-రేవంత్ నోట.. పదేపదే బాబు మాట
-నిందితుడిగా చేర్చవచ్చన్న నిపుణులు
-న్యాయపరంగా అవకాశాలున్నాయని వ్యాఖ్య
-ఉదాహరణగా పీవీపై జేఎంఎం ముడుపుల కేసు
-నాటి ప్రధానికే శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు జడ్జి
-చట్టం తన పని తాను చేస్తే బాబు జైలుకే!
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓటుకు పచ్చ పార్టీ నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకూడా నిందితుడవుతారా? ఈ కేసులో చంద్రబాబు తన సంబంధాన్ని తప్పించుకోలేరా? ఆయన పేరును ఏసీబీ తన చార్జిషీట్లో చేర్చుతుందా? గతంలో ఇటువంటి ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతున్నది. పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు చెప్తున్న మాటలు ఏపీ సీఎంకు రానున్నది గడ్డుకాలమేనని తేల్చేస్తున్నాయి. ఈ కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల్లో మాటకు ముందు ఒకసారి, చివర ఒకసారి చంద్రబాబు పేరు ఉచ్చరించడంతోపాటు.. చంద్రబాబే తనను పంపించారని, కావాలంటే చంద్రబాబుతో నేరుగా మాట్లాడొచ్చని చెప్పారు. -నిందితుడిగా చేర్చవచ్చన్న నిపుణులు
-న్యాయపరంగా అవకాశాలున్నాయని వ్యాఖ్య
-ఉదాహరణగా పీవీపై జేఎంఎం ముడుపుల కేసు
-నాటి ప్రధానికే శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు జడ్జి
-చట్టం తన పని తాను చేస్తే బాబు జైలుకే!
నాయుడుగారు తల్చుకుంటే కోరుకున్నది రెండు గంటల్లో ముడుతుందని హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ వీడియోల్లో నిక్షేపంగా రికార్డయిపోవడంతో రేవంత్ పట్టుబడటమేకాకుండా.. చంద్రబాబు కొంప కొల్లేరు కాక తప్పదనే అభిప్రాయమూ బలంగా విన్పిస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు చేస్తున్నవి అడ్డగోలు, పసలేని వాదనలేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి కేసులలో ప్రత్యక్షంగా సీన్‌లో లేకపోయినప్పటికీ.. సూత్రధారులను సీబీఐ తదుపరి విచారణల్లో చేర్చిన ఉదంతాలను న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
జేఎంఎం ఎంపీల ముడుపుల కేసులో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు సైతం ఈ విధంగానే కోర్టు బోనెక్కిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధానికే శిక్ష పడగా లేనిది.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మినహాయింపు ఏముంటుందనే అభిప్రాయం విన్పిస్తున్నది. చంద్రబాబు పేరును పదేపదే తన సంభాషణల్లో రేవంత్ ప్రస్తావించిన నేపథ్యంలో బాబును నిందితుల జాబితాలో చేర్చేందుకు వందశాతం అవకాశాలు ఉన్నాయని పలువురు రిటైర్డ్ డీజీపీలు సైతం అభిప్రాయపడుతున్నారు. దీంతో ఓటుకు పచ్చ పార్టీ నోటు స్కాంను ఏసీబీ ఏ తరహాలో దర్యాప్తు చేయనుందనే అంశంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో జరిగిన అవినీతి కేసులలో సీబీఐ పాటించిన విధానాలను ఏసీబీ అనుసరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సీబీఐ తరహాలో
అవినీతి, అక్రమాలు, కుట్రలు తదితర కేసులను సీబీఐ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంటుంది. దర్యాప్తు ముమ్మరం చేస్తూ.. మరిన్ని ఆధారాలు సేకరిస్తూ.. విచారణ సందర్భంగా నిందితులు ఇచ్చే సమాచారం మేరకు మరింత మంది పేర్లను చార్జిషీట్లలో చేర్చుతుంటుంది. వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులోనూ సీబీఐ ఇదే తరహాలో దర్యాప్తు కొనసాగించింది. ఆ కేసులో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు ముందుగా ఎఫ్‌ఐఆర్‌లోకి రాలేదు. కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో సేకరించిన వాంగ్మూలాలు, జారీ అయిన జీవోలు, రికార్డుల ఆధారంగా అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ కొత్తగా కొందరి పేర్లు చేర్చింది. ఇదే తరహాలో రేవంత్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు సాగే అవకాశం ఉందని చెప్తున్నారు.
పీవీపైనా అదే కేసు
తాజా ఘటనపై అవినీతి నిరోధక చట్టంలోని 12వ సెక్షన్‌తోపాటు.. ఐపీసీ 120(బీ), 34 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఇందులో క్రిమినల్ కాన్‌స్పిరసీ (నేరపూరిత కుట్ర) జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించి 120(బీ) సెక్షన్‌ను జోడించింది. ఇవే సెక్షన్ల కింద గతంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావును జేఎంఎం ముడుపుల కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. తెలివైన రాజకీయ నాయకుడిగా ఆయన అనుయాయులు కీర్తించుకునే చంద్రబాబు ఆపరేషన్ మునుపెన్నడూ ఇంత దారుణంగా విఫలమైంది లేదు. ఇంత నగ్నంగా దొరికిపోయిదీ లేదు.
ఈ నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకుపోతే చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రేవంత్ పట్టుబడిన కేసులో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో చంద్రబాబు ప్రధాన నిందితుడు అవుతాడని న్యాయ ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. తనను చంద్రబాబే పంపించారని రేవంత్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా నిందితుడు అవుతాడని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్‌లు కలకలం రేపుతున్నాయి. సెక్షన్ 120(బీ) (కుట్ర), 34 (కుట్రలో అందరిదీ ఒకే ఉద్దేశం)లలో చంద్రబాబు కచ్చితంగా నిందితుడు అవుతారని తెలుస్తున్నది. పలువురు మాజీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.
ఓటు నోటు కేసులో చంద్రబాబే ఏ1: శ్రీరంగారావు, సీనియర్ న్యాయవాది
రేవంత్ కేసులో చంద్రబాబు నిందితుడే. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్‌ల ఆధారంగా చంద్రబాబు నిందితుడిగా నమోదవతారు. ఈ వ్యవహరంలో ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని ఆధారాలు లభిస్తాయి. వాటి ఆధారంగా చంద్రబాబు నిందితుడుగా బుక్ అవుతారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారుతుంది. దీంతోపాటు చంద్రబాబు పంపిస్తేనే తాను వచ్చానని, ఆయనే తనను నేరుగా పంపారని రేవంత్‌రెడ్డి పదేపదే స్పష్టంగా చెప్పడం వీడియోల్లో రికార్డయింది. వాటిని ఆధారంగా చేసుకుని కూడా చంద్రబాబును నిందితుడిగా నమోదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.
చంద్రబాబు నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేరాల్సిందే: మాజీ డీజీపీ
రేవంత్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేరాల్సిందే. ఇప్పటికే ప్రాథమికంగా ఆధారాలు ఉన్నప్పటికీ విచారణలో నిందితులు ఇచ్చే వాంఙ్మూలంలో వెల్లడయ్యే అంశాలతో చంద్రబాబు అక్యూస్డ్‌గా నమోదవుతారు. దీంతోపాటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న 50 లక్షల నగదు ఎక్కడిదనేది తేలాల్సి ఉంది. ఆ నగదుకు సరైన లెక్కలు ఉన్నాయా? ఐటీ రిటర్న్స్‌లో ఈ నగదు వివరాలు ఉన్నాయా? అనే అంశాలు తేలుతాయి. ఈ నగదు చంద్రబాబు నుంచి వచ్చిందని నిర్ధారణైతే ఆయనకు కేసునునుంచి తప్పించుకునే అవకాశాలు ఉండవు. అతను విచారణను ఎదుర్కోవాల్సిందే.
అంతా కుట్ర పూరితమే: మాజీ ఐపీఎస్
ఓటు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రపన్నాడని వీడియో సంభాషణలు ఇప్పటికే స్పష్టంచేస్తున్నాయి. నిందితుడిగా నమోదుకు ఆధారాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి నిందితుల వాంగ్మూలంలో వెల్లడైయ్యే అంశాల ఆధారంగా చంద్రబాబు నిందితుడిగా దొరికిపోతారు. ప్రధానంగా నగదు వచ్చిన మార్గంతోపాటు పాటు వీడియో, ఆడియో ఫుటేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం ఈ కేసులో నిందితుడిగా నమోదవడంతో పాటు కేసు విచారణను ఎదర్కోవాల్సి వస్తుంది. ప్రజా సేవ ముసుగులో నలధనంతో రాజకీయాలు చేస్తున్న ప్రజాప్రతినిధులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం కలుషితం కాకుండా ఉంటుంది.
చంద్రబాబుకు దారేది?
తెలంగాణలో ఏదోవిధంగా పట్టు నిలుపుకోవాలన్న చంద్రబాబు తపన, రెడ్డి కులంలో ప్రముఖ నాయకుడిగా ఎదగాలన్న రేవంత్‌రెడ్డి అత్యాశ, 2019లో తెలంగాణలో అధికారం సాధించడంపై కన్ను.. ఇవన్నీ ప్రస్తుతం టీడీపీని కుడితిలో పడిన ఎలుకను చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నాయకుడికీ ఒక రోజు వస్తుంది. అదే సమయంలో ప్రతి నాయకుడికి ఒక ముగింపు అనేది కూడా ఉంటుంది. చంద్రబాబు తెలుసుకోనిది ఇదేనని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు ఇంత వరకూ నోరు విప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు ముందు రెండే మార్గాలున్నాయి. రేవంత్‌రెడ్డికి అండగా నిలిచి.. తాను కూడా కేసులో భాగస్వామి కావడం. లేదా రేవంత్‌ను పార్టీ నుంచి బహిష్కరించి.. ముడుపుల కేసుతో తనకు సంబంధం లేదని ప్రకటించుకోవడం! తప్పించుకోడానికి చంద్రబాబుకు వేరే మార్గంలేదు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి