపారు. తదుపరి కీలక పరిణామాలు తప్పవని వారు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక తమకు బుధవారం మధ్యాహ్నం లేదా గురువారానికి అందిన వెంటనే చంద్రబాబుతోపాటు ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న పలు ప్రైవేట్ కంపెనీల సీఈవోలు, పలువురు రాజ్యసభ ఎంపీలకు తాఖీదులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ వర్గాలు తేల్చిచెప్పాయి. ఒకవేళ నోటీసులు స్వీకరించాల్సిన పలువురు వ్యక్తులు అందుబాటులో లేకపోయినా, వారి కుటుంబీకులకు అందజేస్తామని, లేదంటే నోటీసులు వారి ఇండ్లకు అతికించి విచారణకు హాజరుకావాల్సిందిగా కోరుతామని ఏసీబీ ఉన్నతాధికారి చెప్పారు. నివేదికను, వీడియో ఫుటేజ్ సహా కోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి