గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 14, 2015

రేవంత్ తప్పు చేస్తే నన్నెందుకు లాగుతారు?-ఇండియాటుడే టీవీ ఇంటర్వ్యూలోచంద్రబాబు
-రాజ్‌దీప్ సూటి ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
-ఇంటరాగేట్ చేయడానికి ఏసీబీ ఎవరని కస్సుబుస్సు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తప్పు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. మాటలో మాటగా ఈ వాస్తవాన్ని ఒప్పేసుకున్నారు. తమ ఎమ్మెల్యే తప్పుచేస్తే తననెందుకు లాగుతున్నారని అమాయకంగా ప్రశ్నించారు. సంభాషణల్లో బయటపడిన గొంతే మీదేనా? వాయిస్ టెస్ట్‌కు, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమేనా? అని రాజ్‌దీప్ ఎంత సూటిగా ప్రశ్నించినా.. డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకున్నారు. ఇది కట్ అండ్ పేస్ట్, మానిప్యులేషన్ అన్నచంద్రబాబు.. అదే విషయంలో మళ్లీ ప్రశ్నించగా.. ఏమో తనకు తెలియదని బదులిచ్చారు. గొంతు మీదేనా? అని మరోసారి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలపై వివరణ ఇచ్చారుకానీ.. అసలు సంగతి చెప్పనేలేదు. ఒక కార్యకర్త తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ తననెందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీరు టీడీపీ అధ్యక్షులుకనుక.. టెలిఫోన్ సంభాషణల్లో మీ గొంతు ఉన్నదికనుక.. అని రాజ్‌దీప్ పేర్కొనగా.. తనకూ ఏసీబీ ఉందని, తనకూ పోలీసులు ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే తప్పనిసరిగా ప్రతిస్పందించారు. అంతేకానీ.. తన గొంతును నిర్ధారించేందుకు మాత్రం చంద్రబాబు ముందుకు రాకపోవడం విశేషం.


రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది...
రాజ్‌దీప్: ఓటుకు నోటు కుంభకోణంలో బయటికి వచ్చిన ఆడియో సంభాషణల్లో గొంతు మీదేనని తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. అది మీ గొంతు కాదంటూ మీరు ఖండిస్తున్నారు!

చంద్రబాబు: అది నా గొంతేనని మొదట వాళ్లు ఎలా చెప్పగలరు? ఇది పూర్తిగా అవాస్తవం.


ఇది మీ గొంతా? కాదా? అది వేరేవాళ్ల గొంతా?ఇది కల్పించినది. దీనిని మొదట కేసీఆర్‌కు చెందిన టీ న్యూస్ చానల్ లీక్ చేసింది. ఆయనకు ఎక్కడినుంచి సమాచారం వచ్చింది? ఇది మొదట ఆయన సమాధానం చెప్పాలి. మీరే (కేసీఆర్) సృష్టించి.. మీరే నాపై బురదజల్లుతున్నారు.

అది మీ గొంతు కాదని చెప్తున్నారా? ఎందుకంటే.. ఈ సంభాషణను ఎవరు విన్నా.. అది చంద్రబాబునాయుడు గొంతేనని చెప్తున్నారు.ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో అనేక మార్గాలు ఉన్నాయి. కట్ అండ్ పేస్ట్, వక్రీకరించడం..

అది కట్ అండ్ పేస్ట్, వక్రీకరణ అని మీరు చెప్తున్నారా?ఏమో నాకు తెలియదు. మేం ఈ విషయాలన్నీ కనిపెట్టాలి.

ఏసీబీ విచారణకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?ఏసీబీ ఏమిటి? నన్ను ఇంటరాగేట్ చేయడానికి మీరెవరు? ఇదొక రాష్ట్రం. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు వేరొక రాష్ట్రం ఏసీబీ. ఇది ఉమ్మడి రాజధాని ఈ రోజు. ఉమ్మడి రాజధానిలో మీకు నాపై అధికారాలు ఎక్కడివి?

ఏసీబీ విచారణలో భాగంగా మీకు సమన్లు ఇవ్వాలని వారు అనుకుంటున్నారు.మీరెవరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు నా ఫోన్లు ట్యాప్ చేయలేరు. హైదరాబాద్‌లో నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

తాము ఏపీ సీఎం ఫోన్లు ట్యాప్ చేయలేదని పేర్కొంటూ ఏసీబీ నాకు ఈ రోజు ఒక ఎస్‌ఎంఎస్ పంపింది.నేనేకాదు.. నా ప్రజల సంగతేంటి? మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

మీరు దానిని నిరూపించగలరా?మేం నిరూపిస్తాం. మీరే చూస్తారు. విచారణకు డిమాండ్ చేస్తున్నాం.

పోన్ ట్యాపింగ్ సంగతిని పక్కన పెడితే.. మీ గొంతు విషయంలో స్పష్టతకు వద్దాం. విడుదలైన టేపులో గొంతు మీదేనని తేలిపోతున్నది. మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. మీరు ఆ ఆడియో విషయంలో వాయిస్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారా?
ఈ విషయంలో మరికొన్ని అంశాలు చూడాలి. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్ స్ట్రెంత్ ఎంత? ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు? వారికి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టారు. వారికి 85 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ ఓట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? దానికి మొదట సమాధానం చెప్పాలి.

సో.. మీ ఎమ్మెల్యేలను వల్లోవేసుకున్నారని అంటారా?వలలో వేసుకోవడమే కాదు.. మా ఎమ్మెల్యేలతో వారు రాజకీయ బేరసారాలకు పాల్పడ్డారు. మోసం చేశారు. బెదిరించారు.

కానీ.. మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాలకు చిక్కారు.మీరు పూర్తిగా పొరబడుతున్నారు. టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు బీజేపీ సభ్యులున్నారు. మొత్తం 20. మాకు ఎమ్మెల్సీ గెలవడానికి 17మంది చాలు. ఇది ఎన్నికల కమిషన్ ప్రచురించిన ఎలక్టోరల్ రోల్‌లో ఉంది. రెండోది.. కాంగ్రెస్‌కు 21 మందితోపాటు అదనంగా ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉంది. వైసీపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీఎస్పీకి ఇద్దరు ఉన్నారు. వాళ్లు (టీఆర్‌ఎస్) టీడీపీకి చెందిన ఐదుగురిని, కాంగ్రెస్‌కు చెందిన నలుగురిని, ఇద్దరు వైసీపీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.

మీరు చెప్పేది ఒప్పుకుంటాను.. కానీ.. నేను అడిగేదేమంటే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారు. అరెస్టయ్యారు. అదే స్టీఫెన్‌సన్‌తో మీరు మాట్లాడినట్లు వచ్చిన ఆడియోలో హామీలన్నీ నెరవేరుస్తామని మీరు చెప్పారు.వారు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ప్రతి ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది?

మీ ఎమ్మెల్యే ఎందుకు 50 లక్షలు తీసుకునివెళ్లారు?అది వేరే విషయం..

అదే విషయం..కాదు.. కాదు.. దానిపై విచారణ జరపొచ్చు. కానీ నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు?

మీకు సమన్లు ఇస్తామంటున్నారు. నన్ను అరెస్టు చేయండని మీరు సవాలు చేయగలరా?వారికి ఏసీబీ ఉంది. నాకు ఏసీబీ ఉంది. వారికి పోలీసులున్నారు. నాకు పోలీసులున్నారు. ఉమ్మడి రాజధానిలో మీరు ఇవన్నీ ఎలా చేయగలరు? ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఎలా బెదిరిస్తారు?

మీరేమో మీ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. వాళ్లేమో ఓటుకు నోట్లు ఇస్తున్నారని అంటున్నారు.కామన్ క్యాపిటలంటే అర్థం ఏమిటి? సెక్షన్ 8 ఉంది. సెక్షన్ 8లో ఇవన్నీ ఎవరు చేస్తారు? గవర్నర్ చేయాలి. ఇది సార్వభౌమ ప్రభుత్వం.

అప్పుడు మీరు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లకూడదు? టెలిఫోన్ల ట్యాపింగ్‌పై ఆధారాలన్నీ సమర్పించవచ్చుకదా.నేను చాలాసార్లు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాను. కేసీఆర్‌కు కూడా చాలాసార్లు అప్పీలు చేశాను. విభజన తర్వాత మనం కూర్చుని, అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలుగు ప్రజలు ఒక్కటే. ప్రభుత్వాలు, పార్టీలు వేర్వేరు. రాజకీయంగా మనం పోరాడుకోవచ్చు. కానీ ప్రభుత్వాలుగా మనం సహకరించుకోవాలి. ఆయన వీటిని ఎప్పుడూ పట్టించుకోలేదు.

రాష్ట్రపతికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు సమర్పించవచ్చు కదా.. టెలిఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని మీరు కోరనున్నారా? మీ సొంత ఏసీబీని ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశిస్తారా?తప్పకుండా

మీరు టెలిఫోన్ ట్యాపింగ్‌పై మీరు కేసీఆర్ ప్రభుత్వంపై విచారణకు ఆదేశిస్తారు.. వారేమో ఆలోపే మీపై ఓటుకు నోటు కేసులో విచారణకు ఆదేశిస్తారు.. మనం ఎలాంటి పరిస్థితికి వెళుతున్నాం?దీనికి ఎవరిది బాధ్యత?

కేసీఆర్‌దా బాధ్యత? మీకు సమన్లు ఇవ్వాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని సవాలు చేస్తున్నారా?మేం ఏమీ చేయం. వాళ్లను సమన్లు ఇవ్వమనండి. అప్పుడే మేం ఏం చేయాలో అది చేస్తాం.

ఆయన గవర్నర్‌ను కలిసి మీకు నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరుతారేమో.. అవసరమైతే ప్రాసిక్యూట్ చేస్తారేమో!వాళ్లు నోటీసులు ఇచ్చిన తర్వాత మాకు ఉన్న ఆధారాలేంటి? అధికారాలేంటి? పరిశీలిస్తాం. ప్రజాస్వామ్యంలో నన్ను ఎలా బెదిరిస్తారు? నన్ను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఆయనే అంతా చేశారు. నా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఎలక్టోరల్ రోల్‌లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది తప్పు కాదా? ఇది ముడుపుల వ్యవహారం కాదా?

ఇలా ఎమ్మెల్యలను ఉభయ పక్షాలు ప్రలోభపెడుతూ పోతే..నేనేమీ ప్రలోభపెట్టడం లేదు.

మీ ఎమ్మెల్యే 50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.ఏదైనా పార్టీలో ఒక కార్యకర్త తప్పు చేస్తే చట్టం ప్రకారం వెళ్లవచ్చు. అది వేరే విషయం. కానీ నన్ను ఎందుకు లాగుతున్నారు?
(Suppose any party.. one functionary has committed a mistake. Its OK. According to law it has to be acted. That is different issue. Why you are dragging me?


ఎందుకంటే మీరు టీడీపీ అధ్యక్షులు.. ఇది మీకు ఇబ్బందికర అంశం. మీ గొంతు ఆడియో టేప్‌లలో ఉంది. అందుకే వారు మిమ్మల్ని లాగుతున్నారు. (Because you are the president of the TDP and it has embarrassed you and your voice is in the audio tape. Thats why they are dragging you into this.)


అదే నేను చెప్తున్నాను. ఉమ్మడి రాజధానిలో మీరు ఇలాంటివన్నీ స్టింగ్ ఆపరేషన్‌ల ద్వారా లేదా కల్పితాలు సృష్టించి.. మీ ఇష్టం వచ్చినట్లు చేయలేరు. మీకు ఉన్న హక్కు ఏంటి?

రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడి సరిగ్గా సంవత్సరం అవుతున్నది. ఇప్పుడు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రులు ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

దీనికి ఎవరిది బాధ్యత? కేసీఆర్‌దా బాధ్యత?అవును.. ఆయనదే. ఈ పరిస్థితి ఆయనే సృష్టిస్తున్నారు.

ఒకవేళ ఆయన మిమ్మల్ని ముట్టుకుంటే మీ పోలీసులు, మీ ఏసీబీ స్పందిస్తాయా?తప్పకుండా స్పందిస్తాం. నాకు సార్వభౌమ అధికారాలు ఉన్నాయి.(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి