గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 17, 2015

ఇది...ఈనాడా...ఆంధ్రానాడా???

-కరువు జిల్లాలకు నీళ్లిద్దామంటే..ఈనాడుకు, చంద్రబాబుకు ఎందుకింత కడుపుమంట?
-లేని జలజగడాల ఎత్తిపోత ఎందుకు?
-సమైక్య జీవోలకే ప్రాణం పోస్తే..ఈనాడుకు ఎందుకింత ఉలికిపాటు?
-పసిపిల్లలను అమ్ముకునే దేవరకొండకు పచ్చని తోరణం
-కడదామంటే ఈనాడు ఎందుకిలా వలపోస్తున్నది?
-ఫ్లోరైడుతో వంగికుంగి అలమటిస్తున్న జనానికి
-ఇన్ని మంచినీళ్లిద్దామంటే ఈనాడు ఎందుకు ఉడుక్కుంటున్నది?
-వలసల జిల్లా పాలమూరుకు తాగునీరు, సాగునీరు అందించాలని
-ప్రయత్నిస్తే ఈనాడు ఎందుకింత మంటపెడుతున్నది?
-తెలంగాణ సొమ్ముతో, హైదరాబాద్ ఆదాయంతో సోకుచేసుకునే
-ఈనాడు ఆంధ్రా పాట ఎందుకు పాడుతున్నది?
-కృష్ణా జలాలు ఆంధ్రాకేగానీ తెలంగాణ ప్రజలకు వద్దా?
-కోటిమందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొచ్చేందుకు
-ఆలోచన చేస్తే ఈనాడు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది?
-అసలు జల జగడం ఎక్కడిది? చర్చ ఎవరితో?
-ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన
-కృష్ణా నది నీటి హక్కులపై నేటి నుంచి వరుస కథనాలు..






తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్న సోయి, జ్ఞానం ఇంకా ఆంధ్ర నాయకత్వానికి, ఆంధ్ర పత్రికలకు కలిగినట్టు లేదు. పొద్దునలేస్తే తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నవీ లేనివీ వండివార్చుతున్నరు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు లొల్లిపెడుతున్నరు. ఐదున్నర దశాబ్దాలపాటు మూడు తరాల తెలంగాణ ప్రజలను ఎండబెట్టి, కరువులు, వలసలు, ఫ్లోరైడు పీడన, పిల్లల అమ్మకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులపాలు చేసిన పాపాన్ని కడుక్కోకపోగా, ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్టు, తెలంగాణపైన వారికి ఇంకా ఏదో పెత్తనం మిగిలి ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిండి, పాలమూరు ప్రాజెక్టులు చట్టవ్యతిరేకమని కేంద్రానికి లేఖలు రాస్తరు. వెంటనే ఈనాడు పత్రిక గోడెక్కి గాయిగాయి చేస్తది. 


enadu


రాతలు కోతలు ప్రచారాలు సాగిస్తది. ఈనాడు ఇలా దొంగేడుపులు ఏడవడం ఇదే మొదటిసారికాదు. ఒకసారి శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రదే అని రాసింది. మరోసారి శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మంచినీటికి కటకట వస్తుందని వాపోయింది. కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఆంధ్ర ఆగమైపోతుందని ఇప్పుడు బెంగపడుతున్నది. అబద్ధానికి నోరెక్కువ అని సామెత. 


సమైక్యాంధ్ర నాయకత్వం, సమైక్య పత్రికలు నోరుపెట్టుకునే ఇంతకాలం తెలంగాణను శాసించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవే పెడబొబ్బలు, అరుపులతో తెలంగాణ ప్రజలపై స్వారీ చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబునాయుడు, అంతకుముందు వారి మామ మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. దత్తత జిల్లాకు చంద్రబాబు చేస్తున్న మేలు ఇదా? అని మహబూబ్‌నగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు.


ఒకటి వైఎస్ ఇచ్చినది.. మరోటి కిరణ్ ఇచ్చినది..


విచిత్రం ఏమంటే 2007 జూలై 7న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం డిండి ఎత్తిపోతలకు 1.3కోట్లతో పాలనాపరమైన అనుమతినిస్తూ జీవో విడుదల చేసినప్పుడు ఈనాడు ఏడవలేదు. 2013 ఆగస్టు 8న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరువు జిల్లాకు 70 టీఎంసీల నీటిని తీసుకునే ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 6.91 కోట్ల ఖర్చుతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చినప్పుడు కూడా ఈనాడు ఎటువంటి రాతలు రాయలేదు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2007లోనే అప్పటి మంత్రి జానారెడ్డి నల్లగొండ మునుగోడులో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి సమర్పించారు. అప్పుడు కూడా ఈనాడు నోరు మెదపలేదు.


enadu1


ఇప్పుడు మాత్రం తెగ ఉడికిపోతున్నది. అప్పుడయినా ఇప్పుడయినా తెలంగాణ తీసుకుంటున్నది తనకు హక్కుగా ఉన్న కృష్ణా నదీ జలాలనే. కానీ ఇందులో ఏదో పెద్ద జగడం ఉన్నట్టు సీను క్రియేట్ చేసి, వివాదం సృష్టించి తెలంగాణ నోట్లో మట్టికొట్టాలన్న తాపత్రయం ఈనాడు రాతల్లో పదేపదే వ్యక్తం అవుతున్నది. ప్రాజెక్టులు మొదలుపెట్టినట్టు మొదలుపెట్టడం, జీవోలు ఇవ్వడం, వివాదాల్లో జొప్పించడం, ప్రజలను ఏమార్చడం సమైక్య ప్రభుత్వాల నాయకులకు చెల్లింది. ఆ జీవోలే ఉరితాళ్లవుతాయని వారు గుర్తించలేదు అని నీటిపారుదల నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 


ఇంతకాలం ఆంధ్రకొక నీతి, తెలంగాణకొక నీతి అన్నట్టుగా నడిచింది. ఇప్పుడు కూడా అలాగే నడవాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.మరి పట్టిసీమకు అనుమతులేవి? గోదావరిపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పట్టిసీమకు అనుమతులేవీ అని ప్రశ్నిస్తే సంసారం చేయడానికీ కేసీఆర్ అనుమతి కావాలేమో! అని ఆంధ్ర ముఖ్యమంత్రి వెటకారం ప్రదర్శిస్తారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టాలంటే కచ్చితంగా తెలంగాణ ఆమోదం కావాలి. గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటిని మళ్లించే పనయితే, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో 45 టీఎంసీల నీటిని నది ఎగువన ఉన్న ప్రాంతాలకు-అంటే తెలంగాణకు సర్దుబాటు చేయాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 


అదే విధంగా కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు కృష్ణలో సర్దుబాటు చేయాలని బచావత్ నివేదికలో పొందుపరిచారు. బచావత్ ఆదేశాల ప్రకారం ఆ 45 టీఎంసీలు లెక్కచెప్పకుండా పట్టిసీమను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తే చంద్రబాబు ఇష్టంవచ్చినట్టు మాట్లాడారు. ఇవ్వాళ గొంతెండిన ప్రాంతాలకు, కరువుతో అలమటిస్తున్న ప్రాంతాలకు నీరివ్వడానికి తెలంగాణ నడుంబిగిస్తే ఆ ప్రాజెక్టులకు అనుమతులేవి అని ఈనాడు, చంద్రబాబు కూడబలుక్కుని ప్రశ్నిస్తున్నరు. 


ఇదేమీ నదిపై ఆనకట్ట కాదు


తెలంగాణ ఆంధ్రతో కలవకపోయి ఉంటే ఎంతో బాగుపడి ఉండేది. తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినవారే లేరు. అయినా అక్కడి పరిస్థితులు గమనించి మేమే జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నం. ఈ ప్రాజెక్టుకు 18 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నం అని జస్టిస్ బచావత్ 1974లో పేర్కొన్నారు. ఆంధ్ర నాయకుల దుర్మార్గాలను ఏ నివేదికను కదిలించినా పట్టిస్తాయి. కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత అంటే సమైక్య ప్రభుత్వాలు ఒకసారి 296 టీఎంసీలు అని చెప్పాయి. మరోసారి 368 టీఎంసీలు అని చెప్పాయి. ఈ వివరాలన్నీ జీవోల్లో, శాసనసభలో నీటిపారుదల మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఉన్నవే. ఇప్పుడు కొత్తగా మేమేమీ కనిపెట్టినవి కాదు. 


ఇందులో 90 టీఎంసీలు మన చెరువులు కుంటలల్లోని నీటిని లెక్కేసి చెప్పారు. ఆ 90 టీఎంసీలు పోతే మిగిలిన 206 టీఎంసీలకూ లేక 278 టీఎంసీలకు ప్రాజెక్టులవారీగా లెక్కలు చెప్పాలిగా! ఈ ఐదున్నర దశాబ్దాల్లో తెలంగాణలోని అన్ని కృష్ణా ప్రాజెక్టుల కింద కలిపి 100 టీఎంసీలకు మించి ఎన్నడూ వాడుకోలేదు. ప్రాజెక్టులు లేవు. ఉన్న ప్రాజెక్టుల కింద నీళ్లు దక్కనివ్వలేదు అని నీటిపారుదల నిపుణుడు వివరించారు. 


నీళ్లు, నిధులు, నియామకాలకోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. స్వరాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించిన కే చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకున్నారు. ఆయనయితేనే తెలంగాణ కలలను సాకారం చేయగలరని ప్రజలు భావించారు. ఆయన ఇప్పుడు తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టి తీరాలని ఆయన పట్టుదలతో ముందుకెళుతున్నారు అని ఆయన చెప్పారు.


కడుతున్నవేవీ కొత్తవి కాదు


తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదికి అడ్డంగా కొత్త ఆనకట్టలు కట్టడం లేదు. కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదు. శ్రీశైలంలో నీళ్లు లభించినప్పుడు తమకు హక్కుగా కేటాయించిన నీటిని తీసుకోవడానికి ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ జలాలను తిరిగి రెండు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ వాదన వినాలని సుప్రీంకోర్టు బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. ట్రిబ్యునల్ తెలంగాణ వాదనలు విని కృష్ణా నీటిని పునఃపంపిణీ చేయాల్సి ఉంది. 


నీటి కేటాయింపుల విషయం తేలకుండా కృష్ణా బోర్డు చేయగలిగింది ఏమీ లేదు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చకుండా కృష్ణా బోర్డు ఏ అంశంపై చర్చిస్తుంది? అని నీటిపారుదల నిపుణుడొకరు ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏవైనా ప్రాజెక్టులు చేపట్టాలంటే అనుమతులు కావాలి. విభజనకు ముందే రూపకల్పన ప్రాజెక్టులకు ఎటువంటి ఆంక్షలు లేవు.


జటిలం చేసేందుకు ఈనాడు కుట్ర


కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ పరిశీలించని జలవివాదాలు ఏవైనా తలెత్తితే కేంద్రం కొత్తగా ఒక ట్రిబ్యునల్‌ను వేయాలి అని పునర్విభజన చట్టంలోని 84 సెక్షన్ 3(4) స్పష్టంగా పేర్కొంది. కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. అంతేకాదు ఒకే రాష్ట్రంగా పరిగణించి నివేదికను రూపొందించింది. ఇప్పుడు రెండు రాష్ర్టాలుగా విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్ర మధ్య నీటి పంపిణీ సమస్యను ట్రిబ్యునల్ పరిశీలించలేదు. ఎవరి వాటా ఎంతో తేల్చలేదు. 


అది తేల్చాలని తెలంగాణ కోరుతున్నది. ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని తెలంగాణ కోరుతున్నది. ఒకవైపు ఇటువంటి ప్రయత్నాలు కొనసాగుతుంటే మరోవైపు ఈనాడు వంటి పత్రికలు తరచూ లేని వివాదాలను ముందుకు తెచ్చి, సమస్యను జటిలం చేయాలని చూస్తున్నాయి. ఆంధ్ర యాజమాన్యాల్లో నడుస్తున్న పత్రికలు బతికేది హైదరాబాద్ ఆదాయంతో. నడిచేది ఇక్కడి పాఠకుల సొమ్ముతో. కానీ వారు నిత్యం ఆలోచిస్తున్నది, రాస్తున్నది ఆంధ్ర పక్షపాతంతో. ఒక్క రోజయినా తెలంగాణ మేలుకోరి ఒక్క వార్తయినా ఈ పత్రికలు రాస్తున్నయా? వీళ్లు ఇంకా ఎప్పుడు మారుతరు? ఏమిటి వీళ్ల ధీమా? అని తెలంగాణ జర్నలిస్టు, రచయిత ఒకరు ప్రశ్నించారు.


ఒక్కటీ నిలిచేది కాదు


ఈనాడు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ లేఖలోని ఏ అంశం కూడా నిలబడేది కాదు. ఎందుకంటే ఏపీ సర్కారు చెప్పినట్లు.. ఇవి కొత్త ప్రాజెక్టులు కావు. ఆ లేఖలో రాసిన మొదటి పాయింటు.. విభజన చట్టం-2014 లోని సెక్షన్ 84(3) ప్రకారం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిశీలనకు, కేంద్ర జల సంఘం అంగీకారానికి పంపాలి.. ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలపాలి.. అని పేర్కొన్నారు. సరిగ్గానే చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఏవి నిర్మించినా పై ప్రక్రియ నడవాల్సిందే. కానీ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రస్తుత రెండు ప్రాజెక్టులు కొత్తవి కాదే! గత ప్రభుత్వంలో పరిపాలన అనుమతులు జారీ అయిన ప్రాజెక్టులే! ఈ నేపథ్యంలో ఈ పాయింట్ ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లుబాటు కాబోదు. 


తదుపరి.. సెక్షన్ 85(8)డీ ప్రకారం కృష్ణా, గోదావరిలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జరిగిన కేటాయింపులపై ఎలాంటి ప్రభావం ఉండదన్న నిర్థారణకు వచ్చిన తర్వాతనే పరిగణనలోకి తీసుకోవాలి.. అని పేర్కొన్నారు. ఇదీ సరైనదే. ఈ రెండూ కొత్త ప్రాజెక్టులు కావన్న సమాధానమే దీనికీ వర్తిస్తుంది. మూడో పాయింటులో విభజన చట్టం 11వ షెడ్యూలులోని ఏడవ పేరాలో ఏముందో చెప్పారు. అందులోనూ కొత్తగా చేపట్టే ప్రాజెక్టులనే రాశారు. 


కృష్ణా ట్రిబ్యునల్-2 కాలపరిమితిని కూడా లేఖలో ప్రస్తావించారు. నిజానికి కృష్ణా ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి కేటాయింపులు చేసింది తప్పించి.. ఉమ్మడి రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు విడిగా కేటాయింపులు జరుపలేదు. రాష్ట్ర విభజన దరిమిలా కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణ మరో భాగస్వామిగా చేరింది. కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించని జల వివాదాలు ఏవైనా తలెత్తితే కేంద్రం కొత్తగా ఒక ట్రిబ్యునల్ వేయాలని విభజన చట్టంలోని 84వ సెక్షన్ 3(4) స్పష్టంచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ర్టాలుగా విడిపోయి రీత్యా తన వాటా ఎంతో తేల్చాలని తెలంగాణ కోరుతున్నది. ఇందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. చివరి అంశంలోనూ తన అభ్యంతరం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపైనేనంటూ ఏపీ స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఈ లేఖకు విలువెక్కడిదని నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి