-ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఏపీ సీఎం ముడుపుల ఫోన్ కాల్
-బాబే బాస్ అని ఏసీబీ నిర్ధారణ!
-స్టీఫెన్‌సన్ కాల్‌డేటాలో ఏపీ సీఎం బేరసారాలు
-కొనుగోళ్ల బాస్ చంద్రబాబేనని రేవంత్ వెల్లడి
-ఏసీబీ అధికారుల వద్ద 20 మంది కాల్‌డేటా
-లోకేష్, ఇద్దరు ఎంపీలు, ఓ కేంద్రమంత్రి పాత్ర
-చీకటి నిధుల మూలాల ఆచూకీ లభ్యం
-చంద్రబాబుకు నోటీసు జారీకి రంగం సిద్ధం
-గవర్నర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ
-పచ్చ కుట్రకు సీమాంధ్ర మీడియా తాళం
-బాబు ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలు
-ఉమ్మడి రాజధానంటూ ఆంధ్రజ్యోతి సొల్లు పురాణం
-రాష్ట్రం మీద ఈగ వాలినా సహించబోమని తెలంగాణవాదుల హెచ్చరిక
బాస్ ఎవరో స్పష్టంగా తేలిపోయింది. పచ్చదొంగల గుట్టు బయటపడింది. ఏసీబీ చక్రబంధంలో రేవంత్ చేతులెత్తేశాడు. కొనుగోళ్ల బాస్ చంద్రబాబేనని కుండబద్దలు కొట్టాడు. మరోవైపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణలు బయటపడ్డాయి. -బాబే బాస్ అని ఏసీబీ నిర్ధారణ!
-స్టీఫెన్‌సన్ కాల్‌డేటాలో ఏపీ సీఎం బేరసారాలు
-కొనుగోళ్ల బాస్ చంద్రబాబేనని రేవంత్ వెల్లడి
-ఏసీబీ అధికారుల వద్ద 20 మంది కాల్‌డేటా
-లోకేష్, ఇద్దరు ఎంపీలు, ఓ కేంద్రమంత్రి పాత్ర
-చీకటి నిధుల మూలాల ఆచూకీ లభ్యం
-చంద్రబాబుకు నోటీసు జారీకి రంగం సిద్ధం
-గవర్నర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ
-పచ్చ కుట్రకు సీమాంధ్ర మీడియా తాళం
-బాబు ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలు
-ఉమ్మడి రాజధానంటూ ఆంధ్రజ్యోతి సొల్లు పురాణం
-రాష్ట్రం మీద ఈగ వాలినా సహించబోమని తెలంగాణవాదుల హెచ్చరిక
మాయోపాయాలు, కుయుక్తులు, అడ్డదారులు, మీడియా మాఫియా అండతో సాగించిన నాటకాలకు తెరపడింది. ఎన్టీఆర్‌ను గద్దె దింపడం దగ్గరనుంచి దొంగ ఉద్యమాలతో తెలంగాణ ఆపడంకోసం జరిపిన యత్నాల దాకా అనేక కుట్రలు సాగించిన చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయాడు. పీకలదాకా కూరుకుపోయాడు. నిప్పులాగా బతికానని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు.. ఐదుకోట్ల ఆఫర్‌తో తనముఫ్ఫై ఏండ్ల రాజకీయానికి తానే నిప్పు పెట్టుకున్నాడు.
ఓటుకు నోటు కుట్ర కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ చేతికి తిరుగులేని సాక్ష్యాధారాలు లభించాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కొనుగోలుకు తనను పురమాయించిన బాస్ చంద్రబాబేనని రేవంత్‌రెడ్డి ఆదివారం రెండోరోజు జరిగిన విచారణలో ఏసీబీముందు అంగీకరించారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు సైతం దీన్ని ధ్రువపరిచే వాంగ్మూలాలు ఇవ్వగా వీటితో పాటు సాక్షాత్తూ చంద్రబాబే నేరుగా స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల తాలూకు కాల్‌డేటా కూడా ఏసీబీకి చిక్కింది.
అధికారుల విచారణలో ఈ కేసులో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు లోకేష్, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. చంద్రబాబు ఆదేశంతో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ ఒకరు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డబ్బులు సమకూర్చారని ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమీపంలోని బ్యాంకులనుంచి ఈ డబ్బులు డ్రా చేసినట్టు ఏసీబీకి ప్రాథమిక ఆధారాలు లభ్యమైనాయి. పలు ఆధారాలు సమకూర్చుకున్న నేపథ్యంలో లాంఛనాలు పూర్తి చేసి చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రా త్రి తెలంగాణ అవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమం అ నంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో అరగంటపాటు సమావేశమయ్యారు.
బాస్ చంద్రబాబేనని అంగీకరించిన రేవంత్
ఈ కేసులో ఆదివారం రెండోరోజు రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ కీలక సమాచారం రాబట్టింది. మొదటినుంచి ఇదంతా తన వ్యక్తిగతం అంటూ వాదిస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డికి ఏసీబీ అధికారులు మైండ్‌బ్లాక్ అయ్యే అంశాలను చూపించారని తెలిసింది. స్టీఫెన్‌సన్‌తో 28వ తేదీన జరిగిన సంభాషణలో బాస్ అని , బాబు అని ప్రస్తావించిన రేవంత్ 31వ తేదీన డబ్బు చెల్లింపు రోజున మాత్రం పదే పదే చంద్రబాబు పూర్తి పేరును పలికినట్టు ఉన్న వీడియో ఫుటేజ్ చూపించినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనీసం 72సార్లు చంద్రబాబు అనే పేరును రేవంత్ పక్కాగా ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల ప్రకారం రికార్డు చేసిన వీడియో, ఆడియో ఫుటేజ్‌లను ఫోరెన్సిక్ విభాగానికి పంపగా వారి విశ్లేషణలో ఆ వాయిస్ రేవంత్‌రెడ్డిదేనని స్పష్టమైంది.
ఈ ఫుటేజ్ చూసిన అనంతరం పదే పదే మా బాస్ అంటూ ప్రస్తావించింది చంద్రబాబునేనని, ఈ కుట్రకు సూత్రధారి కూడా చంద్రబాబేనని రేవంత్ అంగీకరించినట్టు తెలిసింది. వాస్తవానికి బాస్ అంటే ఎవరన్నది సర్వత్రా తెలిసినా, ఇపుడు నిందితుడి వాంగ్మూలం ద్వారా దాన్ని రుజువు చేసినట్టు అయింది. రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో సైతం బాస్ కుట్ర వెల్లడైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
స్టీఫెన్‌సన్‌తో బాబు సంభాషణల కాల్‌డేటా..
ఇదిలాఉంటే ఈ కేసులో మరో కీలక ఆధారం స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియోనుకూడా ఏసీబీ సంపాదించింది. చంద్రబాబు స్టీపెన్‌తో ఏమేమి మాట్లాడారో పూర్తి వివరాలు ఉన్నాయి. దీనితో ఓటుకు నోటు కుట్రలో బాస్ అలియాస్ చంద్రబాబు పాత్రను పూర్తిగా ఏసీబీ ధ్రువపరిచినట్టేనని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ కుట్ర జరుగుతున్న తరుణంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మిగిలిన ఇద్దరిని ఏసీబీ విచారించింది.
రేవంత్ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినప్పుడు చెప్పిన బాస్ వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడిన విషయాలను వారు ఏసీబీకి వివరించినట్టుతెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కూడా చంద్రబాబు తనతో మాట్లాడారని ఏసీబీ దర్యాప్తు బృందాలకు స్పష్టంగా వివరించారు. స్టీఫెన్‌తోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేసేందుకు యత్నించారని కూడా ఏసీబీ పక్కాగా ఆధారాలు సంపాదించింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వారి వాంగ్మూలాలను సైతం ఏసీబీ రికార్డు చేసిందని తెలిసింది.
బాబుకు బిగిసిన ఉచ్చు...
ఈ కేసులో బాబు పాత్రపై దాదాపు నాలుగు రకాల కీలక ఆధారాలను సంపాదించిన ఏసీబీ ఇప్పుడు బాస్ అలియాస్ బాబుపైనే దృష్టి సారించనుంది. ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు ఏసీబీ అధికారులు న్యాయనిపుణుల సలహాలను స్వీకరిస్తున్నారు. చంద్రబాబుకు సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆయనను విచారించే విషయంపై గవర్నర్ దృష్టికి తీసుకురానున్నట్టు తెలిసింది.
కాల్‌డేటాతో గుట్టురట్టు...
రేవంత్‌రెడ్డితో పాటు ఏసీబీ అధికారులకు దొరికిన సెబాస్టియన్, ఉదయసింహల ఫ్లోన్లను సీజ్ చేసిన అధికారులు వాటి కాల్‌డేటాను పరిశీలించినపుడే ఏపీ సీఎం చంద్రబాబు పాత్రమీద ఆధారాలు దొరికాయి. ఎమ్మెల్యే స్టీపెన్‌సన్ తనను కొనుగోలు చేయడానికి టీడీపీ నేతలు బేరాలుచేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి ముందు మూడు, నాలుగురోజులు ఆ తరువాత వారం పదిరోజుల కాల్‌డేటాను కోర్టు ఆదేశాల మేరకు విచారణాధికారులు తీసుకొని అసాంతం పరిశీలించారు.
ఇందులోనే ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఆధారాలు విచారణ అధికారులకు లభించాయి. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు బయటకు తీసిన కాల్‌డాటాలో 50 నుంచి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉంది. నోట్లతో ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేయాలనే కుట్ర పూరిత వ్యవహారంలో 15 నుంచి 20 మంది పాల్గొన్నారని అధికారులు అంచనాకు వచ్చారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు- సెబాస్టియన్‌ల మధ్య జరిగిన సంభాషణల్లో చాలా ఆధారాలు దొరికాయని పోలీస్ వర్గాల భోగట్టా. అవినీతి నిరోధక అధికారుల విచారణలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది.
రేవంత్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలించిన అధికారులకు ఆయన బ్లాక్ మెయిల్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించి ఆధారాలు లభించాయి. అధికారులు ఎవ్వరి ఫోన్లు ట్యాప్ చేయరని, ఒక వేళ ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఎమ్మెల్ల్యే స్టీపెన్‌సన్ ఫిర్యాదు ఇచ్చిన తరువాతనే నిఘా పెట్టినట్లు అధికారులు చెపుతున్నారు.
తాను తీసుకున్న గోతిలోనే...
తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని భావించి స్కెచ్ వేసిన చంద్రబాబు చివరకు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నిన చంద్రబాబునాయుడు నీతిమాలిన చర్యలకు పాల్పడి అడ్డంగా ఇరుక్కున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలు చేయాలనే ఆలోచనే తప్పని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే చంద్రబాబు తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొంటానంటే ఊరుకుంటారా? తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ఎమెల్యేలను కొంటానంటే ఆక్కడ ఊరుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడానికి కావలిసిన సంఖ్యాబలం కూడా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఎంఐఎం మద్దతుతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం 83కు చేరింది. టీడీపీ బలం కేవలం 11 మంది ఎమ్మెల్యేలే. బీజేపీ సభ్యుల మద్దతుతో 16కు చేరింది. అభ్యర్థి గెలువడానికి 17 మంది సభ్యులు అవసరం కాగా టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని నిలబెట్టిన తరుణంలో టీడీపీ గెలిచే అవకాశం లేదు. టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థి గెలువడానికి ఇద్దరు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ కాగా వైసీపీ మద్దతు తెలిపింది. దీంతో టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థికి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. అయినా టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడింది.
ఢిల్లీని లాగాలని ప్రయత్నాలు..
డబ్బులిచ్చి దొరికిపోయిన పచ్చగ్యాంగు ఇపుడు కేంద్రాన్ని ఈ వ్యవహారంలోకి లాగాలని యత్నిస్తున్నది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదుకు యత్నించారు. ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలపైన, ప్రభుత్వ పెద్దలపైన ఎలా కేసులు పెడతారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అణు ఒప్పందం సందర్భంగా బీజేపీ ఎంపీలను నోట్లతో కొనుగోలు చేయాలని చూసిన యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టిన బీజేపీ ఇపుడు చంద్రబాబు వ్యవహారాన్ని సమర్థించే అవకాశం లేదని భావిస్తున్నారు.
ఆంధ్రా పత్రికల సొల్లురాతలు...
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ విచారణ చేసే అధికారం ఏపీ పోలీసులకు కూడా ఉంటుందని ఒక ఆంధ్రా పత్రిక రాస్తున్న రాతలను పలువురు తప్పుపడుతున్నారు. ఢీ అంటే ఢీ అని హెడ్డింగ్‌లు పెడుతూ ఏపీ డీజీపీ రాముడును ఎగదోస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ డీజీపీకి అధికారాలు ఉండవని, ఈ విషయాన్ని గుర్తించకుండా విచారణ చేపడితే ఏపీ డీజీపీ తెలంగాణలో అరెస్టు అవుతారని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ రాజధాని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంతా తెలంగాణ డీజీపీ చేతిలో ఉంటుంది తప్ప ఏపీకి హక్కు ఉండదు. వాళ్లు ఏమైనా ఫిర్యాదు చేయాల్సి వచ్చినా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
వాస్తవానికి విభజన చట్టంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేండ్లు ఉండాలని ఎక్కడా లేదని, పదేండ్లు దాటకూడదని అని మాత్రమే ఉందన్నారు. పదేండ్లు మించకుండా హైదరాబాద్‌లో ఉండాలని ఉంది కానీ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధాని అని లేదని, ఈ విషయాన్ని కూడా ఆంధ్రా మీడియా గుర్తించాలని అంటున్నారు. డీజీపీ పదవి టెరిటోరియల్ పోస్టని, ఈ పోస్టుకు పరిధి ఉంటుందని వివరిస్తున్నారు. ఏపీ డీజీపీ పరిధి ఆంధ్రాలో ఉంటుంది కానీ తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓటుకు నోటు వ్యవహారంలో భాగంగా ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, రేవంత్ సహా మిగిలిన నిందితులకు సంబంధించిన ఫోన్ల కాల్‌డేటా వివరాలు,
సంభాషణలు సేకరించినపుడు స్టీఫెన్‌సన్, సెబాస్టియన్ డాటా సేకరణలో చంద్రబాబు వ్యవహారం బయటికొచ్చింది. చంద్రబాబు అండ్ కోతో పాటు ఆంధ్రజ్యోతి దీనిని పక్కదారి పట్టించేందుకు ఏపీ సీఎం ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులుగానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్ చేసిన సందర్భాలు లేవని, అవసరం కూడా లేదనేది అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలు పెడితే వ్యవహారం పక్కదారి పట్టొచ్చనే వెకిలి కుట్రకు తెర తీశారు.
అయితే తాము సీజ్ చేసిన ఫోన్ల కాల్‌డేటా తీగను లాగితే. అందులో చంద్రబాబు సంభాషణలు బయటపడ్డాయే తప్ప ప్రత్యేకంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగడం అవాస్తవమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో పీకల దాక ఇరుకున్న టీడీపీ నేత చంద్రబాబు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా చంద్రబాబును, రేవంత్‌ను కాపాడటం కోసం ఆంధ్రజ్యోతి అడ్డగోలు రాతలు రాస్తుందని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది.. తెలంగాణ సర్కారు జోలికి వచ్చినా.. తెలంగాణ ఎమ్మెల్యేలను ముట్టుకున్నా మసైపోతారని తెలంగాణవాదులు అంటున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దీనిని గుర్తించాలంటున్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణపై ఈగ వాలినా ఊరుకోమని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.
రూ. 150 కోైట్లెనా రెడీ..
ఓటుకు నోటు వ్యవహారంలో పచ్చపార్టీ ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయడానికీ రెడీ అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో 23 నుంచి 25 ఓట్లు సంపాదించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వాలని చంద్రబాబు కుట్ర పన్నారు. దీనికోసం ఎమ్మెల్యేలను కొనాలని టీటీడీపీ ఎమ్మెల్యేలను ఉసి గొలిపారు. మీకు ఎమ్మెల్యేలను కొనడం చాతకాదా? అంటూ వారిమీద చంద్రబాబు ఓ దశలో విరుచుకుపడ్డారని కూడా తెలిసింది. మీరు మేధావులా? మీకు కొనడం వస్తే నాకు ఇంత ఇబ్బంది ఎందుకు ఉంటుందంటూ ఓ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేను చంద్రబాబు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంలో రూ.150 కోైట్లెనా ఖర్చు పెడతా... ఖర్చుకోసం వెనకాడ వద్దంటూ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్రమంత్రి, రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలను కొనే బాధ్యతలు అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థికి 22 లేదా 23 ఓట్లు రావాలి.. కేసీఆర్ దిమ్మతిరగాలి అని ఆదేశించినట్టు తెలిసింది.
హైదరాబాద్ మీదనే కన్ను..
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పలుసార్లు తనకు ఏపీ కంటే హైదరాబాద్ ముఖ్యమని ప్రకటించారు. చంద్రబాబు తనను నమ్ముకొని ఇక్కడ భూ దందాలు చేసిన వారిని కాపాడుకోవడానికి, వారి అక్రమాస్తులకు రక్షణ ఉండటానికే హైదరాబాద్‌పై రాజకీయ పెత్తనం కోసం యత్నిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో త్వరలో జరిగే ఎన్నికల్లో దెబ్బతీసే కుట్రలో భాగంగానే ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని బాబు అండ్ కో కుట్ర చేసింది.
హలో.. స్టీఫెన్‌సన్..
-ఏసీబీకి దొరికిన చంద్రబాబు ఫోన్ సంభాషణ ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రమేయం ప్రత్యక్షంగా ఉందనేందుకు బలమైన ఆధారాన్ని ఏసీబీ సంపాదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. ఆ సంభాషణ ఇలా ఉంది..
స్టీఫెన్‌సన్: హలో..
చంద్రబాబు తరఫు వ్యక్తి: బ్రదర్..
స్టీఫెన్‌సన్: హా సర్...
చంద్రబాబు తరఫు వ్యక్తి: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టూ యూ. స్టే ఆన్ ద లైన్..
(బాబుగారు మాట్లాడతారు... లైన్‌లో ఉండండి)
స్టీఫెన్‌సన్: యా థ్యాంక్యూ
చంద్రబాబు: హలో..
స్టీఫెన్‌సన్: సర్, గుడ్ ఈవినింగ్ సర్..
చంద్రబాబు: గుడ్ ఈవినింగ్ బ్రదర్... హౌ ఆర్‌యూ (ఎలా ఉన్నారు?)
స్టీఫెన్‌సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్(నేను బాగున్నాను సార్.. కృతజ్ఞతలు)
చంద్రబాబు: మనవాళ్లు.. బ్రీఫ్‌డ్ మీ..
(మనవాళ్లు నాకంతా చెప్పారు)
స్టీఫెన్‌సన్: ఎస్ సార్..
చంద్రబాబు: ఐయామ్ విత్‌యూ. డోంట్ బాదర్..
(నేను మీకు అండగా ఉంటా. ఆందోళన వద్దు.. నిశ్చింతగా ఉండండి)
స్టీఫెన్‌సన్: రైట్ సర్..
చంద్రబాబు: ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ విత్‌యూ.
వాట్ ఆల్ దె స్పోక్.. వీ విల్ హానర్
(అన్నింటికీ మీకు అండగా ఉంటా. మావాళ్లు ఏమైతే చెప్పారో వాటన్నింటినీ నెరవేరుస్తా)
స్టీఫెన్‌సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫ్రీలీ.. యూకెన్ డిసైడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్..(మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉండదు)
స్టీఫెన్‌సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫర్ యువర్ కమిట్‌మెంట్... వి వర్క్ టుగెదర్ (మీరు నిబద్ధతతో ఉంటే..మనమంతా కలిసి పనిచేద్దాం)
స్టీఫెన్‌సన్: రైట్.. థ్యాంక్యూ సర్
చంద్రబాబు: థ్యాంక్యూ
గన్‌మ్యాన్లు లేకుండా...
ఓటుకు నోటు కేసులో మూలాల నుంచి విచారణ చేస్తున్న ఏసీబీ రేవంత్‌రెడ్డి గన్‌మ్యాన్లతో పాటు మరికొంతమంది వాంగ్మూలాలను కూడా సేకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన తర్వాత పలుమార్లు రేవంత్‌రెడ్డి గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లినట్లు వెల్లడయ్యింది. ఒకసారి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కూడా గన్‌మెన్‌ను వదలి వెళ్లాడని ఇదే రీతిలో నోవాటెల్‌నుంచి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లేటప్పుడు కూడా గన్‌మెన్‌ను వదిలి వెళ్లారని గుర్తించారు. సొంత పనులు అని చెప్పి కనీసం మూడుసార్లు బయటకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆ సమయాన్ని ఓటుకు నోటు వ్యవహారాలకు వెచ్చించినట్టు తేలింది.
ఈ సమయంలో రేవంత్‌రెడ్డి 14 మందిని కలిశారని వివరాలు సేకరించిన ఏసీబీ వారి వాంగ్మూలాలను రికార్డు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా గన్‌మ్యాన్ల వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాగా ఎమ్మెల్ల్యే మిమ్మల్ని వదలి వెళుతున్నప్పుడు పై అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని గన్‌మ్యాన్లను ఏసీబీ ప్రశ్నించింది. తనకు కావాలని భద్రత కుదించారని ప్రభుత్వం మీద నిందలు వేసిన రేవంత్‌రెడ్డి అసలు గన్‌మ్యాన్లే లేకుండా చీకటి వ్యవహారాలు సాగించడం గమనార్హం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి